కరోనాపై భయం వద్దు.. జయం మనదే! | Do Not Fear About Coronavirus Says Health Experts | Sakshi
Sakshi News home page

కరోనాపై భయం వద్దు.. జయం మనదే!

Published Fri, Aug 21 2020 2:58 AM | Last Updated on Fri, Aug 21 2020 7:51 AM

Do Not Fear About Coronavirus Says Health Experts - Sakshi

ధైర్యంగా ఉంటే కరోనాపై సగం గెలిచినట్టే. నిజానికి మొదట్లో కరోనా సోకినవారి కంటే ఇప్పటి బాధితులు కొంత అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంతోపాటు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇటలీ.. ఇలా ప్రపంచవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న పరిశోధనలతో గతంలో కంటే ఎక్కువ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దాంతో వ్యాధి తీరుపై కొత్త విషయాలు తెలిసి, మరింత స్పష్టత ఏర్పడింది. దానికి అనుగుణంగా చికిత్స ప్రక్రియల్లోనూ మార్పులొచ్చాయి. ఫలితంగా గతంలో కంటే మరెన్నో ప్రాణాలు కాపాడటం ఇప్పుడు సాధ్యమవుతోందని అంటున్నారు పలువురు వైద్య నిపుణులు.

కరోనా చికిత్స పద్ధతుల్లో వెలుగులోకి వస్తున్న కొత్త పరిజ్ఞానంతో ప్రస్తుతం రోగులను కాపాడటం గతంలో కంటే సులువైంది. పైగా దాదాపు ఒక శాతం రోగులకు మాత్రమే ప్రాణాపాయం కలగజేసే కరోనా ఇతర వైరస్‌లతో పోలిస్తే నిరపాయకరమైనదే. ఇప్పుడు మనమంతా చేయాల్సింది కరోనాకు భయపడటం, ఆందోళన చెందడం కాదు.. అది సోకిన వారిని సానుభూతితో చూడటం, ఆత్మహత్యల వంటి వాటికి పాల్పడకుండా మానసికంగా అక్కున చేర్చుకోవడమే. కరోనా వెలుగుచూసిన కొత్తలో లాక్‌డౌన్‌ వల్ల చాలావరకు ప్రయోజనం చేకూరి దాని వ్యాప్తి అదుపులో ఉంది. కానీ సడలింపులు మొదలుపెట్టినప్పటి నుంచి దాని వ్యాప్తి విస్తృతమైంది. అలా విస్తరించడం మరింత తీవ్రమైనప్పటికీ దాని నుంచి రక్షించుకునే విధానాలు, మార్గాలు కొత్తవి తెలిసివచ్చాయి. అవేమిటంటే..

అప్పట్లో ఊపిరితిత్తుల సమస్య.. కానీ ఇప్పుడు..
కోవిడ్‌–19 సోకితే అది నిమోనియాతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ కలిగిస్తుందనేది కరోనా వ్యాప్తిచెందిన తొలినాళ్లలో ఏర్పడిన సాధారణ అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగానే ఆలోచిస్తూ, అందుకు అనుగుణంగా వీలైనన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు. కానీ ఇది రక్తంలో గడ్డలు (క్లాట్స్‌) కూడా ఏర్పరుస్తుందనీ, దాంతో ఎంబాలిజమ్‌ సమస్యతో మరణాలు సంభవించవచ్చని తరువాత రోజుల్లో తెలిసింది. దీనికి అనుగుణంగా జూన్‌ నుంచి రోగులకు కొత్త ప్రొటోకాల్‌ అందుబాటులోకి వచ్చింది. రక్తంలో క్లాట్స్‌ వచ్చే అవకాశం ఉన్న వారికి ఆస్పిరిన్, హిపారిన్‌ వంటి రక్తాన్ని పలచబార్చే మందులనిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు.

నాడు గుర్తించని ‘హ్యాపీ హైపాక్సియా’
రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గడాన్ని హైపాక్సియా అంటారు. హైపాక్సియా ఉన్న రోగికి ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం వంటి సమస్యలుంటాయి. కానీ కొద్దిమంది రోగుల్లో ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ తగ్గుతున్నా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అంటే ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటివి ఉండవు. దాంతో వారు ఉన్నట్లుండి కుప్పకూలిపోతారు. ఆక్సిజన్‌ తగ్గినా ఎలాంటి లక్షణాలు కనిపించని కండిషన్‌ను ‘హ్యాపీ హైపాక్సియా’ అంటారు.

గతంలో కొందరు బాధితుల్ని హాస్పిటల్‌కు తీసుకొచ్చే సమయానికి వారి రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు 70% వరకు ఉండేది. కానీ లక్షణాలుండేవి కావు. ఇటువంటి వారు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించేవారు. అయితే ఇప్పుడు పెరిగిన పరిజ్ఞానంతో చాలామంది ఆక్సీమీటర్‌/పల్స్‌ ఆక్సీమీటర్లతో స్వయంగా తామే రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులను చెక్‌ చేసుకుంటున్నారు. 93% కంటే తక్కువ ఆక్సిజన్‌ ఉంటే అది ప్రమాదకరమని గుర్తించి, హాస్పిటల్‌కు వస్తున్నారు. ఫలితంగా అవాంఛిత మరణాలు తగ్గుతున్నాయి.

పాత మందులే సరికొత్తగా..
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నాటికి లక్షణాలను బట్టి వాడే మందులు (సింప్టమాటిక్‌ ట్రీట్‌మెంట్‌) తప్ప, పేషెంట్లకు ఎలాంటి మందులు వాడాలనే విషయమై అవగాహన లేదు. కానీ ఇటీవల ఫావిపిరావిర్, రెమ్‌డిస్‌విర్‌ వంటి యాంటీవైరల్‌ మందులతో పాటు వైరస్‌పై వాటి ప్రభావాలు తెలియవచ్చాయి. దీంతో వాటి సాయంతో రోగిలో వైరల్‌ లోడ్‌ తగ్గిస్తూ, అసలు రోగి హైపాక్సియా స్థితికి వెళ్లకుండానే కాపాడే ఔషధ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.

కరోనా నుంచి రక్షణకు ‘గౌట్‌’ మందులు 
కరోనా బాధితుల్లోని రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే చిన్నచిన్న క్లాట్స్‌ కారణంగా ప్రాణాపాయం సంభవిస్తోంది. మన రక్తంలో ఉండే తెల్లరక్తకణాలు ఉత్పత్తి చేసే ‘ఆల్ఫా డిఫెన్సిన్‌’ అనే రసాయనం కారణంగా ఇవి ఆవిర్భవిస్తున్నాయని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఊపిరితిత్తులు, గుండెకు చేరి అకస్మాత్తు మరణాలకు దారితీస్తున్నాయి. అయితే మనుషుల్లో బొటనవేలు ఎర్రగా వాచడం, కీళ్ల మధ్య యూరిక్‌ యాసిడ్‌ స్ఫటికం ఏర్పడటం వల్ల తీవ్రమైన నొప్పితో బాధపట్టే ‘గౌట్‌’ అనే కీళ్లవాతానికి ఉపయోగించే మందు ‘కాల్చిసిన్‌’ వంటివి వాడుతూ ఈ క్లాట్స్‌ను అరికట్టవచ్చని తేలింది. దాంతో ఇటీవల ‘కాల్చిసిన్‌’ వినియోగం చాలా ప్రాణాలను కాపాడుతోంది.

ప్లాస్మా థెరపీ
కరోనా సోకిన తర్వాత, యాంటీబాడీస్‌ ఇంకా అభివృద్ధి కాకుండా, పరిస్థితి క్లిష్టంగా ఉన్న రోగులకు ప్లాస్మాథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రూపేణా కూడా ప్రాణాలను కాపాడే వీలు కలిగింది.

ఓరగా పడుకోబెడితే ‘ఊపిరి’
బాధితుడికి ఊపిరి అందనప్పుడు ముఖం/తల ఒకపక్కగా ఓరగా ఉంచుతూ బోర్లా పడుకోబెడితే ఊపిరి మరింత ఎక్కువగానూ, సౌకర్యంగానూ అందుతుంది. ఇలా బోర్లా పడుకోబెట్టే భంగిమను ‘ప్రోన్‌ పొజిషన్‌’ అంటారు. ఇలా చేయడం ద్వారా కూడా రోగికి మరింత ఆక్సిజన్‌ అందేలా చేసి, హైపాక్సియాకు గురికాకుండా చూసి, రోగి ప్రాణాలు రక్షించవచ్చు.

వైరస్‌ కంటే ‘సైటోకైన్స్‌’తోనే ఒక్కోసారి హాని
ఒకనాడు వైరస్‌ కారణంగానే రోగికి ముప్పు కలుగుతోందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో ఉండేది. కానీ ఇప్పుడు తెలిసిన కొత్త విషయమేమిటంటే–ఓ వ్యక్తిని కాపాడేందుకు ఉద్దేశించిన సొంత రోగనిరోధక వ్యవస్థే తీవ్రంగా ప్రవర్తిస్తూ రోగికి నష్టం చేస్తోందని. సాధారణంగా రోగిలోకి ఏవైనా బయటి అపాయాలు ప్రవేశిస్తే, అతడిని రక్షించడానికి వ్యాధినిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇందులో భాగంగా ‘సైటోకైన్స్‌’ అనే రక్షణ కణాలు పెద్దఎత్తున పుడతాయి. శక్తిమంతమైన ఈ కణాలు దేహంలో పెద్దసంఖ్యలో ఉత్పత్తవుతూ వైరస్‌పై దాడిచేస్తాయి. వాటిని తుదముట్టించే క్రమంలో ఓ తుపాన్‌లా విరుచుకుపడే ఈ సైటోౖకైన్‌ ముట్టడిని ‘సైటోకైన్‌ స్టార్మ్‌’ అంటారు.

నిజానికి ఈ సైటోకైన్‌ కణాలు వైరస్‌ అంతుచూసే ప్రక్రియలో భాగంగా విచక్షణారహితంగా చెలరేగిపోతూ.. రోగి తాలూకు ఆరోగ్యకరమైన సొంత కణాలనే దెబ్బతీస్తాయి. దాంతో వైరస్‌ కంటే ఒక్కోసారి సొంత రోగనిరోధక కణాలే మని షికి హానికరంగా మారతాయి. ఈ విషయం తెలిశాక వైద్యనిపుణులు తాము ఎప్పట్నుంచో వాడుతూ వస్తున్న ‘ప్రెడ్నిసోన్‌’ వంటి స్టెరాయిడ్స్‌ను వాడటం మొదలుపెట్టి సత్ఫలితాలను రాబట్టారు. మనకు ఈ స్టెరాయిడ్స్‌ వాడటం ఎప్పట్నుంచో తెలుసు. కానీ సొంత వ్యాధి నివారణ కణాల తీవ్రమైన, ప్రతికూలమైన చర్యలెలా దెబ్బతీస్తున్నాయో తెలిసినప్పటి నుంచి స్టెరాయిడ్స్‌ను అత్యంత చాకచక్యంగా వాడుతూ డాక్టర్లు రోగులను రక్షిస్తున్నారు.

స్టోరీ ఇన్‌పుట్స్‌
► డాక్టర్‌ మహబూబ్‌ఖాన్, సూపరింటెండెంట్‌ అండ్‌ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ ఆఫ్‌ పల్మనరీ మెడిసిన్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, ఎర్రగడ్డ, హైదరాబాద్‌
► డాక్టర్‌ బొల్లినేని భాస్కర్‌రావు, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్, మేనేజింగ్‌ డైరెక్టర్, కిమ్స్‌ హాస్పిటల్, సికింద్రాబాద్‌
► డాక్టర్‌ రాహుల్‌ మెడెక్కర్, సీఈవో, కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement