ఆహారం... ఒంటబట్టించుకుందామా..! | Food and Digestive System | Sakshi
Sakshi News home page

ఆహారం... ఒంటబట్టించుకుందామా..!

Published Thu, Dec 17 2020 8:57 AM | Last Updated on Thu, Dec 17 2020 8:57 AM

Food and Digestive System - Sakshi

ఎవరైనా ఉండాల్సిన దానికంటే మరీ పీలగా కనిపిస్తూ ఉంటే అడిగే ప్రశ్న ఒకటుంది. ‘‘ఏంటి బాగా తినడం లేదా’’ అని. ఒకవేళ బాగానే తింటున్నానే అనే జవాబు వస్తే... ‘‘మరి తిన్నది ఒంటబట్టడం లేదా... ఒకసారి చూపించుకోకపోయావా?’’ అని. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమై... అది సరిగా ఒంటికి పడుతుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ తిన్నది అరగడం లేదా అన్న ప్రశ్న కొన్నిసార్లు నిందాపూర్వకంగా వినిపించవచ్చు. కానీ ఒంటికి పట్టడం లేదా అన్న ప్రశ్న మాత్రం సానుభూతితో వేసేదే. తిన్న  ఆహారం ఒంటికి పట్టకపోతే తొలిదశల్లో ఒక చిన్న సమస్యే. కానీ అశ్రద్ధ చేస్తే అదో పెద్ద సమస్య అవుతుంది. దాంతో ఎన్నో ఇబ్బందులూ, ఇక్కట్లూ వస్తాయి. తిన్నది ఎలా ఒంటికి పడుతోంది మొదలుకొని ఒంటబట్టకపోతే వచ్చే సమస్యలూ వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కోసం ఈ కథనం. 

మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యాక... పేగుల నుంచి రక్తంలోకి వెళ్లి... అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, లవణాలు అన్ని కణాలకూ చేరతాయి. ఒకవేళ అలా చేరకపోవడాన్ని ఆ సమస్యను ‘మాల్‌అబ్జార్‌ప్షన్‌’ అంటారు.

జీర్ణక్రియ విధానం...
మనం తీసుకున్న ఆహారం చక్కగా అరిగే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. కానీ అలా జీర్ణం కాకపోతే రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి. ఆహారాన్ని నోట్లో పెట్టుకుని నమలడం మొదలుపెట్టినప్పుడే జీర్ణక్రియ మొదలవుతుంది. ఎందుకంటే... మన పళ్లతో నమలటం వల్ల ఆహారాన్ని మరింత చిన్న చిన్న భాగాలుగా మనందరమూ  చేస్తుంటాం. ఈ ప్రక్రియలో జీర్ణక్రియకు నోట్లో ఊరే లాలాజలం తోడ్పడుతుంది. ఇందులోని (సెలైవాలోని) కొన్ని ఎంజైములు ఆహారాన్ని మరింత చిన్నచిన్న రేణువులుగా చేస్తాయి. పొట్ట లేదా ఉదరం ఒక మిక్సర్‌లాగ పనిచేసి, అక్కడ ఊరే  హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం సహాయంతో ఆహారమంతా బాగా కలిసిపోయేలా చేస్తుంది. నోటిలోనూ, కడుపులోనూ జరిగే జీర్ణక్రియ కొంత యాంత్రికంగా జరుగుతుంది. అంటే పళ్ల ద్వారా నమిలే ప్రక్రియ యాంత్రికప్రక్రియ అనుకోవచ్చు. ఆ తర్వాత మరికొంత రసాయనికంగా కూడా జరుగుతుంది. అంటే లాలాజలంలోని ఎంజైముల ప్రభావం వల్ల జరిగే క్రియలన్నమాట. 

అలా పాక్షికంగా జీర్ణమైన ఆహారం... మన అన్నవాహికలో చేరే సమయానికి ఇంకా ‘అబ్జార్‌ప్షన్‌’ ప్రక్రియ మొదలుకాదు. అక్కడ కొద్దిపాటి ఘనరూపంలో ఉన్న ఈ పదార్థం చిన్నపేగులలోకి ప్రవేశించగానే అక్కడ ఉండే ఎంజైములు, పాంక్రియాటిక్‌ ఎంజైములు, పైత్యరసం (బైల్‌జ్యూసెస్‌)... వీటన్నిటి కారణంగా ఆహారం మరింత చిన్నచిన్న రేణువులుగా మారి, రక్తంలోకి విలీన మయ్యే స్థితికి చేరుకుంటుంది. ఈ ప్రక్రియకు చక్కెర పదార్థాలు, అమైనో యాసిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు కూడా సహాయపడతాయి. 

ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా చిన్న పేగుల మొదటి భాగం నుంచి  ప్రారంభమై చిన్నపేగు చివరిభాగం వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో బి 12 విటమిన్‌ తప్ప మిగతావన్నీ ‘ప్రాగ్జిమల్‌ చిన్నపేగు’ భాగంలో ఇంకుతాయి. చిన్నపేగు చివరి భాగమైన ‘ఇలియం’లో బైల్‌ సాల్ట్స్‌ ఇంకిపోతాయి. చిన్నపేగులో కోటానుకోట్ల సంఖ్యలో ఉండే ‘మైక్రోవిల్లీ’ అనే మన చితివేళ్లలా కనిపించే అత్యంత సన్నటి (మైక్రోస్కోపిక్‌) ప్రొజెక్షన్స్‌ ఉంటాయి. వీటిని చాపలా పరిస్తే చిన్నపేగు వైశాల్యం దాదాపు 500 చదరపు అడుగుల పైమాటే! కానీ అవన్నీ కేవలం అర చదరపు మీటరు ప్రాంతంలో కుదించుకుపోయి ఉంటాయి. 

చిన్నపేగు లోని మొదటి భాగాన్ని డియోడనమ్‌ అంటారు. చిన్నపేగులోని ఎక్కువ భాగాన్ని ఇది ఆక్రమించి ఉంటుంది. ఎంజైములు ఇక్కడే స్రవిస్తాయి. ఇక్కడే సుక్రోజ్, మాల్టేజ్, లాక్టేజ్‌ విడుదల అయ్యి ఆహారాన్ని చక్కెర రూపంలోకి మారుస్తాయి.                                                                                                                

చిన్నపేగుల్లో స్రవించే పెప్టిడేజ్‌ అనే ఎంజైమ్‌ ప్రోటిన్లు అమైనో యాసిడ్స్‌గా మారుస్తుంది. లైపేజ్‌ అనే ఎంజైమ్‌ కొవ్వు పదార్థాలను గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్లుగా మారుస్తుంది. లాక్జోజ్‌ అనేది పాలల్లో ఉండే చక్కెరపదార్థం. లాక్టేజ్‌ అనే ఎంజైమే లేకపోతే మన జీర్ణప్రక్రియలో పాలు లేదా పాలపదార్థాలు అరగనే అరగవు. అలా చేసుకోలేకపోతే కడుపులో గ్యాస్‌ నిండినట్లయి కడుపు ఉబ్బరం వంటి భావన కలుగుతుంది. కడుపు నిండుగా ఉన్నట్లుగా, ఆనారోగ్యంగాను ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. లాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌ అనే సమస్య ఉన్నప్పుడు పాలు జీర్ణం కాకపోవడంతో ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. 

ఆహారం డియోడనమ్‌లోకి చేరగానే... కొన్ని హార్మోన్ల ప్రభావంతో బైల్‌ ఉత్తేజితం కావడం, పాంక్రియాటిక్‌ స్రావాలు స్రవించడం జరుగుతుంది. కాలేయం, పిత్తాశయాల నుంచి ‘బైల్‌’ స్రావం డియోడనమ్‌కు చేరి... అక్కడున్న కొవ్వుముద్దల పరిమాణాన్ని చిన్న చిన్న గోళాల సైజుకు మారుస్తుంది. 

చిన్నపేగులు ఆహారాన్ని పూర్తిగా ఇంకిపోయేలా చేసుకోవాలంటే... అది అత్యంత చిన్న  రేణువులుగా ఉండితీరాలి. అలా జరగనప్పుడు దాన్ని అజీర్ణం / అజీర్తిగా పరిగణించవచ్చు. జీర్ణప్రక్రియ అనేది క్రమంగా ఒకదానితో మరొకటి ముడిపడిన అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. అందుకే జీర్ణ వ్యవస్థ ఓ అతి పెద్ద వ్యవస్థగా చెప్పవచ్చు. ఆ వ్యవస్థలోగాని, జీర్ణప్రక్రియల వరసల్లోగాని ఇక్కడైనా తేడా వస్తే అది అజీర్ణానికి దారి తీసి, ఒంటికి పట్టని పరిస్థితులు ఏర్పడతాయి. అలా ఆబ్బార్‌ప్షన్‌ సమస్య వస్తుంది.  

పరీక్షలు   
కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్ష, ఎండోస్కోపీ, రేడియలాజికల్‌ పరీక్షలతో ఆహారం ఇంకకుండా పోవడానికి గల కారణాలను తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్సలు చేయాల్సి ఉంటుంది.  

చికిత్స 
చికిత్సలో రకరకాల పోషకాలు (న్యూట్రియంట్స్, విటమిన్లు), ఖనిజ లవణాలు (మినరల్స్, ఎలక్ట్రోలైట్లు), ద్రవాలు (ఫ్లూయిడ్లు) చాలా అవసరం. అహారాన్ని ఇంకేలా చేసుకునే అబ్జార్‌ప్టివ్‌ సర్‌ఫేస్‌ (చిన్నపేగుల్లో నుంచి రక్తంలోకి ఆహారాన్ని శోషణ చేసే ఉపరితలం) దెబ్బ తిన్నా, అక్కడ సర్జరీ అవసరమయినా ఎక్కువ రోజుల పాటు  చికిత్స అవసరమవుతుంది. అవసరాన్ని బట్టి పాంక్రియాటిక్‌ ఎంజైముల వంటి వాటిని నోటిద్వారా అందచేయాలి. కొన్ని సందర్భాలలో ఆహారనియమాలను ఖచ్చితంగా పాటింపజేయాల్సి రావచ్చు. సీలియాక్‌ వ్యాధి లేదా  లాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌ వస్తే కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎప్పుటికీ తీసుకోకూడదు.  బ్యాక్టీరియా విచ్చలవిడిగా పెరిగి, ఇన్‌ఫెక్షన్ల వంటివి సర్వసాధారణంగా యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల తగ్గుతాయి. వీటి వాడకం వల్ల క్రిములు పోతాయి. క్రోన్స్‌  లింఫోమా, టీబీ వంటి వాటికి తగు చికిత్స అందించాల్సి ఉంటుంది.  ప్రోబయోటిక్స్‌ వాడటం ద్వారా పేగులలో జీర్ణక్రియకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా వృద్ధిచెంది పరిస్థితి బాగా చక్కబడుతుంది. 

మాల్‌ ఆబ్బార్‌ప్షన్‌లో ఈ కింద పేర్కొన్న లక్షణాలు మనకు కనిపిస్తాయి. అవి... 
∙నీళ్ల విరేచనాలు (డయేరియా) ∙కడుపు ఉబ్బరంగా ఉండటం ∙కడుపు పట్టేసినట్టుగా ఉండటం ∙బరువు తగ్గడం ∙ఆయా విటమిన్లు, ఖనిజ లవణాల ఏయే అనారోగ్యాలు కనిపించాలో అవి కనిపించడం (ఉదాహరణకు ఐరన్‌ అందకపోవడం వల్ల  రక్తహీనత (అనీమియా) ఏర్పడటం ∙చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం ∙జింక్‌ వంటి పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు ఊడిపోవడం ∙విటమిన్‌–ఏ అందక రేచీకటి రావడం ∙విటమిన్‌ కె లోపం కారణంగా రక్తస్రావం ఆగకపోవడం ∙క్యాల్షియమ్‌ లోపం వల్ల ఆస్టియోపోరోసిస్‌ ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు
చిన్నపేగుల్లో ఏవైనా సమస్యలుంటే మాల్‌అబ్జార్‌ప్షన్‌ కు ప్రధానంగా అవి కారణం కావచ్చు. చిన్న పేగుల్లో సమస్య వల్ల... అంటే కొందరిలో జియార్డియా అనే ఏకకణ జీవులు లేదా మరికొన్ని రకాల క్రిములు పేగుల్లోకి చేరడం, హెచ్‌ఐవీ, టీబీ, విపుల్స్‌ డిసీజ్‌ వల్ల పేగుల్లోంచి ఆహారం సరిగా రక్తంలో కలవకపోవచ్చు. దాంతోపాటు ఒక్కోసారి పేగుల్లో ఉండే బ్యాక్టీరియా విపరీతంగా పెరగడం వల్ల కూడా మాల్‌అబ్జార్‌ప్షన్‌ సమస్య రావచ్చు. 

కొందరిలో తీవ్రమైన కాలేయ సమస్య ఉన్నప్పుడు, పేగుల్లోకి బైల్, పాంక్రియాటిక్‌ జ్యూస్‌ సరిగా ప్రవహించకపోవడం వల్ల కూడా ఆహారం సరిగా ఒంటపట్టకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మట్టి రంగులో విరేచనం అవుతుంది. ఇది ఒకింత జిగటగా ఉంటుంది. 

విటమిన్‌– కె తగ్గితే అప్పుడప్పుడు విరేచనంలో రక్తం కూడా కనపడవచ్చు.

కొంతమందికి గోధుమ సరిపడదు. ఇలా గోధుమ వల్ల అలర్జీ రావడాన్ని గ్లుటెన్‌ ఇన్‌టాలరెన్స్‌ అంటారు. (దీనినే సీలియాక్‌ వ్యాధి అంటారు). మరికొందరికి ఆవుపాలు, సోయాపాలు పడకపోవచ్చు. అలాగే... ఫ్రక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్, క్రోన్స్‌ వ్యాధి, రేడియేషన్‌ ఎంటెరైటిస్, లాక్టోజ్, సుక్రోజ్‌ లోపించడం. పేగులలో ఉండే ఫిస్టులా, చిన్నపేగులు అతిగా స్పందిస్తూ ఉండటం, డైవర్టిక్యులోసిస్, లింఫొమా, ఐపిఎస్‌ఐడి వంటి పేగు క్యాన్సర్లు, ఇసినోఫిలిక్‌ గ్యాస్ట్రోఎంటిరైటిస్, సిస్టమిక్‌ ఎమిలోయిడోసిస్‌ వంటివాటితో పాటు, డయాబెటిస్, హైపర్‌థైరాయిడిజమ్‌ వంటి జబ్బులు కూడా మాల్‌అబ్జార్‌ప్షన్‌కి కారణం కావచ్చు. 

కొన్ని రకాల మందులు సరిపడకపోవడం వల్ల కూడా మాల్‌అబ్జార్‌ప్షన్‌ సమస్య వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement