అదో చిన్న హిల్ స్టేషన్ . పశ్చిమ బెంగాల్, కాలింపోంగ్‌లోని దర్పిన్ దారా పర్వతం మీద పదహారు ఎకరాల ఎస్టేట్. 1930లో ఇద్దరు బ్రిటిష్ ధనవంతులు.. తమ పిల్లలకు వివాహం చేసి.. బంధుత్వం కలుపుకున్నారట. ఆ సందర్భంగానే అక్కడ ఇల్లు కట్టించి దాన్ని.. ఆ నూతన దంపతులకు బహుమతిగా ఇచ్చారట. అయితే ఆ దంపతులకు వారసులు లేకపోవడంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ఆస్తిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
1962లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనారోగ్యం పాలైన తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వ విశ్రాంతి గృహంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే, నెహ్రూ ఆకస్మిక మరణం కారణంగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. 1975లో ‘పశ్చిమ బెంగాల్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ’ ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇదంతా చరిత్ర. ప్రస్తుతం ఈ ఇల్లు.. ఒక హోటల్‌గా.. పర్యాటకులకు వింత అనుభూతుల్ని పంచుతోంది.
ఆ ఇంటి యజమాని పేరు ‘జూట్ బేరన్ జార్జ్ మోర్గాన్’ అని.. అతడు తన భార్య లేడీ మోర్గాన్‌ను ఎంతగానో ప్రేమించేవాడని.. ఆమె మరణం తర్వాత.. ఆమె ఆత్మ అదే ఇంట్లో ఉండిపోయిందని చెబుతుంటారు. మిసెస్ మోర్గాన్ ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ ఇంట్లో బసచేసిన వారికి రాత్రి వేళ.. ఆమె హైహీల్స్ వేసుకుని మెట్లు దిగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుందట. పైగా ఆ పరిసరాల్లో ఏవో గుసగుసలు వణికిస్తాయట.
బయట నుంచి చూడటానికి ఆ ఇల్లు.. పచ్చటి తీగలు అల్లుకుని.. ప్రకృతి అందాల్లో కలగలిసిపోయినట్టు ఉంటుంది. అటుగా వెళ్లిన పర్యాటకులకు హడలెత్తించే కథలను కలబోసి చెబుతుంది. టూరిస్ట్ ప్లేస్‌గా మారినప్పటి నుంచి ఈ భవనం చుట్టూ అనేక చెట్లు, మరిన్ని కట్టడాలు పుట్టుకొచ్చాయి. చిన్నచిన్న కాటేజ్‌లను నిర్మించారు.
బాలీవుడ్ నటులు సైతం ఇక్కడ బసచేశారట. థ్రిల్ కోరుకునేవారు, సాహసికులు.. ఇక్కడి అందాలతో పాటు లేడీ మోర్గాన్ అడుగుల సవ్వడిని వినడానికి ఈ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుంటున్నారట. మరి నిజంగానే అక్కడ అంతుచిక్కని శక్తి ఉందా? ఉన్నపళంగా వినిపిస్తున్న గుబులురేపే ఆ అలికిడి.. లేడీ మోర్గాన్ ఉనికికి నిదర్శనమా? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment