వెడ్డింగ్ ఈవెంట్స్‌లో చిత్రకళకు కొత్త క్రేజ్
లైవ్ పెయింటింగ్, టర్మరిక్ ఆర్ట్ సందడి
ఔత్సాహిక యువ చిత్రకారులకు చేతినిండా పని
ఆర్ట్ చుట్టూ అల్లుకుంటున్న కొత్త అనుబంధాలు
నగరానికి చెందిన ఆలేటి సాయిరాం ప్రమోధిని రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి తమ పెళ్లి వేడుకను ప్రత్యక్షంగా చిత్రీకరించడానికి ఒక పెయింటర్‌ను నియమించుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం అందించే లైవ్ టెలికాస్ట్ గురించి విన్నాం కానీ.. లైవ్ పెయింటింగ్ వినలేదు అనుకుంటే మీరింకా వెడ్డింగ్ ట్రెండ్స్‌లో అప్‌డేట్ కాలేదన్నమాటే..
వధూవరులు ఓవైపు రంగుల కలల్లో తేలిపోతుంటే.. మరోవైపు సప్తవర్ణాల చిత్ర ‘కళ’ ఆ ఇద్దరి అనుబంధం సాక్షిగా పెళ్ళి వేడుకను అల్లుకుపోతోంది. ఫొటోగ్రఫీ మామూలేగానీ.. లైవ్ పెయింటింగ్ పెడుతున్నారా లేదా..? అని వెడ్డింగ్ ప్లానర్స్‌ను అడిగే రోజులు వచ్చేశాయంటే.. ఇప్పుడు, వివాహ వేడుకల్లో చిత్రకళకు పెరుగుతున్న అర్థం చేసుకోవచ్చు.
అడ్డుతెరతో ఆరంభం..
పెళ్లి వేడుకల సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డుతెరను కళాత్మకంగా రూపొందించడంతో ఓ రకంగా పెళ్లిళ్లలో చిత్రకళకు ప్రాధాన్యత మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత అతిథుల పోట్రైట్‌లు గీసి రిటర్న్ గిఫ్టŠస్‌గా ఇవ్వడం వంటివి ఒకటొకటిగా ఆరి్టస్టులను వెడ్డింగ్స్‌కు దగ్గర చేశాయి.
టర్మరిక్ ఆర్ట్.. ఓ వైవిధ్యం..
ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో కొత్త ఆర్టిస్టిక్ ట్రెండ్‌గా సందడి చేస్తోంది టర్మరిక్ ఆర్ట్. దీనిలో భాగంగా చిత్రకారులు వధూవరుల రూపాలను కాన్వాస్‌పై ఇని్వజబుల్‌గా ప్రత్యేకమైన విధానంలో చిత్రిస్తారు. ఆ తర్వాత దాన్ని పెళ్లి వేడుకల్లో ప్రదర్శిస్తారు. వచి్చన అతిథులంతా దాని దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న రంగులను చేతులకు అద్దుకుని హస్తముద్రలు ఆ కాన్వాస్ పై వేస్తూ ఉండగా.. వధూవరుల రూపాలు దానిపై ప్రత్యక్షమవ్వడం ఓ ఆసక్తికరమైన వర్ణ వైవిధ్యం.
ప్రత్యక్ష.. పెయింటింగ్..
పెళ్లి వేడుకలో ఓ వైపుగా కూర్చుని వధూవరులకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను చిత్రించడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. పెళ్లికూతురును పెళ్లి బుట్టలో తీసుకువెళ్లడం, దంపతులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర–బెల్లం ఉంచడం, మంగళసూత్రం కట్టడం, సంప్రదాయ ఆటలు ఆడడం వంటి అపురూప సందర్భాలను ఒడిసిపట్టుకోవడానికి వీడియో, ఫొటోగ్రాఫర్‌ల తరహాలో ఆరి్టస్టులు కూడా ఇప్పుడు తలమునకలవుతున్నారు.
ఔత్సాహిక ఆరి్టస్టులకు డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్ కావడంతో యువ ఆరి్టస్ట్ కీర్తన షెడ్యూల్ ఫుల్ బిజీగా మారిపోయింది. ‘దంపతులు మా కళాకృతిని చూసిన ప్రతిసారీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోతారు’ అని కీర్తన చెప్పింది. ఆమె గత ఏడాది ఒక పెళ్లి సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డు తెరను అందంగా చిత్రించింది. ఆ తర్వాత నవంబర్‌లో తన మొదటి ప్రత్యక్ష (లైవ్) వెడ్డింగ్ పెయింటింగ్‌ను రూపొందించింది. అవి సోషల్ మీడియా ద్వారా ఆదరణకు నోచుకోవడంతో ఇప్పటి వరకూ నగరంతో పాటు బెంగళూరు, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్‌లో మొత్తం 60 అడ్డుతెర చిత్రాలు, 13 వివాహ వేడుకల లైవ్ పెయింటింగ్ వర్క్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
‘ఒక పెయింటింగ్ ఫొటోకు దొరకని వివరాలను క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు మానవ స్పర్శ కూడా అందులో ఉంది’ అంటోంది సిటీకి చెందిన ఆర్టిస్ట్ రేష్మ. లైవ్ ఈవెంట్ పెయింటింగ్‌కు పేరొందిన ఈ యువతి.. ‘కొన్నిసార్లు మండపం దగ్గర లేదా స్క్రీన్ ముందు ఆరి్టస్టులు వారికి కేటాయించిన స్థలంలో కూర్చుంటారు. వేడుక జరుగుతున్నప్పుడు చూస్తూ స్కెచ్/పెయింట్ చేస్తారు. ఆ క్షణాలలో అక్కడి భావోద్వేగాలు, జ్ఞాపకాల కోసం ప్రధాన సన్నివేశాలను చిత్రించడానికి వాటర్ కలర్‌లను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఈవెంట్, డెకర్ స్నాప్‌షాట్ కోసం యాక్రిలిక్‌లను కూడా వాడతారు. ప్రస్తుతం ఈ తరహా ఆర్ట్‌వర్క్‌ల ధర 20,000 నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటుంది అదే విధంగా అవుట్‌స్టేషన్ నుంచి రప్పించే పేరొందిన ఆరి్టస్ట్ అయితే ప్రయాణ వసతి ఖర్చులను కూడా క్లయింటే భరించాలి.
కష్టమే కానీ.. గొప్ప సంతృప్తి..
సాధారణంగా ఆరి్టస్ట్‌కి ఏకాగ్రత చాలా ముఖ్యం. అయితే పెళ్లిలో మన వర్క్స్ చూస్తూ వ్యాఖ్యానిస్తూ లేదా ప్రశ్నలు అడుగుతూ వచ్చిన వారు అంతరాయం కలిగిస్తూ ఉంటారు. ధ్యాస చెదరకుండా ఉండాలి. అదే సమయంలో అతిథులతో మర్యాదగా ప్రవర్తించాలి. కష్టమే అయినా గొప్ప సంతృప్తి ఇందులో లభిస్తుంది.
– సత్యవర్షి, ఆర్టిస్ట్
యువ చిత్రకారులకు ప్రోత్సాహకరం..
ప్రస్తుతం నేను లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్‌తో పాటు టర్మరిక్
ఆర్ట్ వర్క్ కూడా అందిస్తున్నాను. ఈ లైవ్ వెడ్డింగ్ ఆర్ట్ ట్రెండ్ మాలాంటి ఔత్సాహిక చిత్రకారులకు బాగా ప్రోత్సాహకరంగా ఉంటోంది. పెళ్లి వేడుకల్ని నేరుగా చూస్తూ చిత్రించడం అనేది సరదాగా ఉంటుంది. అదే సమయంలో అది ఒక సవాల్ కూడా.
– గ్రీష్మ, ఆర్టిస్ట్
Comments
Please login to add a commentAdd a comment