ఇంట్లో పెద్దపిల్లలు వాడిన ఆట వస్తువులు, పొట్టి అయిన, బిగుతైన బట్టలు, పై తరగతికి వెళ్లిన అక్క లేదా అన్నయ్య పుస్తకాలను తమ్ముడు, చెల్లెళ్లకు ఇవ్వడమనేది మన దేశంలో ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తోన్న పద్ధతి. చిన్నవాళ్లకు కూడా ఆ బట్టలు పొట్టి అయినప్పుడు ఇల్లు తుడిచే మాప్‌గానో, మసిబట్టగానో ఉపయోగిస్తుంటారు.
ఇప్పుడు ఈ పద్దతికి టెక్స్‌టైల్స్ పరిశ్రమలు మరికొన్ని కొత్త హంగులు జోడించి రీసైక్లింగ్ పేరిట ఆకర్షణీయమైన ఉత్పత్తులను ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశపెడుతున్నాయి. రీసైక్లింగ్ చేసిన ఫ్యాషన్ ఉత్పత్తుల క్రేజ్‌ను గుర్తించిన రిని మెహత.. పాత చీరలతో అందమైన బ్యాగ్‌లను రూపొందించి పిటారా పేరుతో విక్రయిస్తోంది.
సంప్రదాయ బ్యాగ్‌లతోపాటు, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్ ఉత్పత్తులు అందించడం పిటారా ప్రత్యేకత. పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్థాలను జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోన్న పిటారా గురించి రిని మెహతా మాటల్లో...
‘మాది జైపూర్. చిన్నప్పటి నుంచి సృజనాత్మకంగా ఉండడం ఇష్టం. నా మనసులో వచ్చే అనేక క్రియేటివ్ ఆలోచనలు బ్లాక్‌బోర్డు మీద రాస్తుండేదాన్ని. అలా రాస్తూ కాస్త పెద్దయ్యాక సొంతంగా తయారు చేసిన కార్డులను ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శనకు ఉంచే దాన్ని. నా ఆలోచనలు, అభిరుచులను పట్టించుకోని అమ్మానాన్నలు నన్ను ఎమ్‌బీఏ చేయమని పట్టుబట్టారు.
వారికోసం ఎమ్‌బీఏలో చేరాను కానీ, పూర్తిచేయలేదు. ఆ తరువాత క్రియేటివ్ రంగంలో పనిచేయాలన్న దృఢసంకల్పంతో.. టెక్స్‌టైల్ డిజైనర్‌గా పనిచేయడం ప్రారంభించాను. కొన్నాళ్లు డిజైనర్‌గా పనిచేశాక నేనే సొంతంగా సరికొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనకు ప్రతిరూపమే ‘పిటారా’.
తమ్ముడు లా వదిలేశాడు..
కట్టుకోవడానికి పనికిరాని పాతచీరలతో బ్యాగ్‌లు తయారు చేసి విక్రయించవచ్చు అని తమ్ముడు రోహన్ మెహతాకు చెప్పాను. నా ఐడియా వాడికి బాగా నచ్చింది. దీంతో రోహన్ లా ప్రాక్టీస్‌ను వదిలేసి నాతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఇద్దరం కలిసి పిటారాను ప్రారంభించాము. పిటారా అంటే ‘ట్రెజరీ బాక్స్’ అని అర్థం. ప్రారంభంలో ఇంట్లో మూలుగుతోన్న పాత చీరలతో బ్యాగ్‌లు తయారు చేసే వాళ్లం.
క్రమంగా ఇంట్లో పాత చీరలన్నీ అయిపోయాయి. తరువాత మేము తయారు చేస్తోన్న ఉత్పత్తుల గురించి మా కాలనీలో వాళ్లకు, సోషల్ మీడియాలోనూ వివరించడంతో చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత చీరలను తీసుకొచ్చి ఇచ్చేవారు. అలా చీరలు ఇచ్చిన వారికి కూపన్‌లు ఇచ్చే వాళ్లం. ఆ కూపన్‌లను మా స్టోర్‌లో ఏదైనా కొనుక్కున్నప్పుడు వాడుకునే విధంగా ఏర్పాటు చేశాం.
అన్నీ హ్యాండ్‌మేడే..
మా పిటారా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేసినవే. వాటిలో రాజస్థానీ కళ, సంస్కృతీ సంప్రదాయాలు స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. మా బ్యాగ్‌లలో బగ్రు, జర్దోసి ప్రింట్లు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ప్రతిదీ యంత్రాలతో తయారు చేస్తున్నారు. మేము మన సంస్కృతిని వెనక్కి తీసుకు రావడంతోపాటు, కళాకారులకు ఉపాధి కల్పించాలనుకున్నాము.
అందుకే మా బామ్మ వాలెట్‌ను ప్రేరణగా తీసుకుని అప్పట్లో వాడిన బ్లాక్, ఇక్కత్ ప్రింట్ వస్త్రంతో వివిధ రకాల టెక్నిక్‌లను వాడి డిజైన్లు రూపొందించి ఇప్పటి ట్రెండ్‌కు నప్పేవిధంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నాము.
రీసైక్లింగ్ చేసిన చీరలకు న్యూస్ పేపర్‌లు, మ్యాగజీన్లు, పాత టైర్లు, ఉన్ని, ఈకలు జోడించి రోజువారి వాడుకునే వస్తువులను రూపొందిస్తున్నాం’ అని వివరిస్తోంది రిని మెహతా. సృజనాత్మక ఆలోచనా విధానం ఉండాలే గానీ అద్భుతాలు సృష్టించే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయనడానికి రిని మెహతా పిటారా ఉదాహరణగా నిలుస్తోంది.
సవాలుగా అనిపించినప్పటికీ..
వ్యాపారం ఏదైనా ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభంలో మా వద్దకు వచ్చిన వ్యర్థాలను లగ్జరీ ఉత్పత్తులుగా తీర్చిదిద్దడం సవాలుగా అనిపించింది. తరువాత మొత్తం వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం వేరుచేయడం మొదలు పెట్టాం. లెదర్, జూట్, జరీలను విడివిడిగా తీసి వాటిని అవసరమున్న వాటి దగ్గర వాడేవాళ్లం.
కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బ్యాగ్‌లు తయారు చేయడంతో మా ఉత్పత్తులకు మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో రంగురంగుల హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్, టాట్స్, క్రాస్‌బాడీ బ్యాగ్స్, పాస్‌పోర్టు కవర్స్, సన్‌గ్లాస్ కేసెస్, టిష్యూ బాక్సెస్, హ్యాంగర్స్, ట్రావెల్ పౌచ్‌లు వంటివి అనేకం తయారు చేసి విక్రయిస్తున్నాం.
మనం బతకడానికి పర్యావరణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి పర్యావరణాన్ని ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌తో కాలుష్యమయం చేసేకంటే వాటిని మరో విధంగా వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నాము.
చదవండి: చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ..
Comments
Please login to add a commentAdd a comment