ప్రకృతి వైవిధ్యమంతా ఆ దీవిలో ఒకేచోట కనువిందు చేస్తుంది. అందుకే పర్యాటక నిపుణులు ఆ దీవిని ‘ప్యారడైజ్ ఆన్ ఎర్త్’ అని అభివర్ణిస్తున్నారు. ‘ఇలా దాస్ ఫ్లోరిస్’ అనే ఈ దీవి పోర్చుగల్‌లో ఉంది. ఈ దీవిలో అందమైన బీచ్‌లు మాత్రమే కాదు, సహజమైన సరోవరాలు, జలపాతాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు చుట్టూ పచ్చగా కనిపించే దట్టమైన వనాలు ఇట్టే ఆకట్టుకుంటాయి.
గుత్తులు గుత్తులుగా రంగు రంగుల పూలతో అలరారే అపురూపమైన ‘హైడ్రేంజ’ మొక్కలు ఈ దీవిలో విరివిగా ఉండటంతో ఈ దీవికి ‘ఇలా దాస్ ఫ్లోరిస్’– అంటే పూలదీవి అనే పేరువచ్చింది. ఈ దీవి తీరంలో డాల్ఫిన్లు విరివిగా కనిపిస్తాయి. ఈతకొడుతూ సేదదీరాలనుకునే వారికి, కొండలపై ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఈ దీవి అనువుగా ఉంటుంది. ఈ దీవిలో జనాల సందడి చాలా తక్కువ. చాలా చోట్ల ఖాళీగా మిగిలిన ఊళ్లు, ఆ ఊళ్లలోని పాతకాలం ఇళ్లు కనిపిస్తాయి.
ఈ దీవికి వెళ్లే పర్యాటకులు కొందరు ఖాళీ ఊళ్లలో ఖాళీగా మిగిలిన పాత ఇళ్లనే శుభ్రం చేసుకుని తాత్కాలికంగా బస చేస్తుంటారు. పర్యాటకుల రాక ఇటీవలి కాలంలో పెరుగుతుండటంతో పోర్చుగల్ ప్రభుత్వం ఇక్కడ ఖాళీగా మిగిలిన ఊళ్లలోని ఇళ్లకు మరమ్మతులు జరిపి, వాటిని కాటేజీలుగా మార్చి పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ‘ఫోర్బ్స్’ పత్రిక ఈ దీవిని యూరోప్‌లో వెలుగుచూడని రత్నాలలో ఒకటిగా అభివర్ణించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment