ఇది పొగచూరడం లాంటి ఏవో అడ్డంకులతో, ఊపిరిత్తుల్లో వచ్చే సమస్యతో, దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధితుల్ని వేధించే జబ్బు అని పేరును బట్టి తెలుస్తుంది. దగ్గు, ఆయాసంతో వ్యక్తమయ్యే ఈ సమస్య ప్రధానంగా పెద్దవారినే వేధిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక (జన్యు) కారణాలతో చిన్న వయసువారిలో కూడా కనిపించవచ్చు. పొగతాగే అలవాటుతో పురుషుల్లో, ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఉంటే... ఈ కారణంగా మహిళల్లో ఈ జబ్బు కనిపించే అవకాశాలెక్కువ. అసలే దగ్గుతో ఊపిరి సలపనివ్వని ఈ సమస్య, చలి కాలంలోని చల్లటి వాతావరణానికి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది. దీని పేరే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. సంక్షిప్తంగా సీఓపీడీ అని పిలిచే ఈ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.
దగ్గు ప్రధానంగా లక్షణంగా వ్యక్తమయ్యే సీవోపీడీ సమస్య పెద్దల్లో... అందునా 40 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లూ, బీడీలూ, చుట్టలూ, హుక్కా కాల్చే వారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యాల్లో ఉండే దుమ్మూ, ధూళితో పాటు బొగ్గుగనులు, సిమెంట్, టెక్స్‌టైల్స్, రసాయనాల కాలుష్యం వెలువడే పరిశ్రమల దగ్గర ఉండేవారిలోనూ, ఆభరణాలకు పూతపూసే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి కార్ఖానాల్లో పనిచేసేవారిలో కూడా ఇది ఎక్కువ.
కారణాలు..
పొగతాగే అలవాటు ఉన్నవారిలో లేదా నిత్యం కాలుష్యాలకు ఎక్స్‌పోజ్ అవుతున్నవారిలో ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే శ్వాసనాళాలు వాపునకు గురవుతాయి. దాంతో ఊపిరి సరిగా అందదు. లంగ్స్ నిండుగా, కాస్త బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇక ఆస్తమా ఉన్న వ్యక్తులు సరైన చికిత్స తీసుకొని దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోని సందర్భాల్లో... దీర్ఘకాలిక దుష్ప్రభావంగా సీవోపీడీ రావచ్చు.
లక్షణాలు..
సీవోపీడీలో దగ్గు, ఆయాసాలు ప్రధాన లక్షణాలు. అయితే తీవ్రతను బట్టి ఇతరత్రా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా తీవ్రతను బట్టి ఈ వ్యాధిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... గోల్డ్ 1 (మైల్డ్), గోల్డ్ 2 (మోడరేట్), గోల్డ్ 3 (సివియర్), గోల్డ్ 4 (వెరీ సివియర్). ఇక్కడ గోల్డ్ అనేది ‘గ్లోబల్ అబ్‌స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్’ అనే సంస్థకు సంక్షిప్త రూపం. ‘గోల్డ్’ సంస్థ... సీవోపీడీ మీద పరిశోధనలు చేస్తూ పల్మనాలజిస్టులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తుంది.
సీవోపీడీ అనగానే కేవలం ఊపిరితిత్తుల సమస్య అనే అనుకుంటాం. కానీ బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలూ ఎక్కువే ఉంటాయి. మచ్చుకు... ఆస్టియో పోరోసిస్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్ పల్మొనాలె... మొదలైన సమస్యలతో ఇది కలిసి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ, చికిత్స అందించాల్సి ఉంటుంది, దీనినే ‘సిండమిక్ అప్రోచ్’ అంటారు. ఈ నెలలోనే 2024కు సంబంధించిన కొత్త చికిత్స మార్గదర్శకాలను ‘గోల్డ్’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు.
వ్యాధి నిర్ధారణ..
స్పైరోమీటర్ అనే పరికరం సహాయంతో సీవోపీడీని నిర్ధారణ చేస్తారు. దీనితో కొన్ని శ్వాస పరీక్షలు చేసి, సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. అంటే మైల్డ్, మోడరేట్ లేదా సమస్య తీవ్రం (సివియర్)గా ఉందా అని తెలుసుకుంటారు. ఈ పరీక్షకు ముందరే... బాధితులను వ్యక్తిగతంగా / క్లినికల్‌గా పరీక్షించడంతో డాక్టర్లకు కొంత అవగాహన వస్తుంది. ఇలా చేసే క్లినికల్ పరీక్షల్లో బాధితుల వృత్తి వివరాలూ (ప్రొఫెషనల్ హజార్డ్స్), వారు పనిచేసే చోటు, వారుండే చోట కాలుష్య ప్రభావాలూ, పొగతాగడంలాంటి వారి అలవాట్లు... ఇవన్నీ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.
ఐఓఎస్ అనే పరికరం ప్రారంభ దశలో ఉన్న సీవోపీడీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
అపోహ–వాస్తవం
ఈ వ్యాధి ఉన్నవారు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ ఉంటారు. దాంతో ఇదో అంటువ్యాధిలా అనిపిస్తుంది గానీ నిజానికి ఇది అంటువ్యాధి కానే కాదు. చికిత్స.. పేరులోనే దీర్ఘకాలిక సమస్య అని చెప్పే ఈ వ్యాధికి చికిత్స కూడా దీర్ఘకాలికంగానే అవసరమవుతుంది. సీవోపీడీ లక్షణాలు కనిపించినప్పుడు దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి, సీవోపీడీని అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు.
వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ (ఇన్‌హేలర్స్ / నెబ్యులైజర్స్)ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించగానే అవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత హాయిగా, తేలిగ్గా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. సీవోపీడీకి దీర్ఘకాలం చికిత్స అవసరం కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించినట్లు ఫాలో
అప్‌కు వెళ్తూ చికిత్స పూర్తయ్యేవరకు కొనసాగించాలి.
నాన్ ఫార్మలాజికల్ థెరపీ..
సీవోపీడీతో బాధపడేవారిలో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దానిని క్లియర్ చేసే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది.
హోమ్ ఆక్సిజన్ థెరపీ : ఇది చికిత్సలో మరో ప్రక్రియ. తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారికి 19 గంటల పాటు ఇంటి దగ్గరే ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది.
పల్మునరీ రీ–హ్యాబిలిటేషన్:
ఇది చికిత్సలో ఇంకో ప్రక్రియ. తేలిక నుంచి ఓ మోస్తరు వరకు అవసరమున్న వ్యాయామాలు (పర్స్ లిప్ బ్రీతింగ్), అబ్డామినల్ బ్రీతింగ్‌తో పాటు చిన్న బరువులతో కండరాలను బలంగా చేసే (మజిల్ స్ట్రెంతెనింగ్) వ్యాయామాలు చేయడం అవసరం.
నివారణ..
పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండటం / అప్పటికే పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయడం మంచి నివారణ. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం/కళ్లె మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మోతాదు బాగా తగ్గి, పనిచేసే శక్తి, సామర్థ్యాలు తగ్గుతాయి.
(చదవండి: ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?)
∙
Comments
Please login to add a commentAdd a comment