టెక్ట్స్‌ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్‌ స్కామ్‌.. చా(చీ)టింగ్‌! భద్రతా చిట్కాలు ఇవి! | Cyber Crime Prevention Tips: How To Stay Safe From Whatsapp Fraud | Sakshi
Sakshi News home page

Cyber Crime Prevention Tips: టెక్ట్స్‌ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్‌ స్కామ్‌.. చా(చీ)టింగ్‌!

Published Thu, Aug 18 2022 10:09 AM | Last Updated on Tue, Oct 4 2022 8:02 PM

Cyber Crime Prevention Tips: How To Stay Safe From Whatsapp Fraud - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తెలియని వ్యక్తులతో చేసే చాటింగ్‌లు, సీనియర్‌ అధికారుల ఫొటోలను ఉపయోగించి డిజిటల్‌ ప్రొఫైల్స్‌ని సృష్టించడం, డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయమని కోరడం, లింక్స్‌ ద్వారా వివరాలను రాబట్టడం, స్క్రీన్‌ షేరింగ్‌లు చేయించడం.. వంటి ఎన్నో మోసాలకు వాట్సాప్‌ అతి పెద్ద వేదికయ్యింది. 

ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్‌ ఫేస్‌బుక్‌ తర్వాత అందరూ అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లలో రెండవది. అయితే, అన్ని ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌ల మాదిరిగానే మోసగాళ్లు, దొంగల రూపంలో కూడా వాట్సాప్‌ ద్వారా ప్రమాదం పొంచి ఉంది.

వాట్సాప్‌ ప్రధాన ఫీచర్‌ టెక్ట్సింగ్‌ అయితే, వాట్సాప్‌ మిమ్మల్ని స్టేటస్‌లను క్రియేట్‌ చేయడానికి, వాయిస్‌ మెసేజ్‌లను పంపడానికి, మీ లొకేషన్‌ను షేర్‌ చేయడానికి, వాయిస్, వీడియో కాల్స్‌ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌కు ఉన్న ఆదరణ వల్ల మీ ఫోన్‌ నంబర్‌ తెలిసిన ఎవ్వరైనా మీకు మెసేజ్‌ పంపవచ్చు. మోసం చేయడానికి కూడా. తాజా వాట్సాప్‌ స్కామ్‌ల గురించి తెలుసుకుంటే ఇబ్బందులను నివారించుకోవచ్చు. 

టెక్ట్స్‌ మెసేజ్‌తో వల
మోసగాళ్లు అధికారిక వెబ్‌సైట్‌ నుండి సంస్థ, ఉద్యోగుల గురించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత, ఏదైనా వెబ్‌సైట్, సోషల్‌ మీడియా సైట్‌లు, ఇ–మెయిల్, మెసెంజర్‌ యాప్‌ మొదలైన వాటి నుండి సీనియర్స్‌ ఫొటోలను సేకరిస్తారు.

కింది అధికారులను మోసగించడానికి వాటిని ఉపయోగిస్తారు. మోసగాడు మొదట నమ్మదగిన సంభాషణను ప్రారంభిస్తాడు. వారి ఫోన్‌ పోయిందనో, పాడైపోయిందనో కొత్త ఫోన్‌ నుండి మెసేజ్‌ చేస్తున్నట్టు చెబుతారు. చెప్పిన ఖాతాకు డబ్బును బదిలీ చేయమని అడిగే ముందు, తమకు డబ్బు ఇబ్బంది ఉందని, చాలా అర్జంట్‌ అని చెబుతారు.

వాట్సాప్‌ వెరిఫికేషన్‌ స్కామ్‌
యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేస్తున్నప్పుడు లేదా తిరిగి లాగిన్‌ చేస్తున్నప్పుడు, మీరు మీ వాట్సాప్‌ ఖాతాను యాక్సెస్‌ చేయడానికి ఉపయోగించే మీ మొబైల్‌ ఫోన్‌ కి ఆరు అంకెల కోడ్‌ని సెట్‌ చేసుకోవాలి.

మీరు ఈ ధృవీకరణను ఓకే చేస్తే మీ ఖాతాను వేరొకరు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు లేదా మీ ఫోన్‌  యాక్సెస్‌ని కలిగి ఉన్నట్లు ఎరుపు రంగు ఫ్లాగ్‌ వస్తుంది. మీ ఖాతా సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి వచ్చే మీ ఎసెమ్మెస్‌ కోడ్‌ను ఎప్పుడూ షేర్‌ చేయకండి. 

వాట్సాప్‌ గోల్డ్‌
వాట్సాప్‌ గోల్డ్‌ మెంబర్‌షిప్‌ అనేది కొన్నేళ్లకు ఒకసారి వస్తున్న వాట్సాప్‌ స్కామ్‌. దీంట్లో ప్రముఖులు, ఉన్నత ప్రొఫైల్‌ అకౌంట్స్‌ కోసం రూపొందించిన మెసేజ్‌లు చూడవచ్చు. మీరు అప్‌గ్రేడ్‌ చేయకపోతే మీ ఫోన్‌ హ్యాక్‌ చేయబడుతుందని స్కామర్‌లు హెచ్చరించే మెసేజ్‌లను కూడా చూస్తారు.

అయితే, వాట్సాప్‌ నుండి అలాంటివేవీ రిలీజ్‌ కావని గ్రహించాలి. వారు ఇచ్చిన లింక్‌ ద్వారా మీ ఫోన్‌ను స్వాధీనం చేసుకునే లేదా మీ సమాచారాన్ని దొంగిలించే మాల్వేర్‌ అని గుర్తించాలి. వారి లింక్‌పై క్లిక్‌ చేయడం వలన మీకు, మీకు అనుబంధంగా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారచ్చు. 

కూపన్‌ స్కామ్‌లు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బును పొదుపు చేయాలని కోరుకుంటారు. అయితే, మీకు ఇష్టమైన షాపింగ్‌ స్థలాలు, సూపర్‌ మార్కెట్‌లు, కూపన్‌లు, ప్రత్యేక ఆఫర్ల కోసం మీరు లింక్‌లపై క్లిక్‌ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వాట్సాప్‌ గోల్డ్‌ మాదిరిగానే, లింక్‌లను ఓపెన్‌ చేయడం వలన సమస్యలకు దారి తీయవచ్చు. 

వాట్సాప్‌ స్కామ్‌ల సారాంశం
ఈ సైబర్‌ నేరగాళ్లు పని విధానాన్ని తెలుసుకుంటే వారి ఉచ్చులో పడకుండా ఉండవచ్చు.  
►స్కామర్‌ తన అత్యవసర విషయాన్ని మీకు తెలియజేస్తాడు. మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు లేదా త్వరగా చెల్లించమని ఒత్తిడి చేస్తాడు.  
►మీకు తెలియని ఫోన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ సందేశాన్ని పంపుతాడు 

►స్కామర్‌ తమ నంబర్‌ మారిందని మీకు తెలియజేస్తాడు. వెంటనే డబ్బు గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు.
►మోసగాడి టెక్ట్స్‌ మెసేజ్‌లో గ్రామర్‌లేని ఇంగ్లిష్‌ వాక్యాలు ఉంటాయి. అంటే, మోసగాడి మాతృభాష ఇంగ్లిష్‌ కాదు. లేదా వారు బాగా చదువుకున్నవారు కాదు.
►ఒక తెలియని ఖాతాకు లేదా యాప్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయమని అడుగుతాడు.
 
అకౌంట్‌ సెట్టింగ్‌
►వాట్సాప్‌లో వేరొకరిలాగా నటించడం సులభం. మీరు ఎవరితో టెక్ట్స్‌ చేస్తున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే మీరు చూడగలిగేది ఫోన్‌ నంబర్, ప్రొఫైల్‌ ఫోటో మాత్రమే. అయితే, కొంతమంది వినియోగదారులు ప్రొఫైల్‌ ఫోటోలను అప్‌లోడ్‌  చేయరు లేదా అది నిజమైనది కాకపోవచ్చు. అనుమానంగా ఉన్నప్పుడు, సదరు వ్యక్తిని అడగడం ఉత్తమం. లేదా మీరు ఎప్పుడైనా ముఖాముఖి మాట్లాడేందుకు, వారు ఎవరో నిర్ధారించుకోవడానికి వాట్సాప్‌ వీడియో చాట్‌ చేయవచ్చు.

►వాట్సాప్‌ ప్రైవేట్‌ అయినప్పటికీ, మీ నంబర్‌ తెలిస్తే ఎవరైనా మీకు మెసేజ్‌ చేయవచ్చు. స్కామర్లు వాట్సాప్‌ సందేశాలతో స్పామ్‌ చేయడానికి వందల, వేల ఫోన్‌ నంబర్‌లను సేకరిస్తుంటారు. మీకు తెలియని సందేశాలు వస్తే, వాటిని ఓపెన్‌ చేయకపోవడం మంచిది. అలాగే దానిని గుడ్డిగా ఫార్వార్డ్‌ చేయవద్దు. మీరు మెసేజ్‌ని నొక్కి పట్టి, ‘రిపోర్ట్‌‘ ఆప్షన్‌ను ద్వారా వారిని బ్లాక్‌ చేయవచ్చు లేదా వాట్సాప్‌కి రిపోర్ట్‌ చేయచ్చు. 

►మెసేజ్‌లను పూర్తిగా ఆపలేనప్పటికీ, నంబర్‌లను బ్లాక్‌ చేయడం, రిపోర్ట్‌ చేయడం, తొలగించడం ద్వారా మీరు స్పామర్‌లకు అడ్డుకట్టవేయచ్చు. 
►మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తుల నుండి మెసేజ్‌లు వస్తున్నట్లయితే ఆన్‌లైన్లో‌ ఉన్నప్పుడు మీ అకౌంట్‌ సెట్టింగ్‌లను సెట్‌ చేసుకోవచ్చు. 

భద్రతా చిట్కాలు
►మీ సమాచారాన్ని ఎవరు చూడాలో వారి వరకే మీ వాట్సాప్‌ సెట్టింగ్‌ సెట్‌ చేసుకోవచ్చు. 
►సమస్యాత్మక కంటెంట్, పరిచయాలను వాట్సాప్‌ సహాయ కేంద్రానికి తెలియజేయడం ద్వారా నియంత్రణ సులువు అవుతుంది. మీరు మీడియా వ్యూయర్‌ నుండి నేరుగా ఈ అకౌంట్‌కు తెలియజేయవచ్చు.https://faq.whatsapp.com/2798237480402991/?locale=fi_FI 

వాట్సాప్‌కు ఇలా తెలియజేయవచ్చు..
►ఆండ్రాయిడ్‌/ఐఫోన్‌లో వాట్సాప్‌లో మోర్‌ అనే ఆప్షన్‌  బటన్‌ను నొక్కండి (బటన్‌ ఒకదానిపై ఒకటి మూడు చుక్కలు వరుసగా ఉంటాయి). ఆపై సెట్టింగ్‌ సహాయం ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

►మీకు అనుమానాస్పద, తెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చినట్లయితే, మీరు వాటిని చాట్‌లోనే వాట్సాప్‌కి నివేదించవచ్చు. దీన్ని చేయడానికి ... వాట్సాప్‌లో నెంబర్‌ చాట్‌ను ఓపెన్‌ చేయండి. వారి ప్రొఫైల్‌ సమాచారాన్ని ఓపెన్‌ చేయడానికి నంబర్, గ్రూప్‌ పేరుపై నొక్కి, దిగువకు స్క్రోల్‌ చేయాలి. రిపోర్ట్‌ కాంటాక్ట్‌ లేదా రిపోర్ట్‌ గ్రూప్‌ లింక్‌పై నొక్కాలి. 

►మీరు పంపిన మెసేజ్‌లను, నంబర్‌ లేదా గ్రూప్‌ల నుండి సందేశాలను వాట్సాప్‌ అందుకుంటుంది. నియంత్రిస్తుంది.
-ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌  

చదవండి: Smart Watches: స్మార్ట్‌వాచ్‌ వరల్డ్‌.. లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచు కోవడానికి పనికొచ్చేవే!
Cyber Crime Prevention Tips: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే సంగతులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement