పండుగ వస్తోందంటే గృహిణులకు ఒకటే పని. ఇంటి శుభ్రంనుంచి పిండి వంటల దాకా ఎడతెగని పనులతో బిజీగా ఉంటారు. పెద్దగా హడావిడిగా లేకుండా, సులభంగా, ఆరోగ్యంగా తయారు చేసుకునే కొన్ని వంటల్ని ఇపుడు చూద్దామా.
రాగి కుకీస్
కావలసినవి: రాగిపిండి – కప్పు; గోధుమపిండి – కప్పు; చక్కెర పొడి – కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – 15 టేబుల్ స్పూన్‌లు; పాలు – 4 టేబుల్ స్పూన్‌లు (అవసరమైతేనే వాడాలి).
తయారీ
నెయ్యి కరిగించి పక్కన పెట్టాలి. వెడల్పు పాత్రలో రాగిపిండి, గోధుమ పిండి, చక్కెర పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి అన్నీ సమంగా కలిసేటట్లు గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసి మళ్లీ కలపాలి. చపాతీల పిండిలా ముద్దగా వస్తుంది. తగినంత తేమలేదనిపిస్తే పాలు కలపాలి. ఈ పిండి మీద మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఒవెన్‌ను 170 డిగ్రీలు వేడి చేయాలి. పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీసి పెద్ద నిమ్మకాయంత గోళీలు చేయాలి. ఒక్కో గోళీని అరచేతిలో వేసి వత్తాలి. ఫోర్క్‌తో నొక్కి గాట్లు పెట్టి బేకింగ్ ట్రేలో సర్దాలి ∙ట్రేని ఒవెన్‌లో పెట్టి 12 నిమిషాల సేపు ఉంచాలి. కుకీ మందంగా ఉందనిపిస్తే మరో నిమిషం అదనంగా ఉంచాలి ∙ఒవెన్ లేక పోతే ప్రెషర్ కుకర్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. కుకర్‌లో ఉప్పు చల్లి గాస్కెట్, వెయిట్ తీసేసి మూత పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత కుకీలను అమర్చిన ట్రేని జాగ్రత్తగా కుకర్‌లో పెట్టి సన్న మంట మీద 15 నిమిషాల సేపు ఉంచాలి. అయితే కుకర్‌లో ఒకేసారి అన్నింటినీ బేక్ చేయడం కుదరక పోవచ్చు. కుకర్ సైజ్, ట్రే సైజ్‌ను బట్టి నాలుగైదు సార్లుగా చేయాలి
ఈ బిస్కట్‌లను గాలి చొరబడని బాటిల్‌లో నిల్వ చేస్తే మూడు వారాల పాటు తాజాగా ఉంటాయి.
మిల్క్ బర్ఫీ
కావల్సిన పదార్ధాలు
పాలపొడి – రెండున్నర కప్పులు
పంచదార – ముప్పావు కప్పు
పాలు – కప్పు
నెయ్యి – పావు కప్పు
పిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి.
స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి.10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి.
ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తా పలుకులు వేసి మరోసారి వత్తుకోని, గంటపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి.
రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment