
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆదివారం (తెల్లవారుజామున)ఏర్పడనుంది. పంచాంగం ప్రకారం..అక్టోబర్ 29న తెల్లవారు జామున 1:05 గంటలకు ఏర్పడే గ్రహణం 2:22 గంటల వరకూ ఉంటుంది.మొత్తం గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందని దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని అర్చకులు చెబుతున్నారు.
ఈ గ్రహణం భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కనిపిస్తుంది. గ్రహణ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. సూతక్ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయవద్దు. ఇది అశుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతుంటారు. మరి ఎలాంటి పనులు చేయకూడదు? గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏ పనులు చేయకూడదు?
►చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఆ సమయంలో తింటే ఆహారం కలుషితమై ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం.
► గ్రహణం సమయంలో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చేయకూడదు.
► చంద్రగ్రహణం సమయంలో దేవతామూర్తుల విగ్రహాలు, దేవాలయాలు మొదలైన వాటిని తాకడం నిషిద్ధం.
► చంద్రగ్రహణం సూతకాల సమయంలో నిద్రించడం నిషేధం. అయితే, రోగులు, వృద్ధులు, పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఉంది.
► గ్రహణ సమయంలో దానధర్మాలు చేస్తే శుభం కలుగుతుందని అంటారు
► గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా నదీస్నానం లేదా ఇంట్లోనే స్నానం చేయాలి.
ఏం దానం చేస్తే మంచిది?
► చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు.
► చంద్రగ్రహణం తర్వాత పాలను దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతారని చెబుతారు. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారని నమ్మకం.
► అన్నం, బియ్యాన్ని దానం చేసినా అది సత్ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
► వెండిని దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందని భావిస్తారు.
► చంద్రగ్రహణం తర్వాత పంచదారని నైవేద్యంగా సమర్పించడం వల్ల సానుకూల ప్రభావం చూపుతుందని, ఇది సంపదను, శ్రేయస్సును కలిగిస్తుందని భావిస్తారు.
గర్భిణిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సూర్యుడు, చంద్రుడు కదలిక లేదా స్థాన మార్పు ఒక వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గర్భిణీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గ్రహణం సమయంలో గర్భిణీలు చేయకూడని పనులను జ్యోతిష్య శాస్త్రంలో నొక్కిచెప్పారు. చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదని అంటారు. దీనివల్ల పిల్లలు వైకల్యంతో పుడతారని నమ్మకం ఉంది. గ్రహణం గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బలంగా విశ్వసిస్తారు. కత్తి వంటి పదునైన వస్తువులను ప్రెగ్నెంట్ స్త్రీలు ఉపయోగించరాదని చెబుతారు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాల్సిందిగా పెద్దలు చెబుతారు.