Cyber Crime: Minor Creates Fake Insta Account and Harasses Woman - Sakshi
Sakshi News home page

Cyber Crime: తల్లికి తన గురించి చెప్పిందని.. పొరుగింటి కుర్రాడే గృహిణిపై

Published Thu, Sep 16 2021 9:52 AM | Last Updated on Thu, Sep 16 2021 12:50 PM

Cyber Crime: Minor Harass Woman Arrested Be Aware Of Fake Accounts - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సంధ్య (పేరుమార్చడమైనది) 35 ఏళ్ల గృహిణి. అన్యమనస్కంగా వంటపని పూర్తి చూసి సోఫాలో కూర్చుండిపోయింది. అదేపనిగా ఫోన్‌ మోగుతున్న పట్టించుకోకుండా ఉన్న తల్లిని చూస్తూ ‘ఏమైంది..?’ అనుకుంటూ ‘అమ్మా’ అని తట్టి పిలిచింది కూతురు శివాని (పేరుమార్చడమైనది). ఉలిక్కిపడిన సంధ్య ఏంటన్నట్టు చూసింది. ఫోన్‌ అన్నిసార్లు మోగుతున్నా పట్టించుకోవేంటి.. అని తను ఫోన్‌ తీసుకోబోయింది. ‘ఫోన్‌ తీయద్దు..’ తల్లి అరిచిన అరుపుకు కంగారుపడి ఫోన్‌ వదిలేసింది. ‘చదువుకో పో.. ఎందుకొచ్చావిక్కడికి..’ కోపంగా ఉన్న తల్లిని చూసి ఎన్నడూ లేనిది ఏంటిలా అనుకుంటూ .. మౌనంగా తన రూమ్‌కి వెళ్లిపోయింది. 

ఫోన్‌ అదేపనిగా మోగుతూనే ఉంది. కిందపడిన ఫోన్‌ని చేతిలోకి తీసుకొని కోపంగా గోడకేసి కొట్టింది. దీంతో పగలిన ఫోన్‌ మోగడం ఆగిపోయింది. కాస్త ఊపిరి పీల్చుకుని అలాగే కూచుండి పోయింది. సమయానికి భర్త కూడా ఇంట్లో లేడు. ఇప్పుడీ విషయం ఎవరికి చెప్పాలి?! ఏమీ అర్థం కాక తలపట్టుకుంది. 

మరో అకౌంట్‌
కాసేపటికి భయంభయంగా కూతురు శివాని బయటకు వచ్చింది. ‘అమ్మా, సుజాత (పేరుమార్చడమైనది) ఆంటీ ఫోన్‌ చేశారు. నీ ఫోన్‌కి కాల్‌ చేస్తే స్విచ్డాఫ్‌ వస్తోందంట’ ముక్కలైన ఫోన్‌ని చూస్తూ తన ఫోన్‌ని తల్లికి అందించింది. ‘ఏమైంది సంధ్యా!’ అని ఫోన్లో సుజాత అడగగానే సంధ్య ఏడవడం మొదలుపెట్టింది.  ‘ఏవేవో తెలియని నెంబర్ల నుంచి అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. తమ లైంగిక వాంఛ తీర్చమంటూ. ఏమీ తెలియడం లేదు. భయమేస్తోంది’ అంది సంధ్య. 

‘నువ్వొకసారి నీ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి చూడు. నేనది చూసే నీకు ఫోన్‌ చేశా..’ అని చెప్పడంతో ఆ యాప్‌ ఓపెన్‌ చేసింది. అందులో తన అకౌంట్‌ బాగానే ఉంది. మళ్లీ తన పేరును సెర్చ్‌ చేసింది. తన పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నకిలీ అకౌంట్‌ కనిపించింది. సెక్స్‌ వర్కర్‌ అని, తన ఫొటో, సంప్రదించాల్సిన ఫోన్‌నెంబర్‌ కూడా ఉంది. షాక్‌  అయిన సంధ్య ఫ్రెండ్‌ సూచనతో పోలీసులను సంప్రదించింది. 

వేధించడమే లక్ష్యంగా!
పోలీసుల శోధనలో ఇదంతా తమ పొరుగింట్లో ఉండే 17 ఏళ్ల విక్రమ్‌ (పేరు మార్చడమైనది) ఆమె మీద ద్వేషంతో చేసిన పని అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడి తండ్రి సివిల్‌ ఇంజనీర్‌. ఆర్థికంగా స్థితిమంతులు. జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. గతంలో ఒకసారి ఆ అబ్బాయి ప్రవర్తన సరిగా లేదని, సరైన దారిలో పెట్టడం మంచిదని అతడి తల్లికి సంధ్య చెప్పింది. దీంతో తల్లి కొడుకును తిడుతూ బాగా కొట్టింది.

అతను తన ప్రవర్తన మార్చుకోకపోగా సంధ్య మీద కోపంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు అసభ్యకర సందేశాలను పంపేవాడు. దీంతో ఆమె అతన్ని తన ఫ్రెండ్స్‌ జాబితా నుంచి తొలగించింది. ఆమెను ఎలాగైనా వేధించాలని అతను ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్‌ను క్రియేట్‌ చేశాడు. ఆ అకౌంట్‌ నుంచి రకరకాల అభ్యంతరకర చిత్రాలను, మెసేజ్‌లను పోస్ట్‌ చేస్తూ వచ్చాడు. ఫేక్‌ అకౌంట్‌ను సృష్టించి, వేధింపులకు గురిచేస్తున్న ఈ మైనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

అప్రమత్తత అవసరం
మైనర్‌ బాలుడు ద్వేషంతో చేసిన పని ఇది. అకస్మాత్తుగా వచ్చే ఇలాంటి సంఘటనలతో భయపడకుండా, మనకు తెలిసినవారే చేసుంటారనే ఆలోచన చేయవచ్చు. సైబర్‌ నిపుణుల ద్వారా ఆ నకిలీ అకౌంట్‌ను ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారో నేరస్తుడు ఎవరో సులువుగా కనిపెట్టవచ్చు. ద్వేషంతోనో, డబ్బును రాబట్టడానికో .. నకిలీ సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మన అకౌంట్‌ ప్రొఫైల్‌ను లాక్‌ చేసి పెట్టుకోవాలి. సోషల్‌ మీడియా అకౌంట్‌కి ఇచ్చిన ఫోన్‌ నెంబర్, వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ విడిగా ఉండటం మంచిది. ప్రైవసీ సెట్టింగ్స్‌ని చెక్‌ చేసుకోవాలి. స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ని పెట్టాలి. ఎప్పుడు అకౌంట్‌ ఓపెన్‌ చేసినా, తిరిగి లాగ్‌ ఆఫ్‌ చేయడంలో నిర్లక్ష్యం చూపకూడదు. వెబ్‌సైట్స్‌ని చూసేముందు వాటి URL ని కూడా గమనించాలి. 
– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

ధైర్యంగా కేసు ఫైల్‌ చేయాలి
ఇటీవల సోషల్‌ మీడియాలో నకిలీ అకౌంట్ల సమస్య ఎక్కువ ఉంటోంది. వీటి ద్వారా వేధింపులకు గురిచేసినా, అన్యాయం జరిగిందని అర్థమైనా పరువు పోతుందని అలక్ష్యం చేయకుండా ధైర్యంగా దగ్గరలోని పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్‌ చేయాలి. సమస్యకు సత్వరమే పరిష్కారం అందుతుంది. మనం తీసుకునే జాగ్రత్తలే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట. బాధితులు ఫోన్‌ నెం. 9071666667, https://4s4u.appolice.gov.in/, https://www.cybercrime.gov.in/ ద్వారా రిపోర్ట్‌ చేయచ్చు. 
– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌ 

చదవండి: యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?! జాగ్రత్త!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement