చలికాలంలో చుండ్రు: అపోహలు-వాస్తవాలు  | Dandruff Facts And Myths Special Story In Sakshi Health | Sakshi
Sakshi News home page

చుండ్రు: అపోహలు-వాస్తవాలు 

Published Thu, Dec 10 2020 8:46 AM | Last Updated on Thu, Dec 10 2020 8:50 AM

Dandruff Facts And Myths Special Story In Sakshi Health

చలికాలం వచ్చిందంటే కొన్ని సమస్యలు మరింత తీవ్రంగా పరిణమిస్తాయి. అందులో ప్రధానంగా చర్మసమస్యలు ఒకింత ఎక్కువవుతాయి. అలాంటివాటిల్లో చుండ్రు ఒకటి. అటు జుట్టులోనూ, ఇటు మాడుపైనా మాటిమాటికీ దురద పుట్టిస్తూ, నలుగురితో ఇబ్బంది కలిగిస్తుందీ సమస్య. అన్ని కాలాల్లో కంటే ఈ సీజన్‌లో ఎక్కువయ్యే ఈ చుండ్రుకు కారణాలేమిటో, దాన్ని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. 

కొందరు తలదువ్వుకోగానే దువ్వెనలో తెల్లటి పొలుసులు రాలుతాయి. మరికొందరిలో ఇవే పొలుసులు షర్ట్‌పై పడి అసహ్యంగా కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడానికి కారణమేమిటో చూద్దాం. చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్‌ అనే రెండు పొరలు ఉంటాయి. పైన ఎపిడెర్మిస్, కింది డెర్మిస్‌ అనే పొరలుంటే అందులోని డెర్మిస్‌లోకి హెయిర్‌ ఫాలికిల్స్‌ అనే రోమాంకురాల్లోంచి  వెంట్రుకలు పుట్టుకువస్తాయి. వీటి పక్కనే సెబేషియస్‌ గ్లాండ్స్‌ అనేవి ఉంటాయి. ఈ గ్రం«థులు సీబమ్‌ అనే నూనెలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది వెంట్రుకలను ఆరోగ్యంగానూ, నిగారింపుతో కూడిన మెరుపును కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఈ సీబమ్‌ ఉత్పత్తి కొంతమందిలో సాధారణంగా ఉంటే, మరికొందరి లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తలపైన ఉండే చర్మం ఒకింత జిడ్డుగా మారుతుంది.

ఈ జిడ్డుపై మెలస్సీజియా అనే ఒక తరహా ఫంగస్‌ పెరుగుతుంది. సాధారణం గా ఈ ఫంగస్‌ కూడా అందరిలోనూ ఉంటుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ ఫంగస్‌ అధికంగా పెరిగి... చర్మకణాలపై దాడి చేసి, కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలతో చర్మం ఉపరితలంపైన మృతకణాలు పెరుగుతాయి. దాంతో తలలో పొట్టులా రాలే పొలుసులూ... వాటి కారణంగా దురద, చికాకు పెరుగుతాయి. దురద కారణంగా గోళ్లతో తలను గీరుకోగానే అక్కడ పేరుకున్న మృతకణాలు రాలిపడటం జరుగుతుంది. ఇలా రాలిపడే మృతకణాలనే మనం చుండ్రు అంటుంటాం. తీవ్రతను బట్టి ఒక్కోసారి ఈ చుండ్రు మాడుపైనేగాక కనుబొమలు, కనురెప్పలు, ముక్కుకు ఇరువైపులా, బాçహుమూలాల్లోనూ కనిపించవచ్చు. 

చలికాలంలో తీవ్రత ఎక్కువ... ఎందుకంటే?
చలికాలం వాతావరణంలో తేమ తగ్గుతుంది. దాంతో చర్మం పొడిబారుతుంది. అందుకే చర్మంపై కొద్దిగా గీరగానే తెల్లటి చారికలు కూడా కనిపిస్తుంటాయి. ఇలా తేమ తగ్గిడం వల్ల మృతకణాలు పొడి పొడిగా రాలిపడుతుండటం చాలామందిలో చూడవచ్చు. 

చండ్రుకు కారణాలు 
చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు దోహదపడతాయి. చుండ్రు తీవ్రంగా ఉండే కండిషన్‌ను సెబోరిక్‌ డర్మటైటిస్‌ అంటారు. సెబోరిక్‌ డర్మటైటిస్‌ ఈ కింది సమస్యలున్నవాళ్లలో తీవ్రంగా ఉండవచ్చు. అంటే... పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం, మలబద్దకం, వైరస్‌లతో వ్యాపించే అంటువ్యాధుల ఇన్ఫెక్షన్‌ తర్వాత, సెబోరిక్‌ ఎగ్జిమా, మానసిక ఒత్తిడులు, తీవ్రమైన అలసట, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, హెయిర్‌ స్టైల్స్‌ కోసం వాడే స్ప్రేలు... ఇలా రకరకాల కారణాల వల్ల చుండ్రు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పార్కిన్‌సన్స్‌ లాంటి నరాలకు సంబంధించిన సమస్యలున్నప్పుడూ చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి. 

లక్షణాలు 
చుండ్రును గుర్తించడం చాలా తేలిక. మాడు విపరీతమైన దురదగా ఉంటుంది. దాంతో గోళ్లతో గీరగానే తెల్లటి పొట్టులాంటి పదార్థం గోళ్లలోకి వస్తుంది. భుజాలమీద, దుస్తుల మీదా కనిపిస్తూ ఉంటుంది.  

నివారణ 
ఆహారపరంగా: చుంద్రును నివారించడానికి ఆహారపరమైన జాగ్రత్తల విషయానికి వస్తే... ఈ సీజన్‌లో సాధారణంగానే మనం తక్కువగా నీళ్లు తాగుతుంటాం. దేహంలో నీటిపాళ్లు తగ్గకుండా ఉండేందుకు చల్లటి సీజన్‌లో మనమే పనిగట్టుకుని కనీసం రోజూ 12 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే అన్ని రకాల పోషకాలు ఉన్న సమతులాహారం తినాలి. ఆహారం లో తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. రోజూ తాజా పండ్లు కూడా ఎక్కువగానే తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడంలో తోడ్పడతాయి. చర్మం, మాడును ఆరోగ్యంగా ఉంచడం ద్వారా చుండ్రును స్వాభావికంగా నివారించేందుకు ఉపయోగపడతాయి.  

తీసుకోకూడని పదార్థాలు 
చుండ్రు సమస్య ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్‌ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే వాటిని తీసుకోవాలి. దువ్వెన విషయంలో జాగ్రత్తలు జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా ఉండేలా చూడటం ద్వారా కూడా మృతకణాల తీవ్రతను తగ్గించవచ్చు. ఇందుకోసం వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. దీనివల్ల రోమాంకురాలకు మాలిష్‌ అందడంతో అక్కడ రక్తప్రసరణ పెరుగుతుంది. పైగా ఇలా దువ్వుతూ ఉండటం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఎప్పటికప్పుడు రాలిపోతుంది. దీంతోపాటు వాతావరణంలో ఉండే కాలుష్యాలూ, పొగ వంటివి జుట్టును తాకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. కొంతమంది హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల, జుట్టులో చెమట పెరిగి చుండ్రు సమస్య ఎక్కువవుతుందని అపోహ పడుతుంటారు. నిజానికి హెల్మెట్‌ కారణంగా వాతావరణంలోని కాలుష్యం... ఇతర కాలుష్యకారకాలు జుట్టును అంటకపోవడం వల్ల చుండ్రు సమస్య ఒకింత తగ్గుతుందనే చెప్పవచ్చు. 

షాంపూలతో... 
చుండ్రును అరికట్టేందుకు అంటూ మార్కెట్లో రకరకాల యాంటీ డాండ్రఫ్‌ షాంపూలు దొరుకుతున్నాయి. అందులో జింక్‌ పైరిత్రిన్, సెలీనియమ్‌ సల్ఫేడ్, కోల్‌తార్, కెటోకొనజోల్‌... లాంటి యాంటీడాండ్రఫ్‌ షాంపూల్లో ఏదైనా వాడుకోవచ్చు. షాంపూ లేబుల్స్‌పై ఉన్న నిబంధనలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఇలాంటి మెడికేటెడ్‌ షాంపూలు వాడేటప్పుడు... ముందుగా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి వాడటం మంచిదే. లేదా  నాలుగు వారాల పాటు ఒక షాంపును వాడినప్పటికీ తగ్గకపోతే మరో షాంపూని మార్చి చూడాలి. వీటి వల్లా తగ్గకపోతే మైల్డ్‌ కార్టికో స్టిరాయిడ్స్‌ లోషన్స్‌ని మాడుకు రాసుకుని, కడిగేయాలి. 

ఏ షాంపూ అయినా అరచేతిలోకి తగినంతగా తీసుకుని, అందులో ఒకింత నీటిలో కలిపి జుట్టుకు అప్లై చేయాలి.  ఆ తర్వాత తలంతా రుద్దుతూ శుభ్రపరుచుకోవాలి. చుండ్రు ఉన్నవారు తప్పనిసరిగా రోజూ యాంటీ డాంఢ్రఫ్‌ షాంపూతో  తలస్నానం చేయాలి. కేశాలు పొడిబారుతున్నాయి అనుకునేవారు స్నానం చేయడానికి అరగంట ముందు గోరువెచ్చని నూనెతో మర్ధనా చేసుకోవాలి. అరచేతిలోకి షాంపూను వేసుకున్న తర్వాత దాన్ని నేరుగా జుట్టుకు రాయడం కంటే ఒకింత నీరు కలిపాక అది జుట్టులోకి మరింతగా విస్తరిస్తుందని గుర్తుపెట్టుకోండి. 

చుండ్రు నివారణకు మరికొన్ని చిట్కాలు 
ఈ సీజన్‌లో చలి కారణంగా కొందరు తలస్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లనే వాడుతుంటారు. దీంతో మాడుపై చర్మం మరింత పొడిబారి చుండ్రు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకోసం తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడటం మేలు. 

డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి? 
ఇక్కడ పేర్కొన్న చిట్కాలు పాటిస్తూ, యాంటీడాండ్రఫ్‌ షాంపూలు వాడాక కూడా చుండ్రు తీవ్రత తగ్గకపోయినా, మాడుపై చర్మం ఎర్రగా మారినా, అది పెచ్చులు పెచ్చులుగా ఎక్కువగా ఊడుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వ్యక్తి వయసు, వారి ఇతర ఆరోగ్య సమస్యలను వైద్యులు పరిగణనలోకి తీసుకుని డాండ్రఫ్‌ తీవ్రత ఎంతగా ఉందో గుర్తించి, తగిన  చికిత్స చేస్తారు. 

అపోహలు – వాస్తవాలు 
అపోహ: అన్ని కాలాల్లోనూ విసిగిస్తుంది. 
వాస్తవం: అన్ని కాలాలలో కంటే... చలికాలంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. 

అపోహ: చుండ్రు వల్ల ఎక్కువ జుట్టు రాలుతుంది. 
వాస్తవం: జుట్టు రాలడానికి కారణం చుండ్రే అన్నది చాలామంది అపోహ. నిజానికి  హెయిర్‌ ఫాల్‌ వేరు, చుండ్రు వేరు. సాధారణ చుండ్రు వల్ల జుట్టు రాలదు. ఫంగస్‌ వల్ల చుండ్రు ఎక్కువయితే కొద్దిగా జుట్టు రాలవచ్చు. అయితే చుండ్రు ఉందని మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటే సమస్య మరింతగా పెరగవచ్చు.

అపోహ: చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఉదా: దువ్వెనలు, దుస్తులు ఒకరివి ఒకరు వాడుకోవడం మూలంగా
వాస్తవం: అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. (అయితే ఇతరుల దువ్వెన వాడకపోవడమే మేలు. ఒకవేళ వాడాల్సి వస్తే అది వాడేటప్పుడు శుభ్రత తప్పనిసరి). 

అపోహ: పిల్లల్లోనూ చుండ్రు ఉంటుంది.
వాస్తవం: చాలా వరకు పిల్లల్లో చుండ్రు సమస్య ఉండదు. (ఏడాది లోపు పిల్లల్లో ఉండే చుండ్రును క్రెడిల్‌ క్రాప్‌ అంటారు. ఆ తర్వాత తగ్గిపోతుంది) 

-డాక్టర్‌ స్వప్నప్రియ
కన్సల్టెంట్‌ డర్మటాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement