ఆయేషా సేథ్, మెకప్ ఆర్టిస్ట్
సాధారణ పల్లెల నుంచి పెద్దపట్టణాల వరకు ఎంతోమంది అమ్మాయిలకు ‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనే లక్ష్యం ఉండవచ్చు. పక్కవారి నుంచి వెక్కిరింపులు కూడా ఎదురు కావచ్చు. ‘అది మనలాంటి వాళ్ల కోసం కాదు’ అంటూ అతిశయోక్తుల సమాచారం వెల్లువెత్తవచ్చు. ఈ గందరగోళాన్ని పక్కకు నెట్టి, స్పష్టత ఇవ్వడానికి, విజయం వైపు దారి చూపడానికి వచ్చిందే.. ది గ్రూమింగ్ స్కూల్.
‘అందంగా కనిపించాలనే ఆసక్తి మీలో ఉందా?
ఆత్మవిశ్వాసం ఉందా?
మీలోని శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం ఉందా?...‘అయితే ఈ లైఫ్ ఛేంజింగ్ స్కూల్ మీకోసమే’ అంటోంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్(ముంబై). దశాబ్దాలుగా ఎంటర్ టైన్‌మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) ఎంతోమంది యువతులు అందాల కిరీటాన్ని అందుకోవడంలో సహాయపడింది.
‘డూ–ఇట్–యువర్‌సెల్ఫ్’ అని నినదిస్తున్న ‘ఎంఐవో’ ఔత్సాహిక యువతుల కోసం ‘ది గ్రూమింగ్ స్కూల్’ ద్వారా వివిధ రంగాల నిపుణులతో వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, స్టైలింగ్, మేకప్, వ్యక్తిత్వ వికాసం, ఫ్యాషన్ స్టైలింగ్, సోషల్ మీడియా... మొదలైన వాటిలో నిపుణులు వీడియో తరగతులు నిర్వహిస్తారు. వారిలో కొందరు...
అయేషా సేథ్ (మేకప్ ఆర్టిస్ట్), అలేషియా రౌత్(ర్యాంప్ వాకర్), సంజీవ్‌దత్తా (పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచ్), భరత్ గుప్తా (ఫ్యాషన్ స్టైలీస్ట్), డా.జార దాదీ (స్కిన్‌కేర్ కోచ్). యువతులను బ్యూటిఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా నిలపడంలో వీరి పాఠాలు ఉపయోగపడతాయి. ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత నైపుణ్యం సొంతం అవుతుంది.
‘కల కనడం ఎంత ముఖ్యమో, ఆ కలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారి కోసం, నిర్మాణాత్మకమైన పాఠాలతో ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశాం’ అంటుంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్.
కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం అపారంగా అందుతుంది!
Comments
Please login to add a commentAdd a comment