'చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఓ పీడకల. కీళ్లలో ఇన్‌ఫ్లమేషన్ వచ్చి నొప్పి కలిగించే ‘ఆర్థరైటిస్’ సమస్య చలికాలంలో పెచ్చుమీరడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కారణాలవుతాయి. అవేమిటో, చలికాలంలో ఈ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఎలా.. వంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.'
చలికాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవారి వెతలు మరింతగా పెరుగుతాయి. అందుకు కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
చలికాలంలో కీళ్లనొప్పులు పెరిగేదెందుకంటే..
మానవ శరీరంపై వాతావరణం ప్రభావం తప్పక ఉంటుంది. దేహంలో జరిగే చాలా జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలోని తేడాలకు తగ్గట్లుగా మార్పులకు లోనవుతుంటాయి. దాంతో ఆర్థరైటిస్ కీళ్లనొప్పులతో బాధపడేవారి కండరాలు మరింతగా బిగుసుకుపోవడం, బాధలు పెరగడం జరుగుతాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ బాధలూ పెరుగుతాయి. ఇందుకు దోహదపడే అంశాలివి..
- చలికాలంలో చేయి లేదా కాలి వేళ్లకు రక్తప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో ఇది మరింత ఎక్కువ. ఇది మరింత తీవ్రతరం అయినప్పుడు కొందరిలో చేతివేళ్లు, కాలివేళ్లు కుళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’ అంటారు.
- ఆర్థరైటిస్ వల్ల లంగ్స్ ప్రభావితం అయినప్పుడు ఐఎల్‌డీ అనే జబ్బు వచ్చి, చలికాలంలో తీవ్రత మరింత పెరిగి బాధితుల్లో దగ్గు, ఆయాసం పెరుగుతాయి.
- మయోసైటిస్ అనే రకం కీళ్లవాతంతో బాధపడేవారిలో ఈ కాలంలో కండరాలకి రక్తప్రసరణ తగ్గడంతో వాటి కదలికలు మరింత తగ్గుతాయి. ఫలితంగా తగినంత వ్యాయామం సమకూరక.. వ్యాధి లక్షణాలు పెరిగి, ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కీళ్లనొప్పులతో బాధపడుతుండేవారు చలికాలం వస్తుందంటేనే ఆందోళన చెందుతుంటారు.
ఈ కాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే..
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించడం ద్వారా చలికాలంలో పెరిగే తమ బాధలను చాలావరకు అధిగమించడం సాధ్యమే..
- శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి.
- ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌవ్స్ ధరించాలి.
- వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతమవుతుంది.
- వెచ్చదనం కారణంగా రక్తప్రవాహమూ మెరుగుపడుతుంది.
- కండరాలు బిగుసుకు పోవడమూ తగ్గుతుంది.
- చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందికరంగా మారడం, నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు తమ దేహ కదలికలను బాగా తగ్గిస్తారు.
- తగినంత వ్యాయామం సమకూరకపోవడంతో బాధలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
- వీరు తమకు శ్రమ కలగని రీతిలో ఎంతోకొంత వ్యాయామం చేయాలి.
- చలికాలంలో సూర్యరశ్మి తక్కువ.
- ఫలితంగా ఒంట్లో విటమిన్–డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాల పెరిగి, బాధలు మరింత పెచ్చరిల్లుతాయి.
- అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు డాక్టర్లు నిర్ణయించిన మోతాదులో, వారు సూచించిన కాలానికి విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవాలి.
- ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉండటంతో అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుంది.
- కీళ్లవాతాల తీవ్రతా పెరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్లు సూచించిన వ్యాక్సిన్లు తీసుకోవాలి.
- అంటువ్యాధుల వల్ల వయోవృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి.
- చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తక్కువగా తీసుకుంటూ ఉంటారు.
- ఒంట్లో ద్రవాలు తగ్గి, డీ–హైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో అందరూ తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి.
- ఆర్థరైటిస్ కోసం వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.
ఈ జాగ్రత్తల ద్వారా ఆర్థరైటిస్ బాధితులు చలికాలంలో ఎదుర్కొనే బాధలను చాలావరకు నివారించవచ్చు.
ఇవి చదవండి: వింటర్‌లో సెల్యులైటిస్‌తో సమస్యా..? అయితే ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment