పండగ అనగానే ఆహారం గురించి హెచ్చరికలు చేసేవారే ఎక్కువ. మితం ఎలాగూ హితమే. కానీ ఈ సందర్భంగా మనం చేసుకునే కొన్ని వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికీ తోడ్పడతాయి. రోజూ అన్ని రకాల ఆహార పదార్థాలను తినలేనివారు కనీసం పండగ రోజయినా నచ్చిన పిండి వంటలను చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ఫలానా పండగ నాడు ఫలానా పదార్థంతో చేసిన పిండివంటలు తినాలనే నియమాన్ని ఏర్పరచారు పెద్దలు. పండగ పిండివంటల్లోనూ, పాయసాల్లో వాడే కొన్ని పదార్థాలూ, వాటిలో ఉండే ఆరోగ్య విలువల గురించి తెలుసుకుందాం. హాయిగా తిందాం. ఆరోగ్యంగా ఉందాం.
సంక్రాంతి నాడు తీపి గుమ్మడి కూర లేదా గుమ్మడి కాయ ముక్కలతో పులుసు చేసుకుని తినడం ఆచారం. అందుకు కారణం గుమ్మడిలో ఉండే ఔషధ గుణాలే. బాగా మగ్గిన గుమ్మడిపండును ఆహారంగా తీసుకుంటే చక్కెర వ్యాధిగ్రస్తులకు, భారీకాయంతో బాధపడేవారికి మేలు జరుగుతుంది. ప్రొస్టేట్ గ్రంథి వాచినపుడు గుమ్మడికాయ నుంచి తాజాగా జ్యూస్ తీసి, రెండు లేదా మూడు చెంచాలు తాగటం మంచిది. గుమ్మడి గింజల్లో పీచు, ప్రోటీన్లు, ఇనుము, విటమిన్–ఇ, మాంగనీస్, ఫాస్పరస్ వంటి పోషకాలున్నాయి. , కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గుమ్మడి గింజలు భేష్‌గా పనిచేస్తాయి. రక్తపోటును నియంత్రించి.. బరువును తగ్గిస్తుంది.
గుండెను పదిలంగా వుంచేందుకు గుమ్మడి గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. గుమ్మడిలో వ్యాధినిరోధక శక్తిని పెంచే పోషకాలున్నాయి. జలుబు, జ్వరం, అలసట, మానసిక ఒత్తిడి, మొటిమలు, సంతానలేమి వంటి సమస్యలను గుమ్మడి నయం చేస్తుంది. ఇందులో ఒమేగా–3 ఆమ్లాలున్నాయి. మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించి.. రోజు తీసుకుంటే నెలసరి సమస్యలు, నొప్పులు మటుమాయం అవుతాయి.
బెల్లం
ఏ పండగకైనా బెల్లం లేనిదే తీపి ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి స్పెషల్ అయిన అరిశలు, పొంగలి వంటివి చేసేది బెల్లంతోనే. బెల్లంలో సహజమైన తియ్యదనం ఉంటుంది. దీనివల్ల శరీరానికి హాని ఉండదు. ప్రాణాంతక మైన వ్యాధుల బారి నుంచి కాపాడే విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. బెల్లం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో బెల్లంతో చేసిన పిండివంటలు తినటం వల్ల శరీరం వెచ్చగా ఉండి ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబును నివారిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. విష పదార్ధాలను బయటకు పంపుతుంది...రోజు ఒక ముక్క బెల్లం తింటే వ్యర్ధాలను బయటకు పంపి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పెసరపప్పు
అనాదిగా పెసరపప్పు మన ప్రధాన ఆహారాల్లో ఒకటి. సంక్రాంతికి చేసే కట్టె పొంగలిలోనూ, పులగంలోనూ పెసరపప్పు విధిగా వాడతారు. దీనిలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థకి ఎంతో మేలు. జీర్ణశక్తి మెరుగుదలకూ, మలబద్దకం నివారణకూ తోడ్పడుతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్తపోటు నియంత్రణకూ ఉపయోగపడుతుంది. పొటాషియమ్ ఎక్కువ. అందుకే హైబీపీ నివారణకు తోడ్పడుతుంది. పొట్టుతో పాటు వాడితే చికెన్ కంటే పెసరపప్పు నుంచి లభ్యమయ్యే ప్రోటీన్ చాలా మంచిది. చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాల వల్ల చర్మం నిగారింపుతో పాటు, ఏజింగ్ ప్రక్రియకు పెసరపప్పు అడ్డుకట్టగా నిలుస్తుంది. గుండెకు మేలు చేయడంతో పాటు రక్తప్రసరణ సాఫీగా జరడానికి తోడ్పడుతుంది. జింక్ వల్ల మంచి రోగనిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఎన్నో క్యాన్సర్ల నివారణ జరుగుతుంది. విటమిన్–ఏ వల్ల కంటి ఆరోగ్యానికి మేలు. రేచీకటిని అరికడుతుంది. ఎముకల పెరుగుదలకు, వాటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
పాలు
పండగ అంటే పాయసం తప్పదు. పాయసం అంటే పాలు ప్రధానం. అది మాత్రమే కాదు ఎన్నో వంటకాల్లో ప్రధాన ముడిసరుకు. పాలల్లో ఉండే క్యాల్షియమ్ ఎముకల ఆరోగ్యకరమైన పెరుగుదలకు దోహద పడుతుంది. అందుకే చిన్ననాటి నుంచి పిల్లలకు పాలు అలవాటు చేయడం మన సంస్కృతిలో ఓ ఆనవాయితీ. పాలల్లో ప్రోటీన్ ఎక్కువ. ∙పాలల్లో ఉండే కొవ్వులు బరువు పెరగకుండానే మంచి ఆరోగ్యాన్నిస్తాయి. పాలల్లోని విటమిన్–డి ఎముకల ఆరోగ్యానికీ, వ్యాధినిరోధకతకు తోడ్పడుతుంది. విటమిన్–బి కాంప్లెక్స్, జింక్ వంటి పోషకాల వల్ల మంచి వ్యాధినిరోధకశక్తి చేకూరుతుంది. పొటాషియమ్ వంటి లవణాల వల్ల పెద్దల్లో రక్తపోటు నివారితమవుతుంది. ∙కొవ్వు పెద్దగా లేని పాలతో గుండెకు మంచి ఆరోగ్యం. మేని మెరుపుకూ, జుట్టు పెరుగుదలకు పాలు తోడ్పడతాయి. ఎన్నో రకాల వ్యాధులకు మంచి నివారణ మార్గం క్రమం తప్పకుండా పాలు తాగడమే.
యాలకులు
స్వీటు ఏదైనా... దాని తయారీ పూర్తయ్యే సమయానికి వాడాల్సిన దినుసుల్లో (ఇన్‌గ్రేడియెంట్స్) ముఖ్యమైనవి యాలకులు. యాలకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... జీర్ణరసాల స్రావాలను ప్రేరేపించడం ద్వారా మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. జీర్ణక్రియ ప్రక్రియలో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలన అవి సమర్థంగా అరికడతాయి. ఉదాహరణకు... యాసిడ్ గొంతులోకి రావడం (యాసిడ్ రిఫ్లక్స్), ఛాతీలో మంట వంటివి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ మోతాదు తగ్గించడం ద్వారా గుండెకు మేలు చేస్తాయి. అంతేకాదు అవి క్యాన్సర్‌ను నివారిస్తాయి కూడా. ∙రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. డిప్రెషన్ వంటి మానసిక సమస్యల పరిష్కారంలోనూ యాలకులు బాగా తోడ్పడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. రక్తంలోని గడ్డలను (క్లాట్స్‌ను) నివారిస్తూ... రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చూసి పక్షవాతం, గుండెపోటు నివారణకు తోడ్పడతాయి.
బాదం (ఆల్‌మండ్) స్వీట్లమీద అలంకరణకు వాడే బాదం పలుకుల ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజూ గుప్పెడు బాదం పలుకులు తినేవారిలో రోగనిరోధక శక్తి పెరిగి, ఎన్నో రకాల వ్యాధుల నివారణ జరుగుతుంది. రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి. అన్ని రకాల నట్స్... ముఖ్యంగా జీడిపప్పుతో పోల్చినప్పుడు బాదంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. బాదంలోని ఎల్–కార్నిటిన్ పోషకం మెదడు పనితీరును చురుగ్గా చేస్తుంది. పీచు (ఫైబర్) పుష్కలంగా ఉన్నందున జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికీ, మలబద్ధక నివారణకు ఉపయోగపడుతుంది. గుండె జబ్బులకు దోహదపడే ‘సీ–రియాక్టివ్ ప్రోటీన్’ అనే పదార్థాన్ని బాదం తగ్గిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఇందులోని శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్స్ ఎన్నో క్యాన్సర్లను నివారిస్తాయి. క్యాల్షియమ్, ఐరన్, పొటాషియమ్, మెగ్నీషియమ్, జింక్ వంటి చాలా ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి.
మినుములు
సంక్రాంతి పండగ మర్నాడు కనుమ. ఈ రోజున మాంసాహారం తినేవారు మాంసం తింటే, శాకాహారులు మినుములతో చేసిన వంటకాలను తింటారు. ముఖ్యంగా మినప గారెలు. పండక్కి ఇంటికి వచ్చిన అల్లుళ్లకు మినప సున్ని ఉండలు చేసి పెడతారు. మినుములో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు, డయటరీ ఫైబర్, ప్రొటీన్లు, బికాంప్లెక్స్, సి, ఈ, కె విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ కూడా మినుముల్లో ఉంటాయి. కొవ్వుపదార్థాలు అతి తక్కువగా ఉంటాయి. చక్కెరలు అసలు ఉండవు. మినుముతో చేసిన పదార్థాలు తినేవారికి రక్తహీనత దరిచేరదు. అందువల్ల ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేనివారు పండగ నాడు మినప గారెలు హాయిగా లాగించడం ఉత్తమం.
కుంకుమపువ్వు
ఎప్పట్నుంచో మనం సుగంధ ద్రవ్యంగా వాడుతూ వస్తున్న దినుసు ఇది. యాలకుల్లాగే ఇటు బిర్యానీ వంటి వంటకాలతో పాటు అటు స్వీట్లలోనూ ఉపయోగించే కుంకుమ పువ్వులో మంచి యాంటీసెప్టిక్ గుణాలతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో బీ–కాంప్లెక్స్‌లోని థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి విలువైన పోషకాలు ఉన్నాయి. వ్యాధి నిరోధకతకు ఇవి తోడ్పడతాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రిస్తుంది. త్వరత్వరగా మూడ్స్ మారిపోవడాన్ని (మూడ్ స్వింగ్స్) అరికడుతుంది. కడుపులోని బిడ్డ రంగును కుంకుమపువ్వు ఆకర్షణీయంగా మార్చుతుందని పెద్దలంటారు. గర్భవతుల్లో చాలామంది వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి అంత సుముఖంగా ఉండరు. కుంకుమపువ్వు సుగంధ ద్రవ్యం కావడంతో అది పాలకు మంచి రుచినీ, సుగంధాన్ని ఇచ్చి, వారు హాయిగా పాలు తాగేలా చేస్తుంది. పరిమితంగా తీసుకున్నప్పుడే ఇది గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పరిమిత మోతాదులో తీసుకునే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేసి, ఆకలిని పెంచుతుంది. కేవలం గర్భవతుల్లోనే కాదు... మిగతావారికీ ఇవే ఆరోగ్యప్రయోజనాలను ఇస్తుంది.
జీడిపప్పు
జీడిపప్పు లేనిదే పాయసం తదితర తీపి వంటకాలు రుచించవు. ఇటు స్వీట్లలో, అటు హాట్స్‌లో డబుల్ యాక్షన్ చేసే ప్రధాన ‘నట్’ ఇది. దీనిలో ఉండే జింక్ వంటి పోషకాలు వ్యాధి నిరోధకతకు తోడ్పడతాయి. పీచు (ఫైబర్) పుష్కలంగా ఉండటం వల్ల మంచి జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. పొటాషియమ్, మెగ్నీషియం, ఎల్–ఆర్జినైన్ వంటి ఖనిజ లవణాలు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాల్షియమ్, కాపర్ కారణంగా ఎముకలు బలోపేతమవుతాయి. మెదడునూ చురుగ్గా చేస్తాయి. అందుకే పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మంచిది. కాపర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తసంబంధిత జబ్బుల నివారణకు తోడ్పడుతుంది.
జాజికాయ
సాధారణంగా స్వీట్లలోనూ, బిరియానీలోనూ ఓ సుగంధద్రవ్యంలా వాడే జాజికాయ మంచి జీర్ణక్రియకూ ఉపయోగపడటంతో పాటు ఇంకా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. అందుకే గోరువెచ్చని పాలలో జాజికాయ తురుము కొద్దిగా వేసుకుని తాగితే మంచి నిద్రపడుతుంది. మంచి నొప్పినివారణి. మెదడు చురుకుదనానికి, నాడీ వ్యవస్థ మెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. మేని నిగారింపుకు బాగా ఉపయోగపడుతుంది. తనలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల నోటి దుర్వాసనను అరికడుతుంది. అందుకే దీన్ని ‘తాంబూలం’ (పాన్)లో ఓ దినుసుగా వాడుతుంటారు. ఈ గుణాల కారణంగానే పంటి ఆరోగ్యానికీ ఇదెంతో మేలుచేస్తుంది. ∙కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. యాంటీ డిప్రెస్సెంట్ గుణాల వల్ల డిప్రెషన్ పాటు మూడ్‌స్వింగ్స్, యాంగై్జటీని నివారిస్తుంది.
పచ్చకర్పూరం..
పచ్చకర్పూరాన్ని కూడా ఓ సుగంధ ద్రవ్యంగా చాలావంటల్లో ముఖ్యంగా స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఔషధగుణాలూ ఎక్కువే. ∙గ్యాస్ నివారణకు, నీళ్లవిరేచనాలను సమర్థంగా అరికట్టడానికీ పచ్చకర్పూరం బాగా ఉపయోగ పడుతుంది. ∙కండరాలు పట్టివేయడాన్ని నివారించడమే కాదు... తిమ్మిర్ల వంటివి రాకుండా చూస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ వంటి వాటికి విరుగుడు కాబట్టి... ప్రస్తుత పాండమిక్ సీజన్‌లో ఇది చాలా రకాల జలుబులను నివారిస్తుంది. ∙ఎముకలకు బలాన్ని చేకూర్చడంతో పాటు ఆస్టియో ఆర్థరైటిస్‌ను సమర్థంగా అరికడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment