వేగానికి చిరుత. ఎత్తుకు ఎవరెస్టు. అతి వేగంతో ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళగా ఇప్పుడు త్సాంగ్ ఇన్ హంగ్ (45) చిరుతకు, ఎవరెస్టుకు కొత్త గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టారు!
సరిగ్గా వారం క్రితం మే 23 వ తేదీ ఆదివారం ఈ ‘ఫీట్’ను సాధించారు హంగ్. బేస్ క్యాంప్ నుంచి ఆ ముందు రోజు మధ్యాహ్నం గం.1.20 లకు ఎవరెస్టును ఎక్కడం ప్రారంభించి, మర్నాడు మధ్యాహ్నం గం. 3.10 ని.లకు శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆమె తన సంతృప్తి కోసం చకచకా ఎవరెస్టును ఎక్కారు తప్ప.. ‘ఫాస్టెస్ట్ ఉమన్’ అని అనిపించుకోడానికి ఎక్కలేదట! 25 గంటల 50 నిముషాల్లో ఎక్కడం పూర్తి చేశారు. అది రికార్డు అని అప్పుడు ఆమెకు తెలియదు.
పక్కనే ఉన్న టీమ్ లీడర్ షేర్పాకు, ఆ టీమ్‌లోని తక్కిన పర్వతారోహకులకూ అంత కచ్చితంగా తెలీదు. వారంతా కిందికి దిగి వచ్చాక ఈ శుక్రవారం నేపాల్ ప్రభుత్వాధికారులు త్సాంగ్ ఇన్ హంగ్ 12 గంటల తేడాతో పాత రికార్డును బద్దలు కొట్టినట్లు ప్రకటించారు! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి వేగంగా ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మహిళగా నేపాల్‌కు చెందిన ఫున్జో ఝంగ్ము లానా పేరుతో రికార్డు ఉంది. 2018 మే 17న ఆమె ఆ రికార్డును నెలకొల్పారు. 39 గంటల 6 నిముషాల్లో బేస్ క్యాంప్ నుంచి ఫున్జో ఆ రికార్డును నెలకొల్పారు. ఫున్జో రికార్డును ఇప్పుడీ హాంకాంగ్ మహిళ త్సాంగ్ ఇన్ హంగ్ తనకు తెలియకుండానే బ్రేక్ చేశారు.
నిజానికి మే 12 నే శిఖరాన్ని చేరుకోవలసింది హంగ్. ఆ రోజు గాలులు ఉద్ధృతంగా ఉన్నాయి. కుమ్మరించినట్లుగా ఒకటే మంచు. 8,750 మీటర్ల ఎత్తుకు వెళ్లి కూడా అక్కడే ఆగిపోయారు. ఇక వంద మీటర్లే కదా, ఎక్కేద్దాం అనుకోలేదు. తొలిసారి ఆమె 2017 మే 21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇప్పుడు మళ్లీ ‘డ్రీమర్స్ డెస్టినేషన్ ట్రెక్స్ అండ్ ఎక్స్‌పెడిషన్’ కంపెనీ తరఫున మరొకసారి ఎవరెస్టును చేరుకున్నారు. అదీ అత్యంత వేగంగా. హంగ్ టీచర్. ఎవరెస్టు కంటే ముందు 2016లో ఆమె చైనాలోని ముజ్టాగ్ పర్వతాన్ని ఎక్కారు.
‘‘ఇదంతా నా స్టూడెంట్స్, నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం’’ అంటారు హంగ్. కలను నిజం చేసుకోలేకపోతే జీవితంలో మనం తర్వాతి అడుగు వేయలేం అని హంగ్‌కు వాళ్ల అమ్మ చెబుతుండేవారట. 2011–2019 మధ్య కాలంలో హంగ్ ఐదు వేల నుంచి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను ఇరవై సార్లు ఎక్కి దిగారు. పర్వతాలు సానుకూల ఆలోచనల్ని కలిగిస్తాయని, ఒదిగి ఉండటం నేర్పుతాయనీ హంగ్ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment