పిల్లలు నోరు తెరిచి దేశం గురించి మాట్లాడే రోజు ఆగస్టు 15. గొంతెత్తి దేశభక్తిని గానం చేసేరోజు మన స్వాతంత్య్ర దినోత్సవం. సంవత్సరంలో 364 రోజులు వారు ఫోనులోనో గేమ్స్‌లోనో మునిగి ఉన్నా ఈ ఒక్కరోజైనా వారి చేత దేశం గురించి మాట్లాడించాలి. దేశ ఘనతను పాడించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల చేత కనీసం ఒక పాట పాడించాలి. ఐదు నిమిషాలు మాట్లాడించాలి. ఏ పాటలు? ఏ మాటలు? ఇవిగోండి సలహాలు...
‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టొయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్’... అన్నారు గురజాడ. ‘దేశమును ప్రేమించాలి’ అని పిల్లలకు తెలుసు. కాని దేశంలో మంచి పెరిగితేనే అది ప్రేమించ దగ్గ దేశమవుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగినప్పుడే అది గొప్ప దేశమవుతుందని గురజాడ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక పాటైనా పిల్లల చేత పాడించకపోతే తల్లిదండ్రుల పెంపకంలో నిర్లక్ష్యం ఉన్నట్టే అర్థం. ‘చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవ వలెనోయ్... అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్’ అని కూడా గురజాడ అన్నారు. ఇవాళ్టి సందర్భంలో పిల్లలకు ఈ పాట నేర్పి, దాని అర్థం మనసుకు ఎక్కించకపోతే భవిష్యత్తులో వారు ‘దేశమంటే మట్టే’ అనుకుంటారు. ‘మనుషులు’ అనుకోరు.
త్యాగఫలం తెలియచేయాలి
ఇవాళ మనం పీలుస్తున్న ప్రతి శ్వాస మన పూర్వికుల రక్తం, చెమట, త్యాగం ఫలితం. మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి భావితరాల చేతుల్లో పెట్టారు దేశాన్ని. ఎంతో విలువైన ఈ దేశ సంపద, దేశ సంస్కృతి పట్ల పిల్లలకు గౌరవం, బాధ్యత తెలియాలంటే వారిలో జాతీయ భావాలు, సుహృద్భావం కలగాలంటే ఆగస్టు 15ను ఒక సందర్భంగా చేసుకుని తెలియచేయాలి. ఇవాళ దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్లల్లో పిల్లలకు తెలుగు నేర్పించడం లేదు. కొన్ని స్కూళ్లలో పిల్లలు జెండా వందనం రోజు జైహింద్ చెప్తే సరిపోతుందనుకుంటున్నారు. కనీసం ఒక బృందగానంలో కూడా పాల్గొనడం లేదు... వక్తృత్వంలో నాలుగు ముక్కలు దేశం గురించి మాట్లాడటం లేదు.
అందుకే తల్లిదండ్రులు పూనుకుని తమ ప్రతి పిల్లల చేత అయితే తమ అపార్ట్‌మెంట్‌లో, లేదా తమ వీధిలో, ఇంట్లో ఏదో విధాన ఒక పాట పాడించడం, దేశం గురించి తప్పకుండా నాలుగు ముక్కలు మాట్లాడించడం అవసరం. పిల్లలు సరిగ్గా చెప్తే వింటారు. నేర్చుకుంటారు. వారికి ఆ వేళ విశేషమైన దుస్తులు, దేశభక్తులు వేషాలు వేస్తే ఎంతో సంబరపడతారు. ఆ స్ఫూర్తిని నింపుకుంటారు. ఆగస్టు 15 అంటే సెలవు దినం, ఆ రోజు ఎటైనా వెళ్లొద్దాం అని ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను దేశం వైపు నడిపించడంలో నిర్బాధ్యతగా ఉన్నట్టే లెక్క.
ఎన్నో పాటలు
పిల్లలు నేర్చుకుని పాడటానికి తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రయివేటు గీతాలతో పాటు సినీ గీతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి నేర్పించవచ్చు. ‘దేశమును ప్రేమించుమన్నా’ (గురజాడ), ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ (శంకరంబాడి), ‘జయజయ ప్రియభారత జనయిత్రి’ (దేవులపల్లి), ‘తేనెల తేటల మాటలతో’ (ఇంద్రగంటి శ్రీకాంత శర్మ), ‘మాకొద్దీ తెల్లదొరతనము’ (గరిమెళ్ల), ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ’ (వేములపల్లి శ్రీకృష్ణ)... ఇవన్నీ ఉన్నాయి. ఇక సినిమా పాటల్లో ‘పాడవోయి
భారతీయుడా’ (శ్రీశ్రీ) పిల్లలు పాడటానికి సులువుగా ఉంటుంది. మన పిల్లలకు ‘వందేమాతరం’, ‘జనగణమన’, ‘సారే జహాసే అచ్ఛా’ కనీసం వచ్చునా రావా అన్నది కూడా గమనించుకుంటే మంచిది.
దేశం గురించి మాట్లాడాలి
పిల్లలు దేశం గురించి, దేశ ఔన్నత్యం గురించి మాట్లాడాలి. మాట్లాడటంలో వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఏం మాట్లాడాలన్న విషయంలో కొంచెం సాయం చేసినా పర్వాలేదు. ‘భిన్నత్వంలో ఏకత్వం’, ‘మన జాతిపిత’, ‘దేశాభ్యున్నతికై పర్యావరణ పరిరక్షణ’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్త్రీ శక్తి’, ‘సామాజిక బాధ్యత’... ఇలా ఏదో ఒక అంశం ఇచ్చి ఐదు నిమిషాలు మాట్లాడేలా చేయాలి. ఇది ఒక సంప్రదాయం. ఒక తరం నుంచి మరో తరానికి అందాలి. అమృతోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయడంలో పిల్లలను భాగస్వాములను చేయాలి.
దేశ పతాకం పిల్లల చేతుల్లో రెపరెపలాడాలి. దేశభవిష్యత్తుకు వారే విధాతలు కావాలి.
Comments
Please login to add a commentAdd a comment