ఎగ్ సమోసా, స్వీట్ కోవా సమోసా, చికెన్ సమోసా
స్వీట్ కోవా సమోసా..
కావలసినవి:
మైదా – రెండు టీస్పూన్లు; సమోసా పట్టి షీట్లు – పన్నెండు(రెడీమేడ్); వేరు శనగ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా; పిస్తా – గార్నిష్‌కు సరిపడా.
స్టఫింగ్: నెయ్యి – టీస్పూను; జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పిస్తా పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; ఉప్పు – ముప్పావు టీస్పూను; కోవా తురుము – కప్పు. సిరప్: పంచదార – అరకప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; నీళ్లు – అరకప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు.
తయారీ: జీడిపప్పుని నెయ్యిలో వేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించాలి. జీడిపప్పు వేగిన తరువాత పిస్తా, కొబ్బరి తరుము, పంచదార, కోవా తురుము వేయాలి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, యాలకులపొడి వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత అరగంట రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి ∙బాణలిలో కుంకుమ పువ్వును దోరగా వేయించాలి. ఇది వేగిన తరువాత పంచదార, అరకప్పు నీళ్లు, యాలకుల పొడి వేసి, సిరప్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లుపోసి గమ్‌లా తయార చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మిశ్రమాన్ని.. సమోసా పట్టి షీట్‌పైన టేబుల్ స్పూను వేసి సమోసాలా చుట్టుకోవాలి. లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉండేలా మైదా గమ్‌ను రాసుకుంటూ సమోసాను చుట్టుకోవాలి. సమోసాలన్నీ రెడీ అయ్యాక బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వేడివేడి సమోసాలను సుగర్ సిరప్‌లో అరనిమిషం ఉంచాలి. సుగర్ సిరప్ నుంచి తీసిన సమోసాపై పిస్తా పప్పు తురుము వేస్తే స్వీట్ సమోసా రెడీ.
చికెన్ సమోసా..
కావలసినవి: మైదా – కప్పు; వాము – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. ఖీమా ఫిల్లింగ్: నెయ్యి – టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – టీస్పూను; క్యారట్ ముక్కలు – అరకప్పు (చిన్నముక్కలు); వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం – అంగుళం ముక్క; చికెన్ ఖీమా – పావు కేజీ; కారం – అర టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; పచ్చిబఠాణి – అరకప్పు; స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ:
మైదాలో వాము, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపాక, నీళ్లు పోసి ముద్ద చేయాలి. ఈ పిండి ముద్దపైన తడి వస్త్రాన్ని కప్పి అరగంట నానబెట్టుకోవాలి. టేబుల్ స్పూను నెయ్యిలో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత అల్లం, వెల్లుల్లిని సన్నగా తరగి వేయాలి. వీటితోపాటే క్యారట్ ముక్కలు వేసి వేయించాలి. క్యారట్ వేగిన తరువాత చికెన్ ఖీమా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి గరిటతో కలిపి, మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆరు నిమిషాల తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పచ్చిబఠాణి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు వేయించి దించేయాలి. మైదాముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీలా వత్తుకోవాలి. చపాతీని కోన్ ఆకారంలో మడిచి, మధ్యలో చికెన్ ఖీమా మిశ్రమంతో నింపాలి. మిశ్రమం బయటకు రాకుండా కోన్‌ను మూసివేయాలి. ఇలా అన్ని సమోసాలు రెడీ అయిన తరువాత బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఈ ట్రేను అవెన్‌లో పెట్టి 350 ఫారిన్ హీట్స్ వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే చికెన్ సమోసా రెడీ.
ఎగ్ సమోసా..
కావలసినవి: గుడ్లు – ఆరు; పచ్చి బంగాళ దుంపల తురుము – కప్పు; క్యారట్ ముక్కలు – అరకప్పు; ఉల్లిపాయలు – నాలుగు; పచ్చిమిర్చి – మూడు; నూనె – ఐదు టేబుల్æస్పూన్లు; వంటసోడా – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; వాము – అరటీస్పూను; కొత్తి మీర – చిన్న కట్ట; మైదా – రెండున్నర కప్పులు; రిఫైన్డ్ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.
తయారీ: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి ∙మైదాలో వంటసోడా, వాము, అరటీస్పూను ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. నీళ్లుపోసి ముద్దచేసి గంటపాటు నానపెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత క్యారట్ ముక్కలు, బంగాళ దుంప తురుము వేసి వేయించాలి. నిమిషం తరువాత కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిశ్రమం మెత్తబడిన తరువాత గుడ్ల సొన వేసి వేయించాలి. గుడ్ల సొన వేగిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. మైదా ముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీల్లా వత్తుకోవాలి. ఈ చపాతీలను త్రికోణాకృతిలో మడతపెట్టి మధ్యలో ఒక టీ స్పూన్ గుడ్డు మిశ్రమాన్ని పెట్టి మిశ్రమం బయటకు రాకుండా అంచులకు కొద్దిగా తడిచేసి అతుక్కునేటట్లు వేళ్లతో మెల్లగా నొక్కాలి ఇలా అన్ని తయారయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేస్తే ఎగ్ సమోసా రెడీ.
ఇవి కూడా చదవండి: క్యాబేజ్‌తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది
Comments
Please login to add a commentAdd a comment