ఘనంగా ‘లోకమంగల్’ సామూహిక వివాహాలు
వివాహబంధంతో ఒక్కటైన 37 జంటలు
హాజరైన వివిధ రంగాల ప్రముఖులు
సోలాపూర్: సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ శాసనసభ్యుడు సుభాష్ దేశ్ముఖ్ నేతృత్వంలో లోకమంగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజాపూర్ రోడ్డు వైపునున్న డీఈడీ కళాశాల మైదానంలో పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 37 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన వధూవరులను గుర్రపు బగ్గీల్లో, బ్యాండ్ బాజాలతో ఊరేగించారు. ఈ వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే సుభాష్ దేశముఖ్, మాజీ ఎంపీ జయసిద్ధేశ్వర మహాస్వామి, లోకమంగల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రోహన్ దేశముఖ్, మనీష్ దేశముఖ్, పంచాక్షరి శివాచార్య మహాస్వామిజీ, శ్రీకాంత్ శివచార్య మహాస్వామి, సిద్ధ లింగ మహాస్వామి లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇకపై ప్రతిగ్రామంలో నిర్వహిస్తాం: ఎమ్మెల్యే సుభాష్ దేశ్‌ముఖ్
భవిష్యత్తులో లోకమంగల్ ఫౌండేషన్ దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ప్రతి గ్రామంలో సామూహిక వివాహాలను నిర్వహించాలని సంకల్పించినట్లు సుభాష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. వివాహం చేసుకోదలచిన జంటలు ముందస్తుగా తమ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామపంచాయితీ మెంబర్ల ద్వారా లోక్‌మంగల్ ఫౌండేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదు జంటలు లేదా అంతకుమంచి ఎందరు ముందుకు వచ్చినా వారిని వివాహబంధంతో ఒక్కటి చేస్తామని, వివాహ వేడుకల నాడు గ్రామప్రజలందరికీ విందును కూడా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment