గాయం పైకి కనిపిస్తే కట్టు కట్టవచ్చు. లోపల తగిలితే? జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వార్థక్యంలోకి వచ్చిన పెద్దలు అయినవారి నిరాదరణ వల్ల మరింత గాయపడుతున్నారు. వారి బాధను ఎవరు వినాలి?
నర్సుగా పని చేసే షబానా ఈ పెద్దవాళ్ల బాధలను చూసి కరిగిపోయింది. వారికి ప్రేమను పంచుతూ సమాజానికి ట్రీట్మెంట్ ఇస్తోంది. నయమైన సమాజం ఆమెలాగా మారితే ఎంత బాగుంటుంది?
‘పెద్దవాళ్లు తమ పిల్లల నుంచి ఆశించేదేమిటి చెప్పండి’ అంటుంది షబానా. కేరళలోని మలప్పురంకు పన్నెండు మైళ్ల దూరంలో ఉండే తిరురంగడి అనే చిన్న మున్సిపాల్టీలో ఆమె ఇప్పుడు వృద్ధుల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఇద్దరు పిల్లల తల్లి... తనకూ సంసారం బాధ్యతలు ఉన్నాయి. గతంలో డెంటల్ హాస్పిటల్‌లో నర్సుగా చేసేది. ఇప్పుడు మానేసింది. కాని అంతకన్నా ముఖ్యమైన పని చేస్తోంది. అది– వృద్ధులను ఆదరించడం.
‘పెద్దవాళ్లు మహా అయితే ఒక పలకరింపు కోరుతారు. ముఖ్యంగా ఆడవాళ్లు తమ జుట్టును ఎవరైనా నూనె రాసి ముడి వేయాలని, తమకు స్నానం చేయించాలని, తమను ప్రేమగా ఒకసారి హత్తుకోవాలని, తాము చెప్పే మాటలు కాసేపు వినాలని, తమకు ధైర్యం చెప్పాలని, తమతో ఒక సెల్ఫీ దిగాలని, తమకు ఫలానాది ఎవరైనా వొండి పెడితే బాగుండు అని... ఇంతే వారు కోరుకునేది.
దురదృష్టం ఏమిటంటే అది ఇవ్వడానికి కూడా చాలామంది సంతానం నిర్లక్ష్యం చేస్తున్నారు’ అంటుంది షబానా. లాక్‌డౌన్‌కు ముందు షబానా తన నర్సు ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు ఇళ్లల్లో ఉండే వృద్ధురాళ్ల వైద్య అవసరాల కోసం వృత్తిగతంగా కలిసేది. ఆ పని ఏదో ప్రొఫెషనల్‌గా మొక్కుబడిగా కాకుండా ఆత్మీయంగా చేసేది. ఆమె వారికి చాలా నచ్చేది. ఆమె రాక కోసం వారు ఎదురు చూసేవారు.
‘ఏమిటి... ఇలాంటి వారితో ఆదరంగా మాట్లాడే ఒక్క మనిషీ కరువైపోతున్నాడా?’ అని షబానాకు అనిపించింది. అప్పుడే కరోనా లాక్‌డౌన్ వచ్చింది. ఇక చేసిన ఉద్యోగం చాలు అని పూర్తిగా ఆ ఊళ్లోని, చుట్టుపక్కల పల్లెల్లోని వృద్ధురాళ్ల బాధ్యత తీసుకుంది.
‘నేను చూసే స్త్రీలందరూ దాదాపుగా వాళ్ల ఇళ్లల్లోనే అనాథలుగా ఉన్నవాళ్లు. కొడుకులు, కూతుళ్లు నిర్లక్ష్యం చేస్తే ఆ ఇళ్లల్లో ఏదో ఒక మూలన పడి ఉంటారు. అలాంటి వారికి నేను కేర్ టేకర్‌గా మారుతాను. రోజూ వెళ్లి వాళ్లను పలకరిస్తాను. బాగోగులు చూసి వస్తాను. రోజులో ఐదారు గంటలు ఇలాంటి స్త్రీల కోసమే వెచ్చిస్తాను’ అంటుంది షబానా.
అలాగని వాళ్లూ వీళ్లూ ఫోన్లు చేసి ‘మా అమ్మను చూసుకో... మా అత్తగారిని చూసుకో’ అనంటే ఆమె చేయదు.
మరీ ఏ అండా లేని స్త్రీలను, అనారోగ్యంతో బాధ పడుతున్నవారిని, కడుపున పుట్టినవాళ్లు ఇక చూడరు అని నిశ్చయమైనవారిని మాత్రమే ఆమె తన బాధ్యతగా తీసుకుంటుంది. ‘తల్లిదండ్రులు పిల్లల్ని కని తమ ఒంట్లో శక్తి ఉన్నంత కాలం చూస్తారు. పిల్లలు తమ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు వయసుడిగిన తల్లిదండ్రులను చూసుకోవడానికి ఏమిటి నొప్పి?’ అంటుంది షబానా. చాలామంది వృద్ధులతో సమస్య... వారు మంచాన పడి ఉంటే చూసేవారు లేకపోవడం.
అంటే సంతానం ఉన్నా వారికి ఆ పనులు చేయడం ఇష్టం లేక ఖర్మానికి వదిలిపెట్టడం. అలాంటి వారికి కూడా షబానా సేవలు చేస్తుంది. ‘ఒక వృద్ధురాలిని చాలా ఘోరంగా మంచాన పడేసి ఉన్నారు. ఆమె ఉన్న గదిలోకి వెళ్లడానికే భయం వేసేది. ఐదేళ్లుగా ఆమెను నేను చూసుకుంటున్నాను. ఆమె ఎంతో హాయిగా ఉంది’ అంటుంది షబానా.
సేవ చేసే శక్తి, హృదయం అందరికీ ఉండదు.
కాని సొంత తల్లిదండ్రులకు సేవ చేసే ప్రేమ, ఓపిక తప్పక సంతానంలో ఉండాలి. అది లేని చోట షబానా లాంటి వాళ్లు కూడా లేకపోతే ఈ సమాజంలో పెద్దవాళ్లు అంతులేని వేదన అనుభవించాల్సి వస్తుంది.
‘నేను కలిసే వృద్ధులకు ఒక కిట్ ఇస్తాను. అందులో చిరుతిళ్లు, ముఖ్యమైన మందులు ఉంటాయి. దాని విలువ వేయి రూపాయలు ఉంటుంది’ అంది షబానా. అయితే ఇవన్నీ చేయడానికి ఆమెకు డబ్బు ఎక్కడిది? మనసుంటే మార్గం ఉంటుంది.
వారూ వీరూ తాము చేయలేని పని షబానా చేస్తున్నదని ఆమెకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. షబానా తిరురంగడిలో సూర్యునితో పాటు నిద్ర లేస్తుంది. ఆమె వస్తే తప్ప టిఫిన్ తినని వారు, చిరునవ్వు నవ్వని వారు ఎందరో ఆ ఊళ్లో ఉన్నారు. షబానాను చూసి ప్రతి ఊరూ ఒక ఆదరాలయంగా మారితే ఎంత బాగుణ్ణు.
చదవండి: Bihar: ఆర్టిస్టు అవుతావా అని హేళన.. ఇప్పుడు లక్షల్లో సంపాదించడమే గాక 25 మందికి ఉపాధి!
Comments
Please login to add a commentAdd a comment