ఉద్యోగానికి జీతం ఉంటుంది. జీవితమే ఉద్యోగం.. గృహిణికి! ఇంటి పనే ఆమె జీతం, భత్యం. సెలవుల్లేని... వేళల్లేని...ప్రశంస లేని.. ప్రమోషన్ లేని..ఆమె పనికి జీతం ఇవ్వవలసి వస్తే?!ఎవరివ్వగలరు? ఎంతివ్వగలరు?పసిడి పర్వతమైనా..ఆమె శ్రమకు తూగుతుందా? ‘‘ఏ వృత్తిలో ఉన్నవారికి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జీతం ఇవ్వొచ్చు?’’ అని 2017 ‘మిస్ వరల్డ్’ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు.. ‘హోమ్‌మేకర్’ (గృహిణి) అని ఇరవై ఏళ్ల మానుషీ చిల్లర్ చెప్పిన సమాధానం ఆ ఏడాది ఇండియాకు అందాల కిరీటాన్ని తెచ్చిపెట్టింది. ‘‘వై?’’ అని మళ్లీ ఒక ప్రశ్న.‘‘ఎందుకంటే నాకు తెలుసు. ఇంట్లో అమ్మ ఎంత కష్టపడుతుందో. అమ్మ పనికి జీతం ఇవ్వాలి అనడాన్ని కేవలంగా జీతంగా చూడటం లేదు నేను. ప్రేమ, గౌరవం చూపించడం అది. నా జీవితానికి అమ్మే స్ఫూర్తి. మా అమ్మే కాదు. ప్రపంచంలోని ప్రతి అమ్మా ఇంటి కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. అందుకే ప్రపంచంలో అందరికన్నా అమ్మకే జీతం ఎక్కువ ఉండాలని అంటాను’’ అని చెప్పారు మానుషీ. అమ్మకు ఇంకో పేరు.. గృహిణి.
‘‘మేం కనుక అధికారంలోకి వస్తే, గృహిణులందరికీ నెలవారీ జీతం ఇస్తాం’’ అని నటుడు కమల్‌హాసన్ సోమవారం చెన్నైలో ప్రకటించారు! తమిళనాడులో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు ఉన్నాయి. ‘మక్కల్ నీది మయం’ (ప్రజాతీర్పు) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కమల్. మొత్తం ఏడు హామీలు ఇస్తున్నారు ఆయన. అందులో ఒకటి గృహిణులకు జీతం. ఎంత జీతం ఇస్తారో ఆయన చెప్పలేదు. ఆయనే కాదు, గృహిణి అందించే సేవలకు దేవుడు కూడా ‘ఇంత’ అని లెక్కకట్టి ఇవ్వలేడు. పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలకు, ఎండీలకు, డైరెక్టర్‌లకు ఇచ్చే జీతానికి లెక్క ఉంటుంది. వాళ్ల బాధ్యతను మించినది గృహిణి బాధ్యత! పైగా గృహిణికి సెలవులు ఉండవు. ప్రశంసలు ఉండవు. ప్రమోషన్‌లు ఉండవు. ఇవన్నీ కాదు.. అసలు డ్యూటీ టైమింగ్సే ఉండవు. ఇరవై నాలుగు గంటల పని! ఇంటి పని, వంట పని, పిల్లల పని, పెద్దల పని. తీరికే ఇవ్వని ఈ పనులన్నీటికీ కలిపి ఎంత జీతం ఇవ్వాలి?!
విదేశాల్లో కొన్ని సంస్థలు తరచు సర్వేలు చేస్తుంటాయి. ‘ఒకవేళ గృహిణికి జీతం ఇవ్వవలసి వస్తే నెలకు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది?’ అని. ఆ సర్వేల ప్రకారం అక్కడి గృహిణులకు నెలకు కనీసం 6 లక్షల రూపాయలు ఇవ్వాలి! ఇక ఉద్యోగం చేసే మహిళకైతే రెండు బాధ్యతల ఒత్తిళ్లను బ్యాలెన్స్ చేసుకుంటూ నెట్టుకొస్తున్నందుకు అదనంగా రెండు మూడు లక్షలైనా చెల్లించాలని సర్వేల నివేదిక. నచ్చకపోతే, చేయలేకపోతే బయటి ఉద్యోగాన్ని మానేయడానికి ఉంటుంది. గృహిణిగా ఇంట్లో ఉద్యోగం మాత్రం తప్పనిది, తప్పించుకోలేనిది. ఎంతటి ఉన్నతస్థాయి ఉద్యోగి అయినా ఇంటికి చేరుకున్నాక గృహిణిగా రెండో షిఫ్ట్‌లోకి ‘మల్టీ టాస్క్’ అవతారం ఎత్తవలసిందే. చివరికి వీధి చివరి దుకాణం నుంచి పాల ప్యాకెట్‌ను తెచ్చుకోవడం కూడా ఆమె డ్యూటీనే.
ఏమైనా గృహిణికి జీతం అన్నది ఒక అందమైన ఊహ. మానుషీ వంటి అందమైన మనసున్న వారికి వచ్చే ఊహ. గృహిణులు వారికై వారు కోరుకోని ప్రతిఫలం. నిజంగా వాళ్లకు ప్రభుత్వం నెల నెలా జీతం ఇస్తామంటే.. ‘జీతం వద్దు. బదులుగా రోజూ కాస్త విరామం, పనికి కాస్త గౌరవం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేస్తారేమో! వెనిజులాలో తప్ప ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ గృహిణులకు ప్రభుత్వ జీతం లేదు. ఇస్తే బాగానే ఉంటుంది. కోరితేనే ఇవ్వాలా? భార్యగా, తల్లిగా, కోడలిగా, ఇంకా అనేక బాంధవ్యాలలో ఎన్ని కోరని వరాల జీతాలకైనా గృహిణి అర్హురాలే. పసిడి పర్వతాలను తవ్వి తెచ్చి పోసినా ఆమె శ్రమను తూచలేం.
అమ్మ కోప్పడింది
గృహిణి మీద ఇల్లెంత ఆధారపడి ఉంటుందో చూడండి. ఈ సంగతి ఇంద్రా నూయి స్వయంగా చెప్పుకున్నదే. 2006లో ఆమె పెప్సీకో సీఈవో అయ్యారు. చెన్నైలో నివాసం. భర్త, ఇద్దరు పిల్లలు. ఓ రోజు నూయీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆమె తల్లి ఎదురు వెళ్లి, ‘ఇంట్లో పాల్లేవు. తీసుకురా’ అని చెప్పారు. ‘‘అమ్మా నేను అలసిపోయాను. పెప్సీకో సీఈవో అంటే చిన్న పని ఉండదు. ఇంత లేట్ అయ్యేవరకు ఎందుకు ఆగావ్, ఎవర్నైనా పంపి తెప్పించుకోవచ్చు కదా!’’ అన్నారు నూయి. శాంతమ్మ గారికి (నూయీ తల్లి) కోపం వచ్చింది. ‘‘ఇంటికి వచ్చేటప్పుడు నీ కిరీటం తీసి మీ ఆఫీస్ చెత్తబుట్టలో వేసిరా. అక్కడ నీ పని ఎవరైనా చేస్తారు. ఇక్కడ నీ పని నువ్వే చేయాలి’’ అని ప్రేమగా మందలించారు.
అంతగా గృహిణిని బాధ్యతలతో బంధించి వేస్తుంది ఇల్లు. ‘అమ్మా..’ అని చంటి పిల్లలు బయటి నుంచి వచ్చిన తల్లి కాళ్లను చుట్టుకుపోయినట్లే.. ఆఫీస్ నుంచి వచ్చిన మహిళను ఇల్లు చుట్టుకుపోతుంది. ఉద్యోగం చేయని గృహిణినైతే అడుగైనా బయటికి పెట్టనివ్వదు. ఆగి నిముషమైనా ఊపిరి తీసుకోనివ్వదు. ఇప్పుడు చెప్పండి. గృహిణికి ఎంత జీతం ఇవ్వొచ్చు? అసలా త్యాగం, రుణం రూపాయలిస్తే తీరిపోయేవా?! అయినప్పటికీ మూడేళ్ల క్రితం ఒక జాతీయ వార్తా పత్రిక ఆ లెక్కా ఈ లెక్కా వేసి భారతీయ గృహిణి నెలకు కనీసం 45 వేల రూపాయల జీతం పొందడానికి అర్హురాలని అంచనా వేసింది. గృహిణి చేసే ఇంటి పనులన్నిటినీ ఏడు ప్రధానమైన పనులుగా వర్గీకరించి ఒక్కో పనికి ఒక్కో మొత్తం కేటాయించింది. ఆ మొత్తాలన్నీ కలిపితే ఆమెకు ఇవ్వవలసిన జీతం నలభై ఐదు వేలు అయింది. (పట్టిక చూడండి). ఆ నలభై ఐదు వేలు ఇప్పటి విలువలో చూస్తే 54 వేల రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment