మనందరమూ టీ మక్కువతో తాగుతాం. మనం రెగ్యులర్‌గా తాగే టీలు మాత్రమే కాకుండా... రంగుల పేర్లతోనూ టీ ఉండటం మనకు తెలుసు. ఉదాహరణకు బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, చాక్లెట్ టీ, బ్రౌన్ టీ... ఇలాగన్నమాట. ఆ రంగుల టీలతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలెన్నెన్నో.
సాధారణ టీ : మనం రోజూ తాగే రెగ్యులర్ టీ ఇది. కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువ. అందుకే కాఫీతో పోలిస్తే టీని ఎక్కువసార్లు తీసుకున్నా పెద్దగా హాని చేయదు. దీన్ని కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించడం, పోషకాలు ఒంటికి పట్టకుండా చేసే ప్రమాదమూ పొంచి ఉంది. ఇలా ఎక్కువ టీ తాగేవారిలో ఐరన్ ఒంటబట్టడం తగ్గుతుంది.
వైట్ టీ : పేరును బట్టి ఇదేదో పాలను ఎక్కువ మోతాదులోనూ డికాక్షన్‌ను తక్కువగానూ కలపడంవల్ల వచ్చే తేలికపాటి టీ కాదది. వైట్ టీ పేరిట ఒక రకం టీని చాలామంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇది చాలా లేతగా ఉండే టీ–ఆకులతో తయారైన టీ–పౌడర్‌తో కాచడం వల్ల తయారు చేసే టీ. ఇది సాధారణ టీ రుచితో కాకుండా కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. దాంతో చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
బ్లాక్ టీ : సాధారణంగా పాలు కలపకుండా కేవలం డికాక్షన్ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్ టీగా పరిగణిస్తారు. ఇది నలుపు రంగులోనే కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మరీ మేలు చేస్తుంది. ఇందులోని హెర్బల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అంతగా అలవాటు లేనివారు బ్లాక్ టీని మితిమీరి తాగడం మంచిది కాదు. బ్లాక్ టీ కారణంగా నిద్రలేమి, గుండెదడ, రక్తం వేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు.
గ్రీన్–టీ : ఇటీవల ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్–టీ తీసుకుంటూ ఉండటం మనం చూస్తున్నాం. ఇందులోని హెర్బల్ పోషకాలు, ఫైటోకెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. అయితేకాదు... గుండెజబ్బులనూ కొంతవరకు నివారిస్తాయి. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. బ్లాక్ టీలోని ‘ఎపిగెల్లో కాటెచిన్–3’ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. కొందరు ఈ టీలోని మరీ ఎక్కువ చేదుదనాన్ని నివారించడం కోసం తేనె కలుపుకుంటారు. అయితే దీన్ని చేదుగా తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు.
చాక్లెట్ టీ : ఈ టీ ఒకింత చాక్లెట్ రంగుతో పాటు చాక్లెట్ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల మన నరాలు ఉత్తేజితం కావడంతో పాటు ఇందులోని పాలీఫినాల్స్ ఆరోగ్యానికీ మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ చాక్లెట్ టీని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తాగడం మంచిది కాదు.
బ్రౌన్ టీ లేదా ఊలాంగ్ టీ : ఇది చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన గ్రీన్, బ్లాక్ టీల సమ్మిళిత మిశ్రమం. దీన్ని ఎక్కువగా చైనా, తైవాన్ దేశాలలో తాగుతుంటారు. ఊలాంగ్ టీలలో జాస్మిన్, కొబ్బరి, క్యారమెల్ వంటి ఇతర ఫ్లేవర్ కూడా ఇటీవల లభ్యమవుతున్నాయి. టీ ఏదైనా మనల్ని ఉత్తేజితం చేస్తుందన్న విషయం తెలిసిందే. నరాలు ఎక్కువగా ఉత్తేజితం అయితే అవి త్వరగా అలసిపోయి మనం నీరసంగా, నిస్సత్తువగా మారే అవకాశం ఉంది. అందుకే టీ లను ఆరోగ్యం ఇచ్చే పరిమితి మోతాదులో తీసుకుంటూ... అతి వల్ల కలిగే అనర్థాలను నివారించుకుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment