Emotional Tribute To Famous Cartoonist Satyamurthy Death, See Details - Sakshi
Sakshi News home page

Cartoonist Satyamurthy: బొమ్మల చొక్కా, పూల చీర కార్టూన్‌లు మరి కనిపించవు.. 

Published Fri, May 26 2023 4:07 PM | Last Updated on Sat, Jul 15 2023 3:19 PM

famous cartoonist satyamurthy passed away - Sakshi

గత వారం రవీంద్ర భారతిలో నిర్వహించిన చలం గారి సభకు వెళ్ళి  వస్తుండగా మా అబ్బాయి మోహన్ నీలోఫర్ కేఫ్ మీదుగా వెడదాం, పని ఉంది అన్నాడు. ఆ నీలోఫర్ రోడ్డు, రెడ్ హిల్స్ తోవ వెంట నాకు అనేక జ్ఞాపకాలు  ఉన్నాయి.  ఈ హైద్రాబాద్ నగరంలో నా బ్రతుకు ప్రారంభమయ్యింది ఇక్కడే .  ఈ ప్రాంతాల్లోనే తొలిసారిగా తెలుగు సాహిత్యంలో మహామహులను చూశాను, కలిశాను, కొన్ని వందల రోజులు, గంటలు, రాత్రింబవళ్ళు వారితో కలిసి ఉన్నాను.

అమాయకంగా, బ్రతుకు భాగ్యంగా ఎన్ని మంచి అనుభవాలు జ్ఞాపకాలను ఇక్కడ సంపాదించుకుని మూట గట్టుకున్నానో! ఎపుడు ఆ స్మృతుల  దస్తీ  విప్పినా గుప్పుమని జాజుల పరిమళమే, మిగల మగ్గిన నేరేడు పళ్ల తీపి వగరు వాసనే. ఇక్కడి హనుమాన్ టెంపుల్  పక్కనే సత్యసాయి డిజైనింగ్ స్టూడియోలో నా తొలి ఉద్యోగం మొదలయ్యింది. సత్యసాయి డిజైనింగ్ స్టూడియో యజమాని ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు. నేను చేరినప్పుడు అక్కడ ఉన్నది నలుగురం. సత్యమూర్తి గారు, వారి అబ్బాయి సాయి భాస్కర్, నేను, అఫీస్ అసిస్టెంట్ రామకృష్ణ. అది పంతొమ్మిది వందల తొంభై ఏడు.

ఆయన దగ్గర నేను ఒక నెల మాత్రమే ఉద్యోగం చేశాను. ఈ రోజుకు అది ఇరవై ఆరు సంవత్సరాల కాలంగా  గతించి పోయినప్పటికీ, నేను ప్రతి రోజూ సత్యమూర్తి గారిని తలుచుకుంటాను. ఎలా అంటే  ఇదిగో ఇక్కడ  నా  ఎడమ పక్కన తల తిప్పి చూస్తే గోడ వైపుగా పెలికాన్  రంగు ఇంకు సీసాల మీదు గా నేను నిత్యం వాడే క్రొక్విల్ నిబ్ ఒకటి ఉంటుంది.

దాని హేండిల్ చూశారూ, అది  అల్లాటప్పా, అణాకాని రకమో, ఎక్కడ పడితే అక్కడ దొరికేదో  కాదు, ఆర్డర్ చెయ్యగానే పొస్ట్ లో వచ్చిపడే కంపేనీ తయారి రకం ది అసలే  కాదు. అదే పనిగా కొలతలు ఇచ్చి మరీ తయారు చూపించిన హేండిల్ అది. ఎబోనైట్  మిశ్రమంతో తయారు చేయించింది. సత్యమూర్తి గారు ఒక పెన్నుల కంపెనీలో ఫలానా రకంగా కావాలి అని కోరి  చేపించిన హేండిళ్లు  నాలుగో ఐదో ఉన్నాయి.  అందులో ఒకటి ఆయన మహా చిత్రకారులు  చంద్ర గారికి ఇచ్చారు , ఒకటి నాకు ఇచ్చారు. మిగతావి ఆయన వద్దే ఉన్నాయి.

చంద్ర గారికి నేనంటే ఎంత వాత్సల్యం ఉండేది అంటే ఆయన దగ్గరికి వెళ్లిన ప్రతి సారి ఏదోఒక వస్తువు నా చేతిలో పెట్టేవారు. నా జేబులో ఉంచేవారు. సత్యమూర్తి గారు కాదు నాకు మొదట ఆ హేండిల్ ఇచ్చింది. చంద్ర గారే. ఈ తయారి వెనుక కథ కూడా ఆయనే చెప్పారు. చాలా అందంగా ఉంటుంది ఆ నిబ్బు హేండిల్.

దాని పై నుండి నా కన్ను తిప్పుకోలేకపోతుంటే దానిని నా చేతిలో పెట్టి ఉంచుకో అని చల్లని వెన్నెల నవ్వు నవ్వారు. అ జరిగిన కొద్ది కాలానికి పత్రికల్లో  నా బొమ్మలు చూసి  నన్ను తెగ ప్రేమించిన సత్య మూర్తి గారు మరో రెండు హేండిళ్ళు, కొన్ని డిప్పింగ్ నిబ్బులు చేతిలో పెట్టి ఆయనా నవ్వారు.  ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను వేస్తున్న ప్రతి బొమ్మ వెనుక నిబ్బులా నిలబడి సత్యమూర్తి గారు గుర్తు ఉండనే ఉంటారు.

కథంతా ఇక్కడ మొదలు కాలేదు. అంతకు ముందే, నేను బడిలో , జూనియర్ కాలేజీలో  చదువుతున్న రొజుల్లోనే మొదలయ్యింది. బొమ్మలంటే ఇష్టం. బొమ్మలు వేయడం ఎలాగో  తెలీదు. అలాంటప్పుడు విశాలాంద్ర వారి పుస్తకాల వ్యానులో పుస్తక్ మహల్ వారి ప్రచురణ, సత్యమూర్తి గారి రచన  "హౌ టు డ్రా కార్టూన్స్" పుస్తకంలో ఔత్సాహికులకు స్టెప్ బై స్టెప్ పాఠాలు ఉన్నాయి. సత్యమూర్తి గారి పేరు ఆ పుస్తకం లో చూడ్డం అంతకన్నా కన్నా ముందే నాకు  తెలుసుగా.

పత్రికల్లో కార్టూన్లు, కాలెండర్ల మీద గోడకెక్కిన బొమ్మలు, పుస్తకాల ముఖచిత్రాలు మాతరానికి  పరిచయమే గా. బొమ్మల పరిచయం వేరు, బొమ్మలు ఎలా వెయ్యాలో చెప్పే మాష్టారుగా   తెలుసుకోవడం  వేరు. ఆయన రచించిన  ఆ పుస్తకం ఒళ్ళో ఉంచుకుని నేను బొమ్మల సాధన చేసాను. ఆ పుస్తకం దయ వల్లనే నేను రోటరింగ్ అనే పెన్నును, బౌ పెన్ అనే సాధనాన్ని, నల్లని ఇండియన్ ఇంకు ను, తెల్లని పోస్టర్ వైట్ ని ... ఇట్లా అవసరమైన సాంకేతిక వ్యవహార జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నేల మీద పడుకుని చూస్తే మనిషి ఎట్లా కనపడతాడు? ఫ్యాను రెక్క ఎక్కి చూస్తే మనిషి ఏమని  తెలుస్తాడు అనే వివరాలు నేర్చుకున్నాను. 

నాకు ఊహ తెలిసీ తెలియగానే మారియో మిరండా బొమ్మలు ప్రాణమై కూచున్నాయి.  మనుషుల ఆ ఆకారాలు, డ్రాయింగ్ లో ఆ రిచ్ నెస్. పూలు, తీగలు, ఎగబాకిన కొమ్మలు, నిలువుగా నిలబడ్డ చెట్లు, వెనుక భవనాల సముదాయాలు, ఆ గోడకు లతల డిజైన్లు, కిటికీల మీద షోకు వంపులు. బ్రైట్ గా  కనపడే ఇంకు రంగులు, గట్టి నిబ్బు పనితనం. అవంటే నాకు బాగా ఆకర్షణ.  ఆ రకంగా సత్యమూర్తి గారిని తెలుగు వారి మారియో గా భావిస్తాను నేను. ఆయన రేఖ చాలా తీరుగా ఉంటుంది. కాంపొజిషన్ బాలెన్స్ గా , అక్షరాలు తీర్చి దిద్దినట్లుగా కుదురుతాయి.

 జస్ట్ చిక్కని నలుపుతో అలా ప్రింట్ అయిన స్టికర్ తీరుగా ఉంటుంది ఆయన చిత్ర రచన. చాలా మట్టమైన పని కనబరుస్తారు ఆయన తన బొమ్మల్లో. మనుషుల వ్యవహారం, ఆ నవ్వు, ఆ భంగిమలు, వారు తొడుక్కున్న చొక్కాలపై, కట్టుకున్న చీరల మీద, కూచున్న సోఫాల మీద పొందికైన పూలు, బొమ్మలు, నిలువు, అడ్డం చారలు, కాళ్లకు తొడుక్కున్న బూట్ల మీద వెలుతురు తళుకు. పిక్చర్ పెర్ఫేక్ట్.  మనిషి గా కూడా ఆయన పెర్ఫెక్ట్ గా ఉండే వారు. తిన్నని సఫారీ సూటు, తీర్చి దువ్విన క్రాపింగ్, గట్టి కళ్ళజోడు. నేను ఆయన్ని చూసే సరికి యాభైలు దాటేసారు. యవ్వనపు రోజుల్లో ఆయన అద్భుతమైన అందగాడని, అలా ఆయన  నడిచి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవని ఆయన రోజుల ఆర్టిస్ట్ లంతా చెప్పేవారు. 

ఆయన గురించి చంద్ర గారు చెప్పే ఒక సరదా ముచ్చట వినతగ్గది. చాలా చాలా ఏళ్ల క్రితం అప్పటికీ చంద్ర గారు ఇంకా బొమ్మల్లోకి అడుగు పెట్టని సమయంలో హైద్రాబాద్ లో సెవెన్ స్టార్ సిండికేషన్ వారు తొలిసారిగా  బాపు గారి బొమ్మల కొలువు ఏర్పాటు చేసారుట. ఆ రోజుల్లో తెలుగు పత్రికల్లో బొమ్మల పాపులర్ ఫిగర్స్ ఇద్దరే. ఒకరు బాపు, మరొకరు "చదువుల్రావు" అనే కార్టూన్ స్ట్రిప్ వేసే సత్యమూర్తిగారు. ఆ చదువుల్రావు క్యారెక్టర్ సత్యమూర్తి గారి స్వంత బొమ్మేనని నా అనుమానం.

ఆ పక్కనే జయశ్రీ అనే పెద్ద కళ్ల చిత్రసుందరి భలే ఉంటుంది . సరే! చంద్రగారు ఎక్జిబిషన్ హాల్ లో అడుగు పెట్టి బొమ్మలన్ని చూసేసి  ఈ బొమ్మలేసినాయన ఎక్కడున్నాడా అని వెదుక్కుంటూ వెడితే ఒక చోట అల్లా కోలాహలంట . ఎంచక్కని  చుక్కలు బొలెడు మంది ఒక పురుషుణ్ణి చుట్టు ముట్టి ఆటోగ్రాఫ్  ఆటోగ్రాఫ్ అని అటో పక్కా ఇటో పక్క తనుకులాడుతున్నారుట. అంతా చేస్తే ఆయన బాపుగారు కాదు, చదువుల్రావుట. సత్యమూర్తి గారి బొమ్మకు, ఆయన హీరో పర్సనాలిటికీ అంత క్రేజ్ ఉండేదిట ఆ రోజుల్లో. బాపు ఎక్కడా అని చూస్తే ఒక చెట్టు కింద నిలబడి వంటరిగా తనమానాన ఒక సిగరెట్ కాల్చుకుంటున్నాట్ట మహానుబావుడు.

సత్యమూర్తి గారి స్టూడియో లో నేను కొంత కాలం పని చేసాను కదా. భలే ప్రొఫెషనల్ గా ఉండేది ఆయన సెటప్, బొమ్మలు గీసే పద్దతి, ఆ స్టూడియో. అచ్చం అమెరికన్ చిత్రకారుల మాదిరి డ్రాఫ్టింగ్ టేబుల్, పక్కన బొమ్మల సరంజామా, ఇంకులు, రంగులు. కాసింత దూరంలో అరలు అరలు గా తెరుచుకునే ఒక పెద్ద టేబుల్, అందులో సైజుల వారిగా, మందం వారిగా అద్భుతమైన డ్రాయింగ్ షీట్లు. చమన్ లాల్ కాగితాలు.  బొమ్మలని చాలా పద్దతిగా గా వేసే వారు ఆయన , ఒక బొమ్మ మీద రకరకాల పెన్నులు వాడేవారు. చాలా వెడల్పైన ఫ్లాట్ నిబ్స్ తో రేఖలు గీసేవారు. సాలిడ్ బ్లాక్ ఫిల్లింగ్.

బొమ్మల కథలు, అడ్వర్టైజ్మెంట్ కార్టూన్లు, పెద్ద పెద్ద కంపెనీల లోగొలు, మోనోగ్రామ్ లు. తీరైన పుస్తకాల కలెక్షన్, ఎన్నో విధాలైన టైపోగ్రాఫ్స్, ఫాంట్ ల పుస్తకాలు, కలర్ స్కీం గైడ్లు. అప్పుడు ఇంకా కంప్యూటర్ ఇంకా రాలేదు. ఈ రోజు మీరు చూసే పాల ప్యాకెట్ దగ్గరి నుండి, అగ్గిపెట్టె దగ్గరి నుండి, తలకాయ నొప్పి మందు, తిన్నది సరిగా జీర్ణంకావడానికి సిరప్... అవీ ఇవని కాదు వ్యాపార ప్రపంచంలోని సమస్త వస్తోత్పత్తికి సంబంధించిన బొమ్మలు, ఎంబ్లంలు, అక్షరాలు స్వయంగా, తీరొక్క రీతిగా అన్నీ చేత్తోనే వ్రాసేవారు, చిత్రించేవారు అప్పటి చిత్రకారులు  . ఇప్పుడు ఆ రోజులు, అటువంటి పనిమంతులు కరువై  పోయారు.

ప్రతీదీ కాపీ పేస్ట్.  స్వంత బుర్ర పెట్టి ఏదీ రావడం లేదు. అన్నీ కంప్యూటరే, అన్నీ ప్రింట్ కాగితాలే, అంతా ప్లాస్టిక్ ప్రచారమే, అన్నీ కాపీ ఈజ్ రైటే.  అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన రూపూ, రంగూ, రేఖ మీద, ఆ జీవితం మీద ఒక పుస్తకం తెలుగు సాహిత్యానికి , జీవితానికి మనం బాకీ ఉన్నాము. నిజానికి దానిని మనకు అందించి ఉండవలసినది సత్యమూర్తి గారు.

తెలుగు పొస్టర్ డిజైన్ కు సంబంధించి చాలా విషయజ్ఞానం  ఉన్న మరో వ్యక్తి  శ్రీ గీతా సుబ్బారావు గారు.  ఆయన ఎలా ఉన్నారో! ఏం చేస్తున్నారో తెలీదు.  ముందు మనం ఏదయినా పుచ్చుకొవాలనే తపన ఉంటే కదా ఇచ్చేవారికి ఇవ్వాలి  అనిపించేది. గీతాసుబ్బారావు గారి అన్నగారు శ్రీ వీరాజీ గారూ ఆయన ఒక తరం  తెలుగు పత్రికా జీవితాన్ని తన ఆత్మకథ గా అద్భుతంగా చెప్పుకున్నారు. అది ఏవయిందో తెలీదు.  అవన్నీ పుస్తకాలు గా రావలసినది. ఏదీ రాదు. ప్రెస్ అకాడమిలు ఎందుకు ఉన్నవో నాకైతే నిజంగా తెలీదు.

నేను ఆయన వద్ద  ఉద్యోగం చేసింది నెల  మాత్రమే . చిన్న ఊరినుండి వచ్చిన వాడిని .ఏమీ తెలీదు. స్కేలు  పట్టుకోవడం, సెట్ స్క్వయర్  ఉపయోగించడం, ప్రెంచ్ కర్వ్స్ వాడి లోగో డిజైన్ లు చేయడం, అక్షరాలూ వ్రాయడం, తొంబై డిగ్రీల్లో టెక్నీకల్ పెన్ను వాడటం అన్ని ఆయన దగ్గరే తొలిసారి చూసాను, తెలుసుకున్నాను.  ఆయన నా గురువు.  చాలా కాలం విరామం తరువాత  ఒకసారి ఆయన్ని ఒక కార్టూన్ షోలో  చూశాను. నన్ను చూసి ఎంతో సంతోషించారు. ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెలితే గుప్పెట నిండా గుప్పెడు  నిబ్బులు పెట్టారు. ఒక మంచి డ్రాఫ్టింగ్ టేబులు వాళ్ల అబ్బాయి తో ఇప్పించారు. ఇపుడు ఏది తలుచుకున్నా గతం.

ఒకానొక కాలంలో ,ఒకే కాలంలో బాపు, జయదేవ్, సత్యమూర్తి, బాలి, చంద్ర, గోపి, మోహన్, రాజు, బాబూ, కరుణాకర్... గార్ల వంటి అత్యంత అరుదైన చిత్రకారులు ఇక్కడ ఉండేవారు, మాతో మాట్లాడేవారు, అభిమానించేవారు, తప్పులు దిద్దేవారు ఒప్పులుగా మిగలడానికి తమదైన ప్రయత్నం చేసేవారు అని అనుకోవడం తప్పా మరేం మిగల్లేదు. ఇప్పుడు గురువులు ఎవరూ లేరు.  శిష్యులుగా మిగలడానికి ఎవరికీ రానిదీ, తెలియనిదీ ఈరోజుల్లో  ఏదీ లేదు. తెలుగులో బొమ్మలకు, కార్టూన్ కళకు, మనకు ఒకప్పుడు ఉండిన ఒక కళకు, నల్లని సిరాకు, పదునైన పాళికి   చివరి రోజులివి.  సత్యమూర్తిగారికి కూడా  శ్రద్దాంజలి  
 
(ప్రముఖ కార్టూనిస్ట్, ఒక తరం గురువు  సత్యమూర్తి గారు 83 ఏళ్ళ వయసులో  25-05-23 న మననుండి దూరమయ్యారు, తెలుగు కార్టూన్ లో చివరగా  మిగిలిన బొమ్మల చొక్కాలు, పూల చీరలు, నిలువు చారల, అడ్డ గీతల ఫర్నీచర్ కూడా మాయమయ్యింది.

అన్వర్
అర్టిస్ట్‌, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement