తర్లా దలాల్ 2013లో మరణించింది. కాని వంట అనేసరికి టీవీ చెఫ్‌గా ఇప్పటికీ ఆమె పేరే గుర్తుకు వస్తుంది. వంటల మీద తర్లా దలాల్ రాసిన 100 పుస్తకాలు దాదాపుకోటి కాపీలు అమ్ముడుపోయాయి. భారతదేశంలో కోటి ఇళ్లల్లో ఆమె రెసిపీలు ఉపయోగించారని అంచనా. వీరుల, ధీరుల బయోపిక్‌లు తయారవుతున్న రోజుల్లో ఒక గొప్ప వంటగత్తె కథ బయోపిక్‌గా రావడం చాలా పెద్ద విషయం. తర్లాగా తెర మీద హ్యూమా ఖురేషి కనిపించనుంది. ఈ సందర్భంగా తర్లా దలాల్ ఘన గతం గురించి కథనం.
జీవితంలో ‘రుచి’ కనిపెట్టడం ఒక అదృష్టమే. డబ్బున్నా లేకపోయినా ‘ఆ... ఏదో ఒకటి వండుకుంటే సరిపోదా’ అనుకునేవారికి ఈ కథనం పనికి రాదు. ‘ఏదైనా ఒకటి వండి చూద్దాం’ అనుకునేవారు తర్లా దలాల్‌తో ఇన్‌స్పయిర్ అవుతారు. మన దేశంలో స్త్రీలు కట్టెల పొయ్యిలతో, ఊదుడు గొట్టాలతో ఆ పూట వంటతో సతమతమవుతూ ఉన్న రోజుల్లో అమెరికాలో కొత్త కొత్త వంటలు నేర్చుకుంది తర్లా దలాల్. ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఏకంగా వంట పాఠాలే చెప్పింది. అందరూ వంట చేస్తారు. కాని ‘సరిగ్గా’ చేయడం ఎలాగో చెప్పడం ద్వారా ఆమె దేశాన్నే జయించగలిగింది. అందుకే ఆమె కథ ఇప్పుడు సినిమాగా వస్తోంది.
చిన్నారి వంట మాస్టర్
తర్లా దలాల్‌కు చిన్నప్పటి నుంచి వంటంటే ఇష్టం. పూణెలో చదువుకునేటప్పుడు 12 ఏళ్ల వయసు నుంచి తల్లికి రోజూ వంటలో సాయం చేసేది. 1956లో ఆమె బిఏ పూర్తి చేసి నళిన్ దలాల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లే ఆమె భవిష్యత్తును నిర్దేశించింది. నళిన్ అమెరికాలో ఎం.ఎస్. చేస్తుండటం వల్ల కాపురం అక్కడే పెట్టాల్సి వచ్చింది. కొత్త దేశం. కావలసినంత సమయం. నళిన్ భోజనప్రియుడు కనుక ఏవైనా కొత్త వంటకాలు ట్రై చేయరాదా అని ఆమెను ఎంకరేజ్ చేశాడు. దాంతో తర్లా రోజుకు రెండు మూడు కొత్త వంటకాలు చేసి భర్తకు పెట్టేది. అతడు పర్‌ఫెక్షనిస్ట్. అంత సరిగా రాలేదు అని చెప్తే తర్లా మళ్లీ అదే వంటను చేసేది. అనుకున్నది అనుకున్నట్టుగా వండటమే వంట ప్రావీణ్యం అని ఆమె గ్రహించింది. కాని నళిన్ ఆమెను పూర్తిగా మెచ్చుకోవడానికి 9 ఏళ్లు పట్టింది. 9 ఏళ్ల తర్వాత ‘మాస్టర్ ఆఫ్ ఆల్ కూజిన్స్’ అని బిరుదు ఇచ్చాడు.
ముంబైలో వంట క్లాసులు
ఇండియాకు తిరిగి వచ్చాక 1966లో ముంబైలో వంట క్లాసులు మొదలెట్టింది తర్లా. ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి కావాలంటే వంట వచ్చి ఉండటం ఒక అవసరంగా భావించేవారు. అందుకని తర్లా క్లాసులకు డిమాండ్ పెరిగింది. ఒక దశలో ‘తర్లా దగ్గర వంట నేర్చుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లి జరిగిపోతుంది’ అన్నంత పేరు ఆమెకు వచ్చింది. అదే సమయంలో వంటల పుస్తకాల మీద భర్త దృష్టి మళ్లించాడు. 1974లో ‘ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్’ పేరుతో తర్లా తెచ్చిన పుస్తకం పెద్ద హిట్ అయ్యింది. 1987 నాటికి దేశంలో తర్లా అతి పెద్ద వంటల రచయితగా ఎదిగింది. ఆమె తన పుస్తకాల రాబడి మీద పెద్ద ఆఫీస్ కొనుక్కుంది. ఆ పుస్తకాలు అనేక భాషల్లో ట్రాన్స్‌లేట్ చేసి పబ్లిష్ చేయడానికి సిబ్బందిని పెట్టుకుంది. తర్లా వంటల పుస్తకాలు డచ్, రష్యన్ వంటి విదేశీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 100 పుస్తకాలు రాసి చరిత్ర సృష్టించింది తర్లా. టీవీ చెఫ్‌గా దేశానికి ఎక్కువగా తెలిసిన పేరు కూడా ఆమెదే.
శాకాహారానికి ప్రచారకర్త
తర్లా రాసిన పుస్తకాలన్నీ శాకాహారానికి సంబంధించినవే. ఒక రకంగా ఆమె శాకాహారాన్ని ప్రచారం చేసిందని చెప్పాలి. దేశంలో ఎన్నో కుటుంబాలు తర్లా చేసిన శాకాహార వంటకాలను ట్రై చేసి రుచిని పొందాయి. 1988లోనే ఆమె ‘తర్లాదలాల్‌డాట్‌కామ్’ వెబ్‌సైట్‌ను తెరిస్తే నెలకు మూడు లక్షల మంది ఆ సైట్‌ను చూడటం రికార్డ్. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న భారతీయులు ఆ వెబ్‌సైట్ ద్వారా తర్లా రెసిపీలు చూసి వంటలు చేసుకునేవారు. ఈ మొత్తం కృషికి తర్లాకు 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. మన దేశీయులకు స్వాదిష్టకరమైన భోజనాన్ని ప్రచారం చేస్తూ 2013లో మరణించింది తర్లా. సినిమా రిలీజప్పుడు మరోసారి తర్లాను తలుచుకుందాం.
బాలీవుడ్ సినిమా
ఇంటింటికీ తెలిసిన ఈ వంటగత్తెను ఇప్పుడు సినిమాగా ఇంటింటికీ తేనున్నారు బాలీవుడ్‌లో. హుమా ఖురేషీ తర్లా దలాల్‌గా ‘తర్లా’ అనే సినిమా తర్లా దలాల్ బయోపిక్‌గా మొదలైంది. రోనీ స్క్రూవాలా నిర్మాత. దంగల్, చిచోరే సినిమాలకు రచయితగా పని చేసిన పీయుష్ గుప్తా దర్శకుడు. ‘చిన్నప్పుడు మా ఇంట్లో వంట గదిలో తర్లా దలాల్ పుస్తకం ఉండేది. ఆమె పుస్తకంలో ఉండే మాంగో ఐస్‌క్రీమ్ రెసెపీని చూసి అమ్మ మాకు తయారు చేసి ఇచ్చేది. ఈ సినిమా చేయమని నాకు ఆఫర్ వచ్చినప్పుడు అది గుర్తుకు వచ్చింది. తర్లా పాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది నటి హుమా ఖురేషీ.
Comments
Please login to add a commentAdd a comment