వేసవి వేడిని తట్టుకోవడానికి మన డ్రెస్సింగ్‌లో చాలా మార్పులను కోరుకుంటాం. లైట్ వెయిట్‌తో ఉండాలి. లేత రంగులు ఉండాలి. ఆకట్టుకునే హంగులూ ఉండాలి. ఇవన్నీ కోరుకునే యువత నచ్చేలా.. వారి మనసుకు నచ్చేలా సంప్రదాయ చేనేతలతో ఆధునికత ఉట్టిపడేలా డిజైన్ చేయచ్చు. ‘ఆ ఆలోచన నుంచే రూపుదిద్దుకున్న డిజైనర్ కలెక్షన్ ఇది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి.
కాలానుగుణంగానే కాదు మారుతున్న నవతరం ఆలోచనలకు తగినట్టుగా డిజైన్స్ మీద దృష్టి పెడతానని వివరించే హేమంత్ సిరి ఇటీవల తను తీసుకువచ్చిన సమ్మర్ కలెక్షన్ గురించి చెబుతూ..
తూనీగ... తూనీగ...
‘‘వేసవి ఆహ్లాద సమయాల్లో మనల్ని చుట్టుముట్టే అందమైన జ్ఞాపకాలలో తేలికైన రెక్కలతో సందడిచేసే తూనీగ ఒకటి. సుతిమెత్త్తని చేనేత మల్ చందేరీ ఫ్యాబ్రిక్ కూడా అలాంటి ఆహ్లాదాన్నే పంచుతుంది. దీనికితోడు తూనీగ రెక్కల్లో ఉండే ముచ్చటైన ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే లేత రంగులు కూడా ఆకట్టుకుంటాయి.
దీని నుంచి స్ఫూర్తి పొంది, మల్‌చందేరీ ఫ్యాబ్రిక్ మీద వాటర్ కలర్స్‌తో ఆర్టిస్టులు రూపొందించిన పెయింటింగ్స్‌ను డిజిటల్ ప్రింట్లుగా తీసుకొస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చేసిన ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే ఈ ‘డ్రాగన్ ఫ్లై కలెక్షన్’.
నవతరం ఇష్టపడేలా హుడీ ప్యాటర్న్స్, జిపర్ ప్యాటర్న్స్, లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్, టాప్స్, కంఫర్టబుల్ కట్స్‌తో డిజైన్ చేసినవి. మొదటిసారి ఈ ప్రత్యేకమైన ప్రింట్స్‌తో తీసుకొచ్చిన కలెక్షన్ ఇది’’ అని వివరించారు ఈ సీజనల్ డిజైనర్.
-హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment