చలికాలంలో ఆరోగ్య సమస్యలు, పరిష్కారాలు | How To Stay Healthy Fit and Safe During Winter Season | Sakshi
Sakshi News home page

సీజన్‌లో సమస్యలు వాటి పరిష్కారాలు..

Published Thu, Nov 12 2020 12:15 PM | Last Updated on Thu, Nov 12 2020 2:26 PM

How To Stay Healthy Fit and Safe During Winter Season - Sakshi

మనం ఇప్పుడు చలికాలం ముంగిట్లో ఉన్నాం. ఉక్కపోతల, ఉబ్బరింతల బాధలేమీ  లేకుండా... కంబళిలో వెచ్చగా ముడుచుకుని పడుకునే హాయిని అనుభవింపజేసేంత ఆహ్లాదం ఉన్నప్పటికీ ఈ సీజన్‌ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను మాత్రం తెచ్చిపెడుతుంది. పైగా ఇది వైరస్‌లు మరింత బలపడేందుకు అనువైన కాలం కావడంతో కరోనా మళ్లీ విజృంభిస్తుందా అనే సందేహం ఎలాగూ ఓ పక్కన ఆందోళనపరుస్తూ ఉంది. దాంతోపాటు ఈ సీజన్‌ తెచ్చిపెట్టే సాధారణ ఆరోగ్య సమస్యలేమిటో ఓసారి చూద్దాం. వాటి నుంచి బయటపడే మార్గాలను తెలుసుకుందాం. 

చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతూ ఉంటాయి. దాంతో చలి వాతావరణంలో వైరస్‌లూ, ఇతర సూక్ష్మజీవులూ చాలా చురుగ్గా ఉంటాయని, ఓ పట్టాన వాటిని అరికట్టడం కష్టమన్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో సాధారణంగా కనిపించే కొన్ని ఇతర సమస్యలనూ, వాటి పరిష్కారాలనూ చూద్దాం. 

జలుబు... దాని సంబంధిత వైరల్‌ జ్వరాలు 
దాదాపు రెండువందలకు పైగా రకాల వైరస్‌లతో మనకు జలుబు వస్తుంది. ఆ వైరస్‌లతో కనిపించే కొన్ని సమాన లక్షణాలను బట్టి గ్రూపులు చేస్తే అందులో ఆరు రకాల గ్రూపులతో జలుబులు వస్తుంటాయని తేలింది. అవే... 1) ఇన్‌ఫ్లుయెంజా, 2) పారాఇన్‌ఫ్లుయెంజా, 3) రైనోవైరస్, 4)ప్రస్తుతం లోకాన్నంతా వణికిస్తున్న కరోనా వైరస్‌ 5) ఎడినో వైరస్, 6) హ్యూమన్‌ రెస్పిరేటరీ నిన్సీషియల్‌ వైరస్‌. వీటి కారణంగా జలుబు చేసినప్పుడు కొద్దిగా జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు లేదా కళ్ల నుంచి నీరు కారడం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్‌ సోకాక 5–7 రోజుల్లో ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి. అయితే అరుదుగా కొన్నిసార్లు మాత్రం ఈ వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియాను కలగజేస్తుంది. ప్రస్తుతం కరోనా కూడా అంతే. శ్వాసవ్యవస్థ పైన ఉంటే అది కూడా జలుబు లాగే తగ్గిపోతుంది. కానీ అదే వైరస్‌ కాస్తంత లోతుకు వెళ్లి శ్వాసవ్యవస్థ కింది భాగానికి వ్యాపిస్తే అది నిమోనియాకు దారితీస్తుంది. ఇలాంటప్పుడే సమస్య తీవ్రమవుతుంది. పరిస్థితి విషమించే అవకాశాలూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ముక్కు, శ్వాసకోశ వ్యవస్థలోని సన్నని ఎపిథీలియల్‌ పొర దెబ్బతినడం వల్ల బ్యాక్టీరియా చేరి సైనుసైటిస్, ఫ్యారింజైటిస్‌ మొదలైనవి వచ్చే అవకాశమూ లేకపోలేదు. 

నివారణ... 
►మంచి పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దాంతో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దీనివల్ల జలుబే గాక మరెన్నో రుగ్మతలనుంచి రక్షణ లభిస్తుంది. 
►జలుబు వచ్చినవారు సైతం నేరుగా తుమ్మడం, దగ్గడం చేయకుండా చేతిరుమాళ్లు, టిష్యుపేపర్లు వంటివాటిని అడ్డు పెట్టుకోవడం అవసరం. ఇదే జాగ్రత్త కరోనా వ్యాప్తినీ అరికడుతుందని గుర్తుపెట్టుకోవాలి. దీనికి తోడు చేతుల శానిటైజేషన్, భౌతికదూరం జాగ్రత్తలూ ఇటు జలుబునూ, అటు కరోనానూ నివారిస్తాయి. 

నివారణ... చికిత్స... చిట్కాలు... 
జలుబు తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్‌ లిమిటింగ్‌) రుగ్మత. చికిత్సగా కేవలం ఉపశమనం (సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌) మాత్రమే ఇస్తుంటారు. జలుబు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దాని లక్షణాలను తగ్గించడానికి (సింప్టమ్యాటిక్‌ ట్రీట్‌మెంట్‌గా) జ్వరానికి పారాసిటమాల్, ముక్కులు పట్టేసినప్పుడు డీకంజెస్టెంట్స్, నేసల్‌ డ్రాప్స్‌ వాడవచ్చు. గొంతునొప్పి, గొంతులో గరగర వంటి వాటికి లోజెంజెస్‌ వాడవచ్చు. థ్రోట్‌ గార్గిల్‌ (గరగరా పుక్కిలించడం) చేయవచ్చు. ఒక్కోసారి జలుబుతో జ్వరం వచ్చి తగ్గిపోయాక కూడా నీరసం, నిస్సత్తువ ఉంటాయి. దాన్నే ‘పోస్ట్‌ పైరెక్సియల్‌ డెబిలిటీ’ అంటారు. అది తగ్గాలంటే  మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. జలుబూ, కరోనాల నివారణకూ అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం, జింక్, విటమిన్‌–సి ఎక్కువగా ఉండే ఆహారాలు అవసరం. వ్యాధినిరోధక శక్తిని సమకూర్చుకునేందుకు వ్యాయామం తప్పనిసరి. 

కరోనా సెకండ్‌వేవ్‌కు అవకాశం... 
చలి వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని కరోనా తన సెకండ్‌వేవ్‌ను మొదలుపెడుతుందేమోననే సందేహం ఇప్పుడు దేశమంతటా ఉంది. ఇదే విషయాన్ని సీసీఎంబీ వంటి సంస్థలు సైతం నొక్కిచెబుతూ... తమ హెచ్చరికలతో అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనాను అరికట్టడానికి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్‌ వంటి ప్రక్రియలతో పాటు సమూహాల నుంచి దూరంగా ఉంటూ... ఇలా వెళ్లాల్సి వచ్చినప్పుడు భౌతిక దూరాలను పాటిస్తూ ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడంపై మనకు తగినంత అవగాహనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement