కేశవర్ణన, చిత్రణ లేని ప్రాచీన సాహితీ కళారూపాలు లేవంటే అతిశయోక్తి కాదు! ఆధునిక యుగం మొదలయ్యే సరికి – ఎన్నో శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక వర్తక వాణిజ్య అంశాలతో విడదీయలేనంతగా చిక్కుముడి పడిపోయిన జుట్టుకథను సరదాగా చెప్పుకుందాం...
కేశసంరక్షణ ఆధునిక కాలంలో ఒక ప్రత్యేక శాస్త్రంగా ‘ట్రైకాలజీ’ పేరుతో అభివృద్ధి చెందింది. ఎంతగానో విస్తృతి చెందిన ఆధునిక వైద్యరంగంలో ఇది పారామెడికల్ సైన్స్‌గా గుర్తింపు పొందింది. ఇక సాదాసీదా క్షురకులు సహా కేశాలంకార నిపుణుల సంగతి సరేసరి! చరిత్ర పరిణామంలో ఇదొక పార్శ్వమైతే, మరోవైపు కత్తిరించి పారేసిన జుట్టు గుట్టలు కొందరికి కోట్లాదిగా విలువచేసే నోట్ల కట్టలు సంపాదించి పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం జుట్టునే ఆలంబనగా చేసుకుని ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది.
కేశఖండన, కేశసంరక్షణల వ్యాపారం కళ్లు చెదిరేస్థాయిలో సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 2020 సంవత్సరంలో 7506 కోట్ల డాలర్ల (రూ.5.48 లక్షల కోట్లు) మేరకు సాగింది. ఇది 2019 నాటితో పోల్చుకుంటే, 4.63 శాతం తక్కువ. ‘కరోనా’ ప్రభావం కారణంగా లాక్‌డౌన్‌లో సెలూన్‌లు, బ్యూటీపార్లర్లు, కాస్మొటిక్ క్లినిక్‌లు మూతబడటంతో ఈ వ్యాపారం కాస్త తగ్గినా, 2021–28 మధ్య కాలంలో 5.76 శాతం మేరకు సగటు వార్షిక వృద్ధి సాధించగలదని, 2028 నాటికి 11297 కోట్ల డాలర్ల (రూ.8.26 లక్షల కోట్లు) మేరకు చేరుకోగలదని ‘ఫార్చ్యూన్’ పత్రిక ఇటీవల ఒక అంచనాను ప్రకటించింది. జనాభాలో రెండో పెద్దదేశమైన మన భారత్‌లో కేశసంరక్షణ వ్యాపారం 2020 సంవత్సరంలో రూ.25 వేల కోట్లకు పైమాటే! ఇవన్నీ సంఘటిత రంగంలో జరిగిన వ్యాపారానికి సంబంధించిన లెక్కలు. ఇక అసంఘటిత రంగంలో జరిగే వ్యాపారం, విదేశాలకు జుట్టు అక్రమ రవాణా లావాదేవీలకు సంబంధించిన అధికారిక అంచనాలేవీ లేవు.
కేశ విశేషాలను చెప్పుకోవాలంటే కొండవీటి చాంతాడు కంటే పొడవాటి జాబితానే తయారవుతుంది గాని, ఎక్కువ మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన వేశ విశేషాలను మచ్చుకు చెప్పుకుందాం...
►తలతో సహా మనుషుల శరీరంపై సగటున లక్ష నుంచి లక్షన్నర వరకు వెంట్రుకలు ఉంటాయి.
►వీటిలో రోజూ దాదాపు 50–150 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే మాత్రం ఏదో సమస్య ఉన్నట్లే!
►వెంట్రుకలు ప్రధానంగా ‘కెరాటిన్’ అనే ప్రొటీన్ ద్వారా తయారవుతాయి. జంతువుల కొమ్ముల్లో ఉండే ప్రధాన పదార్థం కూడా ఇదే.
►ఒక వెంట్రుక ఆయుర్దాయం దాదాపు ఐదేళ్ల వరకు ఉంటుంది.
►ఒక వెంట్రుక అదే మందంలో ఉండే రాగితీగ కంటే దృఢంగా ఉంటుంది.
►భయపడినప్పుడు లేదా చలిగా ఉన్నప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి– అదే గూస్‌బంప్స్ ఏర్పడతాయి. ఆ సమయంలో వెంట్రుకల కుదుళ్లలోని కండరాలు సంకోచించడం వల్ల అలా జరుగుతుంది.
►విగ్గులు ఆధునిక ఫ్యాషన్ సాధనాలేమీ కాదు. ప్రాచీనకాలం నుంచే ఉండేవి. పేల బెడద పడలేక ప్రాచీన ఈజిప్షియన్లు చాలామంది గుండు గొరిగించుకునేవారు. గుండు కనిపించకుండా ఉండటానికి విగ్గులు వాడేవారు. బహుశ చరిత్రలో తొలి ‘విగ్గరులు’ ఈజిప్షియన్లే కాబోలు!
►ఫ్రెంచి పాలకుడు పద్నాలుగో లూయీ కాలంలో విగ్గులకు కిరీటాల స్థాయి గౌరవం ఉండేది. అప్పట్లో యూరోప్ దేశాల్లో విగ్గుధారణ ఒక స్టేటస్ సింబల్. ఎంత పెద్ద విగ్గు ధరిస్తే అంత గొప్ప అన్నమాట! అందుకే ప్రముఖులను ప్రస్తావించడానికి ‘బిగ్‌విగ్స్’ అనే పదబంధం ఏర్పడింది.
►కొన్ని వృత్తుల్లోని ఉన్నత పదవుల్లో ఉండేవారంతా తప్పనిసరిగా విగ్గులు ధరించేలా చట్టం తేవాలంటూ విగ్గుతయారీదారులు బ్రిటిష్ పాలకుడు మూడో జార్జ్‌కి 1765లో విజ్ఞప్తి చేశారు. రాజావారు సదరు విజ్ఞప్తిని తోసిపుచ్చారు. అయితే, బ్రిటన్‌లో న్యాయమూర్తులందరూ ఇప్పటికీ తప్పనిసరిగా విగ్గులు ధరించే విధులకు హాజరవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
జుట్టునూ వదలని స్మగ్లర్లు
విలువైన బంగారం, వజ్రాలు వంటివి స్మగ్లింగ్ చేయడం మామూలే. గంజాయి సహా రకరకాల మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం కూడా మామూలే. కత్తిరించాక తుడిచి పారేసే జుట్టును కూడా స్మగ్లింగ్ చేసేవారున్నారు. మన దేశం నుంచి గుట్టలు గుట్టలుగా జుట్టును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించే తతంగం కొన్నేళ్ల నుంచి నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో చైనాకు అక్రమంగా తరలించడానికి సిద్ధంగా గోదాముల్లో దాచిన జుట్టు గుట్టలను కొద్ది వారాల కిందటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్రమంగా తరలించడం కోసం గోదాముల్లో దాచిపెట్టిన జుట్టును, అక్రమంగా తరలిస్తున్న జుట్టును అధికారులు పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు.
గడచిన కొద్ది సంవత్సరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులే కాదు, అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్ తదితర పారామిలటరీ బలగాలు కూడా సరిహద్దులను దాటబోతున్న జుట్టును భారీ పరిమాణంలో స్వాధీనం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. జుట్టు అక్రమ రవాణాను అరికట్టడానికి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు రెండేళ్ల కిందట ఆదేశాలు జారీ చేసినా, జుట్టు స్మగ్లింగ్ యథావిధిగా జరుగుతూనే ఉంది. ఫలితంగా జుట్టు ఎగుమతుల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది.
జుట్టును అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వానికి వాటిల్లుతున్న నష్టం ఒక ఎత్తయితే, అనుమతులు తీసుకుని సాగిస్తున్న జుట్టు ఎగుమతుల్లో జరుగుతున్న మోసాలు మరో ఎత్తు. జుట్టును ఎగుమతి చేసే వ్యాపారులు తాము ఎగుమతి చేసే సరుకు విలువ తగ్గించి చూపుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన దాని కంటే తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఎగుమతి చేసే జుట్టును నాణ్యతను బట్టి విడదీసి, కిలో ఒక యూనిట్ చొప్పున చిన్న చిన్న గుట్టలుగా చుడతారు. వీటిని ‘గోలి’, ‘ఛుట్టి’, ‘థుట్టి’ అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు.
మన దేశంలో కిలో జుట్టు విలువ రూ.4,500 నుంచి రూ.6,000 వరకు ఉంటోంది. ఎగుమతిదారులు కిలో విలువ గరిష్ఠంగా రూ.1,400 వరకు మాత్రమే చూపుతూ పన్నులు ఎగవేస్తున్నారు. మన దేశం నుంచి దొంగచాటుగా రవాణా అయ్యే జుట్టులో ఎక్కువ భాగం మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్‌ల మీదుగా భూమార్గంలో చైనాకు చేరుకుంటోంది. మన దేశం నుంచి ఏటా విదేశాలకు చేరుతున్న జుట్టు విలువ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఉంటోంది. ఇందులో 5 శాతం జుట్టు తిరుపతి సహా వివిధ పుణ్యక్షేత్రాల్లో భక్తులు సమర్పించుకునే నీలాల నుంచే చేరుతోంది.
మన దేశంలో జరిగే జుట్టు ఎగుమతుల వ్యాపారంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 8 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని ‘హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు సునీల్ ఇమామి మీడియాకు తెలిపారు. జుట్టు స్మగ్లింగ్ కారణంగా హెయిర్ ప్రాసెసింగ్ పరిశ్రమపై ఆధారపడి బతికే 4.1 లక్షల మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితులు వాటిల్లాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ స్మగ్లింగ్ వల్ల అటు ప్రభుత్వానికే కాదు, ఇటు అనుమతులు పొంది వ్యాపారాలు సాగిస్తున్న ఎగుమతిదారులకు కూడా భారీ నష్టం వాటిల్లుతోందని ఇమామి చెప్పారు. ఇదిలా ఉంటే, దేశం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న జుట్టు విలువ దాదాపు రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని, దీనివల్ల జీఎస్టీ ఆదాయానికి గండిపడుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
జుట్టుతో ఏం చేస్తారంటే....
ఆ మాత్రం మాకు తెలీదేంటి? విగ్గులు తయారు చేస్తారు అనుకుంటున్నారా? ఔను! రకరకాల మార్గాల్లో సేకరించిన జుట్టుతో సవరాలు, విగ్గులు, కృత్రిమ గడ్డాలు, కనుబొమ్మలు వంటివి కూడా తయారు చేస్తారు. అలాగని, జుట్టు ప్రయోజనాలు ఈ మాత్రానికే పరిమితం కాదు. జుట్టును చాపల్లా నేసి, వాటిని మొక్కల రక్షణ కోసం ఉపయోగిస్తారు. ఈ చాపలు టెర్రస్ గార్డెన్లు పెంచేవారికి బాగా ఉపయోగపడతాయి. సముద్రంలో చిందిన చమురు తెట్టును శుభ్రం చేయడానికి జుట్టుతో తయారు చేసిన ‘హెయిర్ బూమ్స్’ను ఉపయోగిస్తున్నారు.
చమురు తెట్టును శుభ్రం చేయడానికి జుట్టుతో తయారు చేసిన మరింత మెరుగైన నమూనా పరికరాల తయారీపై ‘నాసా’ శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపుతున్నారు. నేటివ్ అమెరికన్లు జుట్టుతో పొడవాటి తాళ్లను పేని, వాటితో రకరకాల వస్తువులు తయారు చేస్తారు. ఇటీవలికాలంలో కొన్నిచోట్ల దుస్తుల తయారీలోను, కళాకృతుల తయారీలోను, ఫర్నిచర్ తయారీలోనూ జుట్టును ఉపయోగిస్తున్నారు. ఇక జుట్టు నుంచి వేరుచేసిన ప్రొటీన్‌ను సోయాసాస్, పలు బేకరీ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు.
రీసైకిల్ చేసిన జుట్టును ఎరువుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. జుట్టులో 16 శాతం మేరకు నత్రజని ఉంటుంది. పశువుల వ్యర్థాలతో తయారయ్యే సేంద్రియ ఎరువులో ఉండే నత్రజని 0.2–0.3 శాతం మాత్రమే. జుట్టుతో తయారైన ఎరువు పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు. కొద్దినెలల్లోనే ఇది మట్టిలో పూర్తిగా కలిసిపోయి, మొక్కలకు కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.
జుట్టుతో మరో వ్యవసాయ ప్రయోజనం కూడా ఉంది. జుట్టుతో అల్లిన చాపలతో కంచెలను ఏర్పాటు చేసుకుంటే, వాటిని దాటుకుని కుందేళ్లు, ఉడుతలు, ఎలుకలు వంటి జంతువులు పొలాల్లోకి, తోటల్లోకి చొరబడి పంటలను నాశనం చేయలేవు. అంతేకాదు, జుట్టుతో తయారైన చాపలు పంటలను నాశనం చేసే కొన్ని రకాల పురుగులను కూడా సమర్థంగా నిరోధించగలవు. పంటపొలాలకు, తోటలకు రక్షణగా జుట్టుతో తయారైన చాపలతో కంచెలను ఏర్పాటు చేసుకునే పద్ధతి కొన్ని అగ్రదేశాల్లో పరిమితంగానే వాడుకలో ఉంది. ఇదే పద్ధతి వ్యాప్తి చెందితే రైతులకు పురుగుమందుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో కొందరు రైతులు తమ పంటచేలకు జుట్టుతో తయారైన చాపలను కంచెలుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల వారికి పురుగుమందుల కోసం అయ్యే ఖర్చుతో ఏటా 50 వేల డాలర్లు (రూ.36.67 లక్షలు) ఆదా కావడమే కాకుండా, దాదాపు పదిలక్షలకు పైగా మొక్కలు నాశనం కాకుండా బతికి ఎదిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు.
జుట్టు నుంచి వేరుచేసిన ప్రొటీన్లను ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. జుట్టు నుంచి వేరు చేసిన ఎల్–సిస్టీన్, ఎన్–ఎసిటైల్ ఎల్–సిస్టీన్ (ఎన్‌ఏసీ) ప్రొటీన్లతో ఔషధాలను తయారు చేస్తున్నారు. వైద్యరంగంలో జుట్టు వినియోగం కొత్తదేమీ కాదు. ప్రాచీనకాలంలోనే భారత్, చైనాలలో వైద్యులు జుట్టును కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను గాయాలకు పైపూతగా ఉపయోగించేవారు. మధ్యయుగంలో పలు యూరోప్ దేశాల్లో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కుట్లు వేయడానికి మనుషుల వెంట్రుకలతో తయారు చేసిన దారాలను ఉపయోగించేవారు. మనుషుల జుట్టుకు గల దారుఢ్యం అమోఘమైనది. జుట్టుతో తయారైన దారాలను శస్త్రచికిత్సల్లో కుట్లు వేయడానికి ఇప్పుడు కూడా భేషుగ్గా ఉపయోగించవచ్చని ఆధునిక పరిశోధకులు కూడా చెబుతున్నారు. షాంపూలు, కండిషనర్లు వంటి కేశసంరక్షణ ఉత్పత్తులను తయారు చేసేవారు తమ ఉత్పత్తుల పనితీరును పరీక్షించడానికి జుట్టుతో తయారైన ‘టెస్ట్ స్వాచెస్’ను ఉపయోగిస్తుంటారు.
తల‘కట్టు కథలు’
నాగరికత మొదలైనప్పటి నుంచే మనుషులకు జుట్టు మీద మోజు మొదలైంది. ముఖ్యంగా తలకట్టును తీర్చిదిద్దుకోవడాన్ని నాగరికతకే తలమానికంగా భావించడం మొదలైంది. తలకట్టును చూసి మనుషుల స్వభావాలను అంచనా వేసే లక్షణం మనుషుల్లో ఇప్పటికీ ఉంది. బహుశ ఈ లక్షణం ఆదిమ అవశేషమేమో! తలపై జుట్టును ఏపుగా పెంచుకోవడమే కాకుండా, ఆ జుట్టును కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు జుట్టును కాపాడుకోవడానికి ఆముదం, బాదంనూనె రాసుకునేవారు. ఎడారి ప్రాంతపు పొడి వాతావరణంలో వారి జుట్టుకు ఇవి రక్షణ కల్పించేవి. క్రీస్తుపూర్వం 1500 నాటి అస్సీరియన్ రాజులు రింగురింగులుగా మెలితిరిగే ఉంగరాల జుట్టు కోసం పడరాని పాట్లు పడేవారు. వాళ్లలో సహజంగానే ఉంగరాల జుట్టు ఉంటే సరేసరి.
వాళ్లు అదృష్టవంతుల కిందే లెక్క! ఎలాంటి మెలికల్లేని నిలువైన జుట్టు ఉంటే మాత్రం దానిని రింగురింగులుగా మెలితిప్పడానికి వేడిచేసిన ఇనుప చువ్వలను ఉపయోగించేవారు. క్రీస్తుశకం 13వ శతాబ్ది కాలంలో ఇటలీ ప్రాంతంలో బల్లికొవ్వును ఆలివ్‌నూనెలో కలిపి మరిగించి, చల్లార్చి దానిని తలకు పట్టించుకునేవారు. జుట్టు ఏమాత్రం చెదిరిపోకుండా కట్టుదిట్టమైన తలకట్టును తీర్చిదిద్దుకోవడానికి క్రీస్తుశకం 16వ శతాబ్దికి చెందిన బ్రిటిష్ మహిళలు తలకు మైనాన్ని పట్టించేవారు. ఇంచుమించు అదేకాలంలో ఫ్రాన్స్‌లో మరో ట్రెండ్ ఉండేది. అక్కడి జనాలు జుట్టు పోషణ కోసం ఎముకల మూలుగను ఉపయోగించేవారు. మేక, గొర్రె, గొడ్డు ఎముకల మూలుగను హేజెల్‌నట్ ఆయిల్‌లో బాగా గిలకొట్టి కలిపి, దానికి కాసింత నిమ్మరసం చేర్చి తలకు పూసుకునేవారు. ఇప్పుడు విరివిగా వాడుకలో ఉన్న లిక్విడ్ షాంపూ అందుబాటులోకి వచ్చి వందేళ్లు కూడా పూర్తి కాలేదుగాని, ప్రాచీనకాలంలో భారత ఉపఖండంలో జనాలు కుంకుడుకాయలతో, షీకాయతో జుట్టును శుభ్రం చేసుకునేవారు.
జర్మన్ రసాయనవేత్త, వ్యాపారవేత్త హాన్స్ స్క్వార్జ్‌కోఫ్ తొలిసారిగా 1927లో ‘స్క్వార్జ్‌కోఫ్’ బ్రాండ్ పేరుతో లిక్విడ్ షాంపూను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత వివిధ దేశాల్లోని మిగిలిన సంస్థలు కూడా వేర్వేరు ఫార్ములాలతో షాంపూలను తయారు చేయడం మొదలుబెట్టాయి. కేశ సంరక్షణ ఉత్పత్తుల పరిణామం తలనూనెల నుంచి షాంపూల వరకు మాత్రమే పరిమితం కాలేదు. కండిషనర్లు, హెయిర్‌క్రీమ్స్, జెల్స్, బట్టతలపై జుట్టు మొలిపించే లోషన్స్, సీరమ్స్, నెరిసిన జుట్టుకు టెంపరరీ పడుచుదనం తెప్పించేందుకు వాడే రకరకాల హెయిర్‌డైలు వంటి నానా ఉత్పత్తులు ఇటీవలి కాలంలో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తల మీద జుట్టును పొడవుగా పెంచుకోవడం కొన్నాళ్లు ఫ్యాషన్‌గా ఉంటే కురచగా కత్తిరించుకోవడం మరికొన్నాళ్లు ఫ్యాషన్‌గా చలామణీలో ఉంటుంది.
పొడవాటి జుట్టుకు పోనీ కట్టుకోవడం, చుట్టూ కురచగా కత్తిరించి, తల నడిమధ్యలో గోపురంలా జుట్టును తీర్చిదిద్దుకోవడం– ఇలా చెప్పుకుంటూ పోతే తలకట్టులో రకరకాల ఫ్యాషన్లు. ఫ్యాషన్లకు అనుగుణంగా మాసిన తలపై జుట్టును కత్తిరించి చక్కగా తీర్చిదిద్దే పనిలో గ్రామీణ క్షురకుల మొదలుకొని నగరాల్లోని సెలూన్లు, బ్యూటీపార్లర్ల వరకు వివిధ దశల్లో ఉపయోగించే దువ్వెనలు, కత్తులు, కత్తెర్లు, రేజర్లు, ట్రిమ్మర్లు, షేవింగ్ బ్రష్‌లు, షేవింగ్ క్రీములు, ఆఫ్టర్‌షేవ్ లోషన్లు వంటి ఉత్పత్తులు, అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఉపయోగించే హెయిర్ రిమూవర్లు వంటి ఉత్పత్తుల మార్కెట్ కూడా తక్కువేమీ కాదు.
విగ్గు విలాసం
ఖండిత మానవ కేశాలలో ఎక్కువ భాగం చేరేది విగ్గుల పరిశ్రమకే. విగ్గులను తయారు చేసే కంపెనీలు విగ్గులతో పాటు కృత్రిమ కనుబొమ్మలు, మీసాలు, గడ్డాలు వంటివి కూడా తయారు చేస్తాయి. స్థూలంగా ఈ పరిశ్రమను హెయిర్ విగ్స్ అండ్ ఎక్స్‌టెన్షన్స్ ఇండస్ట్రీగా పిలుస్తారు. ఇదివరకటి కాలంలో ఈ పరిశ్రమకు ఎక్కువగా వినోదరంగం నుంచే ఎక్కువగా గిరాకీ ఉండేది. సినీ పరిశ్రమ, నాటకాలు, సంప్రదాయ వేడుకల్లో వేషాలు వేసేవారు, విచిత్ర వేషధారణ వంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు వంటి వారు మాత్రమే విగ్గులను కొనుగోలు చేసేవారు. జుట్టు ఊడిపోయి బట్టతల ఏర్పడినా సామాన్య ప్రజలు విగ్గుల జోలికి వెళ్లడం చాలా అరుదుగా ఉండేది.
గడచిన రెండు దశాబ్దాలుగా సామాన్య ప్రజానీకం నుంచి కూడా విగ్గులకు గిరాకీ పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జరిగిన విగ్గుల అమ్మకాల విలువ 700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.52 వేల కోట్లు) పైమాటే! రానున్న ఐదేళ్లలో ఈ మార్కెట్ 13 శాతం వార్షికవృద్ధి సాధించగలదని ‘బిజినెస్‌వైర్’అంచనా వేస్తోంది. వివిధ దేశాల్లోని విగ్గుల తయారీ కంపెనీలకు భారీ పరిమాణంలో జుట్టును సరఫరా చేసేవి ఆసియన్ దేశాలైతే, విగ్గులను ఎక్కువగా వినియోగించేది వివిధ దేశాల్లో స్థిరపడిన నల్లజాతీయులేనని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి.
అత్యధికంగా జుట్టును ఎగుమతి చేసే దేశాల్లో చైనా, భారత్, మయాన్మార్ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. జుట్టును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో యూరోప్ దేశాలు, అమెరికా అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. భారీ ఎత్తున సాగే స్మగ్లింగ్‌ను సమర్థంగా అడ్డుకోగలిగితే, జుట్టు ఎగుమతుల్లో నిజానికి భారత్‌దే మొదటి స్థానమని దేశంలోని జుట్టు ఎగుమతిదారుల సంఘాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ విగ్గులకు గిరాకీ పెరుగుతోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ప్రక్రియలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో బట్టతలలవారు విగ్గులపై మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే, క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల ప్రభావం వల్ల జుట్టు కోల్పోయిన వారు కూడా ఆత్మస్థైర్యం కోసం విగ్గులను వాడుతున్నారు.
క్యాన్సర్ రోగులకు విగ్గుల కోసం జుట్టును దానం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మన దేశంలో విగ్గుల తయారీ పరిశ్రమ వార్షిక వ్యాపారం విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ‘కరోనా’ ప్రభావంతో నాణ్యమైన జుట్టు ధర భారీగా పెరిగింది. ‘కరోనా’కు ముందు 19–26 అంగుళాల పొడవు ఉండే జుట్టు ధర కిలో 16 వేల వరకు ఉంటే, ప్రస్తుతం ఈ ధర రూ. 25 వేల వరకు పెరిగిందని చెన్నైకి చెందిన జుట్టు ఎగుమతి సంస్థ ‘శ్రీ సాయిరాం హెయిర్ ఇండస్ట్రీస్’ ప్రతినిధి ఒకరు చెప్పారు. తిరుమలలో భక్తులు సమర్పించుకునే నీలాలను టీటీడీ నిర్వహించే వేలంపాటలో చెన్నైలోని ఎగుమతిదారులు కొనుగోలు చేస్తుంటారు. తర్వాత నాణ్యత వారీగా గ్రేడింగ్ చేసి, శుభ్రం చేశాక విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
అక్కడ జుట్టు కత్తిరించి డబ్బులిస్తారంట!!
ఎక్కడైనా జుట్టు కత్తించినందుకు క్షురకులకు డబ్బులు చెల్లిస్తారు. బ్రిటన్‌లోని కొన్ని సెలూన్లలో మాత్రం జుట్టు కత్తిరించుకునే కస్టమర్లకే ఎదురు డబ్బులిస్తారు. బ్రిటన్‌లోని ‘సెలూన్‌పే’ వంటి కొన్ని సంస్థలు కస్టమర్లకు ఎదురు డబ్బులు చెల్లిస్తూనే తమ వ్యాపారాన్ని మూడు జుట్టుగుట్టలు ఆరు నోట్లకట్టలుగా సాగిస్తున్నాయి. పొడవాటి జుట్టుతో సెలూన్‌లోకి అడుగుపెట్టి, శుభ్రంగా అంటకత్తెర వేయించుకోవడానికి సిద్ధపడితే, జుట్టు నాణ్యతను బట్టి 75–100 పౌండ్ల (సుమారు రూ.7600– రూ.10,130) వరకు చెల్లిస్తారు. కత్తిరించిన తర్వాత ఈ జుట్టును సెలూన్ నిర్వాహకులే జాగ్రత్తగా గ్రేడింగ్ చేసి, ప్యాక్ చేస్తారు. తర్వాత జుట్టు ప్యాకెట్లను విగ్గుల తయారీ కంపెనీలకు టోకున విక్రయిస్తారు. బ్రిటన్‌లోని ప్రముఖ విగ్గుల కంపెనీలన్నీ ఇలా నేరుగా సెలూన్ల నుంచే జుట్టు గుట్టలను కొనుగోలు చేస్తాయి. సెలూన్ల ద్వారా సాగే జుట్టు విక్రయాలకు లెక్కలన్నీ పక్కాగా నమోదవుతుంటాయి. ఈ లావాదేవీల ద్వారా గత ఏడాది 3.8 కోట్ల పౌండ్ల (రూ.384 కోట్లు) ఆదాయం లభించినట్లు అక్కడి రెవెన్యూ–కస్టమ్స్ విభాగం ప్రకటించింది.
చదవండి: Tips To Grow Hair Naturally: మీకో విషయం తెలుసా? రోజూ ఈ సంఖ్యలో వెంట్రుకలు రాలడం సహజమేనట!
Comments
Please login to add a commentAdd a comment