ఇది నారాయణుడి సేవ | Kerala Man distributing free earthen pots to help birds | Sakshi
Sakshi News home page

ఇది నారాయణుడి సేవ

Published Sat, Apr 9 2022 12:03 AM | Last Updated on Sat, Apr 9 2022 12:03 AM

Kerala Man distributing free earthen pots to help birds - Sakshi

పంచడానికి మట్టిపాత్రలు సిద్ధం చేస్తున్న శ్రీరామ్‌ నారాయణన్‌; శ్రీరామ్‌ నారాయణన్‌ పంచిన మట్టిపాత్రలో నీరు తాగుతున్న పక్షులు

వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్‌ కీ బాత్‌’లో నారాయణన్‌ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్‌ నారాయణన్‌ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు.
నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా?


మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్‌ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి?

పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా
పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్‌లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్‌ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్‌ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి?

నారాయణన్‌ ఏం చేశాడు?
కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్‌ నారాయణన్‌కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్‌ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్‌ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్‌ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్‌ పెట్టిన భిక్షే.

ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు
తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్‌ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్‌ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు.

ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్‌కు హోల్‌సేల్‌ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్‌ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్‌ చేస్తుంటాడు.

నారాయణన్‌ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి.
ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం.
 

శ్రీరామ్‌ నారాయణన్‌ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement