ఎల్లోరా గుహలు గురించి చాలామంది ఎన్నోసార్లు విని ఉంటారు, ఒకటి – రెండు సార్లయినా చూసి ఉంటారు కూడా. ఆ గుహల్లో ఒక శిలాగ్రంథం ఉంది. ఇది శివుడికి అంకితం చేసిన కైలాస్‌నాథ్ ఆలయం. కానీ రామాయణ, మహాభారత గ్రంథాలకు శిల్పరూపం ఈ ఆలయం. ఎల్లోరా గుహల్లో చెక్కిన ఏకరాతి ఆలయమే ఈ కైలాసనాథ్ ఆలయం.
నంబర్ 16... కట్టిపడేసే గుహ
ఎల్లోరా గుహలను ఏ కొండల్లో చెక్కారు? సమాధానం కొంచెం కష్టమే. ఎందుకంటే అవి మనకు ఎల్లోరా గుహలుగానే తెలుసు. ఆ గుహలను చరణాద్రి కొండల్లో చెక్కారు. సహ్యాద్రి శ్రేణుల్లో ఒక భాగం చరణాద్రి కొండలు. మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఎల్లోరా గుహలనగానే బౌద్ధ చైత్య, విహారాలే గుర్తొస్తాయి. కానీ ఈ గుహలు బౌద్ధ, హిందూ, జైన మతాల విశ్వాసాలకు ప్రతీకలు. ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు, 13 నుంచి 29 వరకు హిందూ గుహలు, 30 నుంచి వరకు 34 జైన గుహలు. కైలాస్‌నాథ్ ఆలయం 16వ గుహలో ఉంది. ఇవన్నీ ఏకకాలంలో చెక్కినవి కాదు.
ఎల్లోరా గుహలు వందకు పైగా ఉన్నాయి. కానీ పర్యాటకులకు అనుమతి 34 వరకే. ఇవన్నీ ఒకేసారి చెక్కినవి కాదు. 8, 9,10 శతాబ్దాల్లో చెక్కిన గుహలు. కైలాస్‌నాథ్ గుహాలయాన్ని మాత్రం రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుని కాలంలో క్రీ.శ 756 – 773 మధ్యకాలంలో చెక్కారు. రాజు తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు రాణి ఆయన ఆరోగ్యం కోసం శివుడిని ప్రార్థించిందని, కైలాసాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కిందని చెబుతారు. రాజు ఆరోగ్యవంతుడైన తర్వాత కోకస శిల్పి పర్యవేక్షణలో కైలాస్‌నాథ్ ఆలయం రూపుదిద్దుకుంది. ఎల్లోరా పర్యాటకులు 33 గుహలకు కేటాయించినంత సమయం 16వ గుహలో గడుపుతారు. ఉత్తరాది ఆలయాలను చూసిన కళ్లకు ద్రవిడ శైలిలో చెక్కిన ఈ ఆలయం కనువిందు చేస్తుంది.
.గ్రంథాలకు శిల్పరూపం
ప్రత్యేకించి ఈ ఆలయం పొడవు 164 అడుగులు, వెడల్పు 109 అడుగులు, ఎత్తు 98 అడుగులు. ఏకరాతి ఆలయం అంటే చిన్నదో లేదా ఒక మోస్తరు ఆలయమో అనుకుంటాం. కానీ ఈ ఆలయాన్ని పూర్తిగా శిల్పసౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తిలకించడానికి మూడు గంటలు కేటాయించాలి. భారతీయ శిల్పచాతుర్యానికి గీటురాయి ఇది. ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఒక్కో ΄పార్శ్వంలో ఒక్కో ΄పౌరాణిక గ్రంథాన్ని చూడవచ్చు. 14 కాండల రామాయణం ఒక గోడలో, 18 పర్వాల మహాభారతం మరో గోడలో శిల్పాల రూపంలో ఒదిగిపోయాయి. ఇన్ని ప్రత్యేకతలున్నప్పుడు యునెస్కో గుర్తించకుండా ఉంటుందా? ఎల్లోరాను 1983లోనే గుర్తించింది.
.ఈ సెలవుల్లో వెళ్లాలి!
శిరిడీ, ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరాలు సాధారణంగా వేసవి సెలవుల టూర్ ప్లాన్‌లో ఉంటాయి. కానీ వేసవిలో గుహల్లో పర్యటన కష్టం. గుహలోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ బయటకు రాగానే భరించలేనంత వేడితో సతమతమవుతాం. కాబట్టి దక్కనులో గుహల పర్యటనకు ఈ సీజన్ బాగుంటుంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment