మాఘమాసంలో ఆదివారం వ్రతం ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి. అతనికి ప్రీతికరమైనది ఆదివార వ్రతము. ఈ వ్రతం ఏ ఆదివారమైన చేయవచ్చు. అయితే మాఘమాసంలో అన్ని ఆది వార లైనా వీలుకాక పోతే ఒక ఆది వారమైనా చేయపచ్చు. సూర్యభగవానుడు ఆనంతమైన కిరణాలు కలవాడు. జగత్తుకు వెలుగు ప్రసాదించేవాడు జ్యోతి స్వరూపుడు. దినరాత్రాలు ఏర్పరిచినవాడు. ఆయురారోగ్యాలు ప్రదాయించేవాడు. శుభాలను కలిగించేవాడు.ముల్లోకాలకు చూడామణి.దినమునకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజు ఆదివారం. మాఘమాసంలో ఈ ఆదివార వ్రతం చేయడం శుభప్రదం.ఈ వ్రతం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. ఇందుకు సంబంధించిన ఒక పురాణ కథ ఉంది.పూర్వం ఉజ్జయినీ నగరంలో ఒక అవ్వ ఉండేది.ఆమెకు ఎవరూ లేరు. దైవభక్తి పరురాలు. తెల్లవారు ఝామునే లేచి ఆవు పేడతో నీళ్లు జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుని పూజించేది. అంతవరకు మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరు గింటివారి నుంచి గోమయం తెచ్చుకునేది.
అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యం గాను సంతోషంగాను ఉండడం చూసి పోరుగామె ఈర్ష్య పడేది. నా ఆవు పేడవల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నాది.సుఖంగాఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖసంతోషాలు వుండవు అనుకొని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు.కాకతాళీయంగా ఆ రోజు మాఘపాదివారం.నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర పోలేక పోయింది.రాత్రల్లా ఒకే ఆలోచన.రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి.అనుకుంది.కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది.ఆమె ఆనందానికి హద్దులు లేవు.గుమ్మం ముందు ధవళ వర్ణం తో మెరిసి పోతున్న ఆవు అక్కడ ఉంది. అవ్వను చూడగానే పేడ వేసింది.అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతు న్నాయి. గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్యకర్మలు పూర్తి చేసింది.ఆవు అక్కడ నుంచి కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తను తింది.రాత్రైనా ఆవు కదల లేదు. దేవుడే తన కిచ్చాడని అనుకోని ఇంట్లో కట్టింది.
రోజూ ఆవుకు మేత పెడుతోంది పొరుగింటామె ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చా రు. బహుశా దొంగలించిందని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది.గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి అవును తోలుకెళ్ళి పోయారు.ఆ రాత్రి ఆమె దేవుడిని తలచుకుంటేనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కన్పించి ఆ అవ్వ దొంగ కాదు. ఆవునునేనే ఇచ్చాను. తెల్ల వారక మునుపే ఆవును తిరిగి ఆమె ఇచ్చి పరిహారంగా పది రూక లియ్యిఅన్నాడు.
కోడి కూతతో లేచి ఈ రోజు అయినా పోరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికివచ్చింది.గ్రామాధికారి మనిషి ఆవును అవ్వ అప్పగించి "అవ్వా! ఈ ఆవు నీదే. నష్ట పరిహారంగా మా యజమాని పదిరూకలిచ్చాడు తీసుకో " అన్నాడు అది మాఘమాసం.ఆదివారం ఆనాటి నుంచి ఆ గ్రామవాసులు ఆదివారం వ్రతం చేయడం మొదలెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘపాదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమనుంచి కలశం పెట్టి సూర్యభాగవానుడి షోడషోపచారపూజ చేయాలి ఇలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయడం వలన జన్మజన్మల సంచిత పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతే కాక రోగ భయాలుండవు.సిరిసంపదలతో ఇల్లు కళకళలాడుతుంది.
-గుమ్మా ప్రసాద రావు
Comments
Please login to add a commentAdd a comment