వినాయకచతుర్థి రోజు అందరూ పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి పట్టు వస్త్రాలు లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకొని, మండపాన్ని ఏర్పరచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేసి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, స్వామికి ఇష్టమైన కుడుములు, అపూపాలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పాయసం, పానకం, వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి, వ్రతకథను చదువుకొని, కథాక్షతలని శిరస్సున ధరించి, బ్రాహ్మణులను సత్కరించి, ఆనందంతో అందరూ కలసి ప్రసాదాలని స్వీకరించి, గణేశ భజనలతో, కీర్తనలతో, పురాణశ్రవణంతో ఆయన మీదే మనసు లగ్నం చేసి, ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండగను మనం జరుపుకుంటాం. నేడు వినాయక చవితి సందర్భంగా ఈ పండుగ ప్రాధాన్యతను, వినాయకుని విశిష్టతను మరోసారి తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలనకు అవతరించి మంగళస్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు. గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలంనుండి ఆరాధనలందుకుంటున్న దైవం, వేదాలలో స్తుతించబడి, గణాలకు అధిపతియై, శబ్దాలకు రాజుగా, ప్రణవ స్వరూపుడై శబ్దబ్రహ్మగా ‘గ’ శబ్దం బుద్ధికి ‘ణ’ శబ్దం జ్ఞానానికి ప్రతీక. సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా ‘గణపత్యధర్వ శీర్షం’లో వర్ణించారు.
గణాలంటే అక్షరాలతో ఏర్పడే ఛందస్సు – గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి ‘. అంతేకాకుండా ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు. సృష్టి ఆదిలో దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు.
అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాధ, దీనిలో అంతరార్థం ఏమిటంటే మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –ఆ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారం వద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి.
గణనాయకుడు ఎలా అయ్యాడు?
వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు. తల్లిదండ్రులు పూజ్యులని వారిని సేవిస్తే పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చాటి చెప్పడంతో విఘ్నాధిపత్యం వహించి గణాలను నాయకుడయ్యాడు. అలా వినాయకుడు గణనాయకుడయ్యాడు.
వినాయకుని ఆసనంలో గల అంతరార్థం:
తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు! ఆయన భంగిమలను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి.
ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. కర్మయోగులకు ఈ రెండూ అవసరమే కదా! ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు.
గణపతి నవరాత్రులు ఎందుకు?
భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది. గుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి, సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోంది. కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు.
అంటే, పదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం. తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు. తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు! శాస్త్రీయంగా ఇది నిజమే. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది.
--డి వి ఆర్ భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment