
యోగా సాధనతో అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే అనే అవగాహన ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. మెరుగైన జీర్ణవ్యవస్థ మొదలు, గుండె జబ్బులు దాకా, ప్రశాంతమైన నిద్ర, బరువు తగ్గడం , అందం, ఆకర్షణ లాంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. నిపుణులైన యోగ గురువుల సమక్షంలో కొన్ని ఆసనాలను సాధనం చేయడం ద్వారా చాలా ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.
యోగా సాధన ప్రయోజనాలు
శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
ఒత్తిడిని దూరం చేస్తుంది
ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది
రక్తపోటును తగ్గిస్తుంది
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఆందోళనను దూరం చేస్తుంది
దీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తుంది
సంతులనం భావాన్ని మెరుగుపరుస్తుంది
ఎముకలకు బలాన్నిస్తుంది.
ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది.
గుండె జబ్బు, ఇతర కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
వజ్రాసనం
ఒత్తిడి, మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం వజ్రాసనం. మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా ఏదైనా తిన్న తర్వాత వజ్రాసనం చేయడం ద్వారా తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. శ్రద్ధగా, ఓపిగ్గా పాటిస్తే ఒత్తిడిని తరిమి కొట్టవచ్చు. అర్ధ మత్స్యేంద్రాసన,సుప్త మత్స్యేంద్రాసన, భుజంగాసనం, మర్జర్యాసనం- ఇలాంటివెన్నో జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.
సుప్త బద్ధ కోణాసనం
అలసట, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బాడీలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను ఈజీగా కరిగిస్తుంది. ముఖ్యంగా తొడలు, మోకాళ్లను నాజూకుగా చేస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రియం చేస్తుంది.
ఊర్ధ్వ ప్రసారిత పద్మాసనం
అవయవాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.. కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. కండరాలను బలపరుస్తుంది. వెన్నెముకకు శక్తినిస్తుంది. కాలేయం, మూత్రపిండాల పనీతీరును మెరుగుపరుస్తుంది.
మార్జాలాసనం
ఈ ఆసనం తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను ఉత్తేజితం చేసి, బలపరుస్తుంది. అంతేకాక ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా ఇతర అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.
తడాసానం
భోజనం చేసిన తరువాత చేయడానికి ఇది ఉత్తమమైన ఆసనం. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.
భుజంగాసనం
సయాటికా నొప్పి, ఆస్తమాకు చికిత్సలో ఇది చాలా ఉపయోగపడుతుంది. వెన్నెముకను బలపరుస్తుంది కూడా. ఛాతీ, ఊపిరితిత్తులకు బలాన్నిస్తుంది. భుజాలు, పొట్ట, పిరుదుల్లోని కొవ్వును కరిగించి, దృఢ పరుస్తుంది.
వీటితోపాటు పార్శ్వ సుఖాసనం, అర్ధ మత్స్యేంద్రాసన, సుప్త మత్స్యేంద్రాసన, అపానాసన, మర్జర్యాసనం-బితిలాసనం, ధనురాసనం లాంటివి చాలా ఉన్నాయి. నిపుణుడైన యోగా గురు పర్యవేక్షణలో ఆయా అవయవాల పనితీరు కోసం ప్రత్యేకంగా ఆచరించవచ్చు.