నేటి టెక్నాలజీ యుగంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని హాలిడేగా తీసుకుని ఆనందించే వారే ఎక్కువ. స్కూలు, కాలేజీ విద్యార్థులైతే జెండా వందనం తరువాత ఇంటికెళ్లిపోవచ్చు అని తెగ సంబరపడిపోతుంటారు. కానీ డెబ్బై ఆరేళ్లుగా విరామం లేకుండ జరుపుకొంటూ నేడు 77వ వసంతంలో అడుగు పెట్టాం. దేశాన్ని పాలించే అధికారులు అధికారికంగా ఈ వేడుకలు జరిపిస్తున్నారు. బాధ్యత గల పౌరులుగా మనం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం....
► ఉదయాన్నే ఎర్రకోటపై జరిగే జెండావందనం, వివిధ కార్యక్రమాలను టీవీలో చూడాలి. డెభ్బై ఏడేళ్ల స్వాతంత్య్ర భారతం ఎంత ఎత్తుకు ఎదిగిందన్న అంశాలను ప్రత్యక్ష ప్రసారాలు చూడడం ద్వారా తెలుసుకోవచ్చు
► తరువాత ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేసుకి ఈరోజు వెళ్లండి. ఒక రోజులో వెళ్లిరాగల ప్రాంతానికి వెళ్లి అక్కడ గడిపి మీ ఒత్తిడిని దూరం చేసుకోండి. అక్కడ స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా గడపండి.
► రోజూ వేసుకునే దుస్తులు కాకుండా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలాంటి దుస్తులు ధరించండి. వీలైనంత వరకు డ్రెస్‌లో తెలుపు, కాషాయం, ఆకుపచ్చని రంగులు ఉండేలా చూసుకుని వేసుకోవాలి. అప్పుడు త్రివర్ణ పతాకానికి మరింత వన్నె తెచ్చిన వారవుతారు
► ఎక్కడికీ వెళ్లే ఓపిక లేనప్పుడు ఇంట్లోనే ఉండి దేశభక్తి సినిమాలు చూడండి. మీతోపాటు మీ పిల్లలకు మన దేశ చరిత్ర, ఔన్నత్యాలు తెలుస్తాయి
► మరింత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే మూడు రంగులు ఉండేలా వెరైటీ డిష్‌లు తయారు చేసుకుని తినండి
► స్వాతంత్య్ర దినోత్సవం అర్థం ఉట్టిపడేలా గాలిపటాలు ఎగరవేయండి. మూడు రంగుల్లో ఉన్న గాలిపటాలను వీలైనంత ఎత్తుకుఎగరేస్తూ మనకొచ్చిన స్వేచ్ఛను ఎంజాయ్ చేయవచ్చు
► పుస్తకాల పురుగులు అయితే దేశభక్తి పుస్తకాలను చదవండి. స్వాతంత్య్ర సమర యోధుల విజయగాధలు, వీరిలో బాగా పాపులర్ అయిన నాయకుల బయోగ్రఫీని చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు
► దేశభక్తి గీతాలు వింటూ కూడా సంబరాలు జరుపుకోవచ్చు. అలనాటి పోరాట, అసామాన్య త్యాగాలను గుర్తుచేసే పాటలను వినాలి. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, ఏఆర్ రెహ్మాన్ పాటలు మనలో నిద్రపోతున్న దేశభక్తిని తట్టి లేపుతాయి
► ఇంటి చుట్టుపక్కల వారు లేదా బంధువులు, కుటుంబ సభ్యులతో దగ్గరలో జరుగుతోన్న జెండా పండుగకు వెళ్లి రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి జైహింద్ కొట్టాలి ∙దేశానికి పెద్ద సేవ చేయలేక పోయినప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్న వారందరికి స్వీట్లు పంచి, నోరు తీపి చేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోండి.
► ప్రతి భారతీయుడికి ఎంతో విలువైన బహుమతులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. అందుకే వీలైనంత వరకు అందరితో కలిసి జరుపుకోవాల్సిన జెండా పండుగ ఇది. సెలవు దొరికింది అని సంబరపడిపోక వీటిలో ఏ ఒక్కదాన్ని పాటించినా స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవించినట్లే.
Comments
Please login to add a commentAdd a comment