మీ నోరు బాగుందా? నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్నది సామెత. అందులోని నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, మన నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందన్నది వైద్య నిపుణుల మాట. కొందరి నోటి నుంచి చెడు వాసన వస్తుంటుంది. అది వారికి తెలియదు.
ఒకవేళ తెలిసినా, అది కేవలం నోటి సమస్య మాత్రమే అనుకుని నోటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం, మౌత్‌వాష్‌లను వాడటం వంటివి చేస్తారు. కానీ, చెడు శ్వాస అనారోగ్యానికి సంకేతమనే సంగతి మీకు తెలుసా?
అవును. అది నిజం. బాగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంటే తప్పకుండా అనుమానించాలి. శరీరంలో నీరు తగ్గినట్లయితే.. ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు ఇస్తుంది మెదడు. ఆ సమయంలో ఆహారానికి బదులు నీళ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. నోరు పొడిబారితే లాలాజలంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణం తగ్గిపోయి నోటినుంచి చెడు వాసన వస్తుంది. అలర్జీలు కూడా కారణమే నోటి శుభ్రత పాటించకపోవడం, అలర్జీల వంటి సమస్యల వల్ల కూడా శ్వాస దుర్వాసన వస్తుంది. ఒకవేళ మీరు నోటిని శుభ్రంగా ఉంచుకుంటూ.. తగినన్ని నీళ్లు తాగే అలవాటు ఉన్నా సరే నోరు చెడు వాసన వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా నోటి నుంచి చెడు వాసన వస్తుంది. కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వివిధ అనారోగ్య సమస్యలు, చెడు అలవాట్ల వల్ల కూడా నోటినుంచి దుర్వాసన వస్తుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను మార్చడం ముఖ్యం, అలాగే నాలుక స్క్రాపర్, ఫ్లాసర్ కూడా మార్చాలి. ఈ సాధనాలు మీ దంతాలు, చిగుళ్ళు, నాలుకను శుభ్రంగా ఉండేలా చూస్తాయి. పంటినొప్పి, చిగుళ్ళలో వాపు వంటి బాధాకరమైన పరిస్థితులకి దారితీసే అసౌకర్యాలను నివారిస్తాయి. భోజనం చేసిన తర్వాత ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం సహజమైన మౌత్‌వాష్‌గా పని చేస్తుంది, ఇది మీ నోటి పరిశుభ్రతను మరింత మెరుగుపరుస్తుంది.
సరైన నోటి పరిశుభ్రత కోసం సాఫ్ట్–బ్రిస్టల్ బ్రష్, టూత్‌పేస్ట్, ఫ్లాస్, టంగ్ క్లీనర్, మౌత్ వాష్ వంటి ముఖ్యమైన ఉత్పత్తులను తప్పకుండా ఉపయోగించాలి. అప్పుడే నోటి ఆరోగ్యం బాగుండి, ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. గుండె జబ్బులను నివారించాలని అనుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు పళ్లు తోముకోవడం ఎంత ముఖ్యమో రాత్రి భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు పళ్లు తోముకోవడం కూడా అంతే ముఖ్యమని అధ్యయనకారులు సలహా ఇస్తున్నారు. కొన్ని ఆహారాలు మీ చిగుళ్ళను బలంగా ఇంకా దంతాలు ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. చిగుళ్ళు తగినంత బలంగా లేకుంటే, దంతాలు ఊడిపోతాయి. అందువల్ల, చిగుళ్ళను దృఢంగా చేయడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవటం అవసరం.
నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు
►దుర్వాసన కేవలం నోటి నుంచే వస్తున్నట్లయితే.. రోజూ ఉదయాన్నే పళ్లు తోమగానే తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి.
ఏదైనా ఆహారాన్ని తిన్న తర్వాత నీటితో నోరు పుక్కిలించి ఉమ్మేయాలి. నోటిలో ఆహారం ఎక్కువసేపు ఉన్నట్లయితే బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. అది నోటిలో దుర్వాసన కలిగిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని నీటిని తాగుతుండాలి.
►రోజూ ఆపిల్ లేదా క్యారట్లను తినడం ద్వారా కూడా నోటిలో ఉండే మలినాలను తొలగించవచ్చు.
కాఫీ ఎక్కువగా తాగినా సరే దుర్వాసన వస్తుంది కాబట్టి కాఫీకి బదులు గ్రీన్ టీ తాగడం మేలు. ఎందుకంటే గ్రీన్ టీ శ్వాసను మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది.
► యాలుక్కాయను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి.
► దాల్చిన చెక్క, లవంగం కూడా మంచిదే. కిడ్నీలు సరిగా పని చేయకపోతే రక్తంలో ఉండే వ్యర్థాలు, మలినాలు పేరుకుపోతాయి. ఆ ప్రభావం నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్‌పై పడుతుంది. ఫలితంగా తినే ఆహారం రుచిగా అనిపించదు. పైగా ఏదో లోహాన్ని నోటిలో పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది.
అంతేగాక.. చెడు రక్తం వల్ల ఊపిరితిత్తుల్లోకి కూడా చేరుతుంది. దానివల్ల శ్వాస క్రియ సమయంలో రక్తంలో ఉండే మలినాలు మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌లో కలుస్తాయి. ఆ గాలి బయటకు వచ్చినప్పుడు శ్వాస దుర్వాసనతో కూడి ఉంటుంది. కాబట్టి.. ఆ రెండు లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించడం అవసరం. ఎందుకంటే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది! అనారోగ్య కారణాలు కావచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment