వరి పొలం (ప్రతీకాత్మక చిత్రం)
వరి సాగుకు రసాయనిక ఎరువులు, మంచి నీరు అవసరం లేదు.. శుద్ధిచేసిన మున్సిపల్ మురుగు నీటిని క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా అందిస్తే చాలు.. చక్కని దిగుబడులూ వస్తాయి. ఇలా పండించిన వరి బియ్యంలో ప్రొటీన్ (ప్రొటీన్ రిచ్ రైస్) కూడా అధికంగా ఉంటుంది అంటున్నది జపాన్‌కు చెందిన యమగటా విశ్వవిద్యాలయం.
అంతేకాదు, రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 70% వరకు తగ్గుతాయి అంటున్నారు ‘యమగటా’ శాస్త్రవేత్తలు. అర్బన్ వ్యర్థ జలాల పునర్వినియోగం ద్వారా రసాయనిక ఎరువులను, మంచి నీటిని నూటికి నూరు శాతం ఆదా చేసుకోగలగటం హర్షదాయకం.
ముఖ్యంగా, వరి బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకునే ఆసియా వాసులకు ఇదెంతో శుభవార్త. పైపులైన్ల ద్వారా నేరుగా వేరు వ్యవస్థకు సాగు నీరందించే మెరుగైన భూగర్భ నీటిపారుదల వ్యవస్థ ఉపయోగం గురించి కూడా యమగటా విశ్వవిద్యాలయం పరిశోధించటం విశేషం.
పట్టణాలు, నగరాల్లో జనావాసాల నుంచి వెలువడే మురుగు నీరు కానే కాదు. నిజానికి శుద్ధి చేసి తిరిగి వాడుకుంటే వ్యవసాయానికి ఇది గొప్ప పోషక జలంలా ఉపయోగపడుతుందని తమ పరిశోధనల ద్వారా నిరూపించారు యమగటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జపాన్‌లోని సురుయోకా నగరంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది.
బురదను కంపోస్టుగా మార్చి
జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి హానికారక క్రిములు, భార లోహాలు వంటి కలుషితాలేవీ లేకుండా శుద్ధి చేసి వరి పొలాలకు డ్రిప్ ద్వారా అవసరం మేరకు నిరాటంకంగా అందించాలి. దీనితో పాటు, మురుగునీటిని శుద్ధి చేసే క్రమంలో వెలువడే బురదను కంపోస్టుగా మార్చి, ఆ సేంద్రియ ఎరువును సైతం వరి పొలాల్లో వేసుకుంటే చాలు.
అంతకన్నా ఇంక ఏ ఎరువులూ అవసరం లేకుండా వరి పంటలో చక్కని దిగుబడులు సాధించవచ్చు. ఇందుకోసం వినూత్న నీటిపారుదల వ్యవస్థలను రూపొందించి, పరీక్షించి చక్కని ఫలితాలు సాధించాం అంటున్నారు ‘యమగటా’ పరిశోధకులు.
అర్బన్ మురుగు నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించే వరి నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేశారు. శుద్ధి చేసిన మురుగు నీటిని వరి పొలంలో సాధారణ పద్ధతిలో నీటిని నిల్వగట్టి పంటలు పండించారు. అదేవిధంగా, భూగర్భ పైపుల వ్యవస్థ ద్వారా వరి మొక్కల వేరు వ్యవస్థకు నేరుగా నీటిని పొదుపుగా అందించటం ద్వారా వరి సాగు చేసి పంట దిగుబడులు తీశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. శుద్ధి చేసిన మురుగు నీరు కేవలం నీరు మాత్రమే కాదు, పోషకాలతో కూడిన జలం. తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని నూటికి నూరు శాతం నివారించవచ్చు. బోర్లు లేదా కాలువల ద్వారా ఇప్పుడు వరి సాగుకు వాడుతున్న మంచి నీటిని ఆదా చేసుకొని, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
దిగుబడులు తగ్గే అవకాశం లేదు. రసాయనిక సేద్యంలో పండించిన వరి బియ్యంలో కన్నా ఎక్కువ ప్రోటీన్‌తో కూడిన బియ్యం ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
నీరు నిల్వగట్టి రసాయనాలతో పండించే వరి పొలాల నుంచి విడుదలయ్యే మీథేన్ ఉద్గారాలను 80%, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను కనీసం 60% తగ్గించడానికి ఆస్కారం ఉందని ‘యమగటా’ పరిశోధనల్లో తేలింది. తద్వారా సాంప్రదాయ వరి పొలాల వల్ల పెరిగే భూతాపాన్ని 70% తగ్గించవచ్చని ఈ ప్రయోగాల్లో నిరూపితమైంది.
పట్టణాలు, నగరాల్లో జనావాసాల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతోనే వరి పొలాలకు నీటిని, పోషకాలను అందించడం సాధ్యమేనని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సాంకేతికతపై యమగటా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ(వైపో) నుంచి పేటెంట్ పొందింది.
ప్రొటీన్ గణనీయంగా పెరిగింది
వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొనేందుకు ఈ గ్రీన్ టెక్నాలజీ దోహదపడుతుందని అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ(వైపో) ప్రశంసించింది. ప్రొటీన్ గణనీయంగా పెరిగింది. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధిచేసి వరి సాగులో డ్రిప్ ద్వారా ఉపయోగించినప్పుడు బియ్యంలో ప్రొటీన్లు, రాగి గణనీయంగా పెరిగాయి. పాషాణం సమస్య 50% తగ్గింది.
శుద్ధిచేసిన మురుగు నీటితోపాటు, మురుగు నీటిని శుద్ధి చేసే క్రమంలో వెలువడే బురదతో తయారు చేసిన సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూసారం బాగుంది. లెడ్, జింక్, నికెల్, కాడ్మియం సమస్య రాలేదు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో వ్యర్థజలాలను శుద్ధి చేసుకొని వరిసాగుకు వాడుకోవటం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించవచ్చని మా అధ్యయనంలో నిర్థారణ అయ్యింది.
– నిండియా ఊబా, యమగటా విశ్వవిద్యాలయం, జపాన్
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
చదవండి: తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. 400 బాక్సులతో 200 కేజీల తేనె
Comments
Please login to add a commentAdd a comment