కోవిడ్‌–19తో కళ్లకు ముప్పు ఉంటుందా? | Eye Care During COVID 19: Is Your Eye Health Affected By Coronavirus | Sakshi
Sakshi News home page

కోవిడ్‌–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?

Published Mon, Jun 28 2021 7:09 PM | Last Updated on Mon, Jun 28 2021 7:58 PM

Eye Care During COVID 19: Is Your Eye Health Affected By Coronavirus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్‌ దుష్ప్రభావాలు ఎన్నెన్నో అవయవాలపై ఉండటం మనకు తెలిసిందే. అన్నిటికంటే ఎక్కువగా ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు వంటి శరీర భాగాలపై ఎలా ఉంటుందనే విషయంపై చాలా అధ్యయనాలు జరిగాయి. కానీ కంటి విషయంలో కరోనా ప్రభావాలపై అటు అధ్యయనాలుగానీ... ఇటు అవగాహన గానీ చాలా తక్కువ. అత్యంత సున్నితమైనదీ, కీలకమైనది అయిన కన్ను విషయంలో అమెరికాలోని యూఎస్‌సీ రాస్కి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆఫ్తాల్మాలజీ డాక్టర్‌ ఆనీ గ్యూయెన్‌ వంటివారు ‘కంటిపై కరోనా ప్రభావం’ విషయంలో కొన్ని పరిశీలనలు జరిపారు. ఆ అధ్యయనాల్లో తెలిసిన అంశాలను వివరించే కథనం ఇది. 

చిన్న పిల్లలను కాస్త సరదాగా భయపెట్టడానికో లేదా వారిని థ్రిల్‌ చేయడానికో కొందరు పెద్దవాళ్లు తమ పై కనురెప్పలను పైకి మడిచి లేత గులాబీరంగులోని కనురెప్పల వెనకభాగాన్ని చూపించి వాళ్లను ఆడిస్తుంటారు. అలా కనురెప్పల వెనక లేత గులాబీరంగులో కనిపించేదే మ్యూకస్‌ మెంబ్రేన్‌. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... కరోనా వైరస్‌లు మ్యూకస్‌ మెంబ్రేన్‌కు అంటుకున్న తర్వాత అక్కణ్నుంచి శరీరం లోపలికి వెళ్తాయన్న విషయం చాలామందికి తెలుసు. మన నోట్లో, ముక్కులో ఉన్నట్లే కళ్లలోనూ ఈ మ్యూకస్‌ మెంబ్రేన్‌ ఉంటుంది. కళ్ల ఉపరితం మీద, కనురెప్పల వెనక ఉండే ఈ మ్యూకస్‌ పొర లైనింగ్‌నే కంజంక్టివా అంటారు. వైరస్‌ ఉన్న నీటితుంపర్లు (డ్రాప్‌లెట్స్‌) మ్యూకస్‌ మెంబ్రేన్‌ ద్వారా లోపలికి వెళ్లి, దేహంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ లెక్కన చూస్తే కళ్ల నుంచి కూడా వైరస్‌ లోపలికి వ్యాపిస్తుందన్న మాట. ఏవైనా వస్తువులనూ, ఉపరితలాన్ని అంటుకున్న తర్వాత ఆ చేతులతో (కడుక్కోకుండాగానీ లేదా శానిటైజ్‌ చేసుకోకుండాగానీ) కళ్లను రుద్దుకోవద్దని చెప్పడం వ్యాధి వ్యాప్తిని నివారించేందుకే. 

కళ్లనూ కడుక్కోవాలా? 
అలాగైతే కంటిపొరలనుంచి కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది కాబట్టి... చేతులను కడుక్కున్నట్టే తరచూ కళ్లనూ కడుక్కోవాలా అనే సందేహం కొందరికి రావచ్చు. ఇక్కడ ఓ రక్షణ వలయం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. కళ్ల ఉపరితలాన్ని ఆక్యులార్‌ సర్ఫేస్‌గా చెబుతారు. ఈ ఆక్యులార్‌ సర్ఫేస్‌ను పరిరక్షించడానికి ఓ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ చేరే మైక్రోబ్స్‌ (వైరస్‌లూ, ఇతర బ్యాక్టీరియా వంటి అతి సూక్ష్మక్రిముల) వంటి వాటిని తుదముట్టించడానికి కన్నీరు ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. కన్నీరు ఊరే గ్రంథుల (లాక్రిమల్‌ గ్లాండ్స్‌) నుంచి నీరు స్రవిస్తూ కంటి ఉపరితలాన్ని ఎప్పుడూ తడిగా కూడా ఉంచుతూ సంరక్షిస్తుంటుంది.

 
కోవిడ్‌ సోకితే లక్షణాలూ కంట్లోనూ కనిపిస్తాయా? 
కోవిడ్‌ సోకిన లక్షణాలు కొందరికి కళ్ల ద్వారా కూడా వ్యక్తమవుతాయి. కన్ను లేత పింక్‌ రంగులోకి మారడం, ఎర్రబారడం, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తే అది కోవిడ్‌గా అనుమానించాలి. ఇలా కన్ను పింక్‌ రంగులోకి మారడం కంజంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్‌ రావడం కారణంగా జరుగుతుంది. మరోమాటగా చెప్పాలంటే కరోనా వైరస్‌ ఒక రకంగా కళ్లకలకకూ కారణమవుతుందన్నమాట. 

మరి రక్షణ ఎలా? 
కళ్లజోడు వాడేవారికి ఎంతోకొంత రక్షణ లభించేమాట వాస్తవమే అయినా అది పూర్తి రక్షణ కాదు. అందుకే కంటిని రక్షించుకోవాలనుకునేవారు ‘ఫేస్‌ షీల్డ్స్‌’ వాడటం మంచిదే. ఇక కాంటాక్ట్‌ లెన్సెస్‌ వాడేవారు కొంతకాలం పాటు కళ్లజోడు వాడటం మంచిది. (Delta Varient: డెల్టా వేరియంట్‌ చాలా డేంజర్‌)


కోవిడ్‌–19తో కళ్లకు ముప్పు ఉంటుందా? 
కనురెప్పల లైనింగ్‌కు ఉన్న మ్యూకస్‌ పొర ద్వారా కోవిడ్‌–19  వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, ముక్కు, నోరుతో పోలిస్తే అది ఒకింత తక్కువే. అయితే కోవిడ్‌–19 వల్ల మరో ముప్పుకూడా ఉంటుంది. అదే ఊపిరితిత్తులకూ, గుండెకూ, మెదడుకూ ఆక్సిజన్‌ సరఫరా తగ్గడం. కంటి విషయంలోనూ ఇదే జరుగుతుందా అన్న విషయం ఇప్పుడు అధ్యయనంలో ఉంది. (సూపర్‌ వ్యాక్సిన్‌.. అన్ని వేరియంట్లకు అడ్డుకట్ట)

కోవిడ్‌ అనంతరం  ‘బ్లాక్‌ఫంగస్‌’ రూపంలో... 
కోవిడ్‌–19 సోకినప్పుడు... అది తన లక్షణాల్లో భాగంగా కళ్లను ఎర్రబార్చడం, కొంత పింక్‌ రంగులో కనిపించేలా చేయడం, దురదలు పుట్టించడం తప్ప నేరుగా ప్రభావితం చూపదు. కానీ కోవిడ్‌–19 అనంతర పరిణామంగా ‘బ్లాక్‌ఫంగస్‌’ రూపంలో అది కంటిని దెబ్బతీసే ప్రమాదం మాత్రం ఉంది. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చినవారిలో ముఖంలో కొన్ని మార్పులు (ఫేషియల్‌ డిఫార్మిటీ), తలనొప్పి వంటి లక్షణాలతో బయటపడటంతో పాటు... వినికిడి, వాసన తెలిపే జ్ఞానాన్ని ప్రభావితం చేసినట్టే... చూపునూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు మందగించడం, బాగా మసక మసగ్గా (హేజీగా) కనిపించడం, కళ్లలో ఎర్రజీరలు కనిపించవచ్చు. కళ్లు వాచడంతో పాటు కంటి పరిసరాలైన చెంపలు, ముఖం సైతం వాచడం జరగవచ్చు. అప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బ్లాక్‌ఫంగస్‌ అంధత్వాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


కంటి విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి... 
► దేనినైనా ముట్టుకున్న తర్వాత లేదా ఉపరితలాలను తాకిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అవే చేతులతో కంటిని తాకవద్దు. ∙అలా ముట్టుకోవాల్సి / తాకవలసి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

► కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడేవారు కొంతకాలం పాటు వాటికి దూరంగా ఉంటూ... కళ్లజోడు మాత్రమే వాడాలి.  

► కళ్ల సమస్యలు ఉన్నవారు డాక్టర్లు సూచించిన మందులను తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు (ఇమ్యునో కాంప్రమైజ్‌డ్‌ పర్సన్స్‌) తమ కళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

► అన్నిటికంటే ముఖ్యంగా కోవిడ్‌–19 అనంతర పరిణామంగా ‘బ్లాక్‌ఫంగస్‌’తో ఉన్న ముప్పు కారణంగా కన్ను దెబ్బతినడం/ అంధత్వం రావడం వంటి అవకాశాలున్నందున కళ్లలో ఎర్రజీరలు / పింక్‌రంగులో మారడం, వాపురావడం,  నీళ్లుకారడం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 


- డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డి

కంటి వైద్య నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement