భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న తల్లుల్లో 50 శాతం మంది ఈ కరోనా వల్ల తమలో ఆందోళన, ఒత్తిడి పెరిగాయని ‘లింక్‌డ్ ఇన్’ తాజా సర్వేలో చెప్పారు. ఇంటి పని, ఆఫీసు పని, పిల్లల పెంపకం వారిని తీవ్రమైన వొత్తిడిలో ఉంచుతోంది. మగవారి పని కూడా ఈ కాలంలో పెరిగినా 38 శాతం మంది మాత్రమే తమకు ఒత్తిడి ఉందని చెప్పారు. రోగ నిరోధక శక్తిని పీల్చేసే ఈ యాంగ్జయిటీ వారికి ఏ మాత్రం క్షేమకరం కాదు.
డాక్టర్ శారద హైదరాబాద్‌లో గవర్నమెంట్ పీడియాట్రిషియన్. ఆమె పని చేసే హాస్పిటల్‌ను కోవిడ్ హాస్పిటల్ చేశారు. కోవిడ్ వచ్చిన పిల్లలను ఆమె చూడాలి. ఒక వారం ఒక షిఫ్ట్ మరో వారం మరో షిఫ్ట్ పని చేస్తోంది. కాని ఇంటికి వెళ్లడానికి కరోనా వ్యాప్తి వల్ల భయం వేసి ఇంటికి దగ్గరే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటోంది. ఒక పాప ఆమెకు. ఆమె ఆలనా పాలనా గురించి ఒక వొత్తిడి. ఉద్యోగంలో వొత్తిడి. భర్త సహకరిస్తున్నా ఇంటి పనుల్లో తను భాగం కాలేకపోవడం, లేదా దగ్గరుండి చూసుకోలేకపోవడం మరో వొత్తిడి. ఉద్యోగం ముఖ్యం. ఇల్లూ ముఖ్యమే. ఈ వొత్తిడిని ఎలా దాటాలో ఆమెకు అర్థం కావడం లేదు.
రత్నలీల సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. మార్చి నుంచి ఇంటి దగ్గరే పని చేస్తోంది. ఇద్దరు పిల్లలు. పదేళ్లు. ఎనిమిదేళ్లు. వాళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా భయంతో పనిమనిషిని మాన్పించారు. భర్త తన ఉద్యోగంలో పని గంటలు తగ్గించుకుని ఇంటి అవసరాలు చూస్తున్నా మూడు పూటలా తప్పక వండాల్సి రావడం ఆమెకు శ్రమ అవుతోంది. ఆమె ఉదయం పదింటికి లాగిన్ కావాలి. ఆ సమయంలోనే పిల్లలు ఆన్‌లైన్ క్లాసుల్లో కూచుంటారు.
కాని వాటిని సరిగా వినరు. వాళ్లను అజమాయిషీ చేయాలి. మధ్యలో వంట చేయాలి. ఆఫీసు వారికి సమాధానం చెప్పాలి. ఇంతకు ముందైతే పిల్లలు స్కూల్లోనే స్కూలు వాళ్లు పెట్టే భోజనం చేసేవారు. చాలాసార్లు రాత్రిళ్లు బయటి నుంచి భోజనం తెప్పించుకునేవారు. ఇప్పుడు కరోనా వల్ల ఆ బరువంతా ఆమె మీదనే పడింది. అంట్లు ఒక పెద్ద సమస్య. అసలే ఆమెకు థైరాయిడ్ ఉంది. ఇన్ని సతమతాల మధ్య ఆమె తక్కువగా నవ్వుతోంది.
∙∙
శ్రావణి గవర్నమెంట్ స్కూల్ టీచర్. భర్త చిన్న ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. కరోనాకు ముందు ఉదయాన్నే వండి పిల్లలకు, భర్తకు బాక్స్‌లు కట్టిస్తే మళ్లీ సాయంత్రం అందరూ కలిసేవారు. ఇప్పుడు కరోనా వల్ల భర్త ఉద్యోగం ఊడేలా ఉంది. పిల్లలు ఇంట్లో క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. తను స్కూల్‌కు వెళ్లిరావాల్సి వస్తోంది. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. కరోనా నుంచి కాపాడుకుంటూ వెళ్లి రావాలి. స్కూల్లో పిల్లలు లేకపోయినా ఇతర టీచర్లకు ఒకరి నుంచి ఒకరికి ప్రమాదం ఉంటుంది. ఉద్యోగం కాపాడుకోవాలి. పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారో అడుగడుగునా గమనించుకోవాలి. ఇదంతా ఎవరికీ చెప్పుకోలేదు. లోలోపల పడటం తప్ప.
గృహిణిగా స్త్రీకి ఇంటి గురించి ఒక సగటు వొత్తిడి ఉంటుంది. ఇక ఉద్యోగం చేసే స్త్రీకైతే ఈ వొత్తిడి మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కరోనా దీనికి జతైంది. అందుకే భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న వివాహితలు 50 శాతం మంది ఆందోళన, వొత్తిడి ఎదుర్కొంటున్నామని ‘లింక్‌డ్‌ఇన్’ చేసిన తాజా సర్వేలో తెలియచేశారు. లింక్‌డ్‌ఇన్ క్రమానుగతంగా ప్రకటించే ‘వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ తాజా నివేదికలో ఈ విషయం ప్రకటితమైంది. జూలై 23 నుంచి ఆగస్టు 27 వరకు చేసిన ఈ సర్వేలో 2,254 మంది ఉద్యోగం చేసే వివాహితలు పాల్గొన్నారు.
ఈ సర్వే ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ తన పిల్లలకు కావలసిన పూర్తి సమయం కేటాయించగలుగుతోంది. కాని పురుషుల్లో ప్రతి 5 మందిలో ఒక్కరే ఈ పని చేస్తున్నారు. ప్రతి ఐదు మంది స్త్రీలలో ఇద్దరు ఇంటి పని ఆఫీసు పని పూర్తిగా తెమల్చడానికి పురుషులతో పోల్చితే రెట్టింపు పని గంటలు చేస్తున్నారు. అంటే డబుల్ డ్యూటీ చేస్తున్నారు. పిల్లలను చూసుకోమని వారినీ వీరిని అడగడానికి కేవలం 20 శాతం మంది స్త్రీలు ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో పురుషుల శాతం 32 ఉంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో 46 శాతం మంది పొద్దు పోయేదాకా పని చేస్తున్నారు. 42 శాతం మంది పిల్లలు ఇంట్లో, తమ చుట్టూ ఉండటం వల్ల పని మీద ఫోకస్ చేయలేకపోతున్నామని స్ట్రెస్ ఫీలవుతున్నారు.
ఆర్థిక అవసరాల రీత్యా స్త్రీ, పురుషుల తప్పక పని చేయాల్సిన ఈ సందర్భాలలో మారిన కరోనా పరిస్థితుల వల్ల స్త్రీలు నిరాఘాటంగా వొత్తిడిలో ఉండటం వారి ఆరోగ్యానికి ఏమంత క్షేమం కాదు.
పురుషులు కూడా వారి సమస్యల్లో వారున్నా మొత్తంగా ఇంటిని కాపాడుకోవడానికి ఇరువురూ కలిసి మరింత సమన్వయంతో ఏం చేసుకోవచ్చో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరి నుంచి మద్దతు పొందాలి, ఏ పని తగ్గించుకోవాలి, లీవ్‌లు పెట్టే వీలు, ఉద్యోగం కాపాడుకుంటూనే తాత్కాలిక విరామం తీసుకునే వీలు, పిల్లలకు పరిస్థితులను అర్థమయ్యేలా చెప్పి వారి నుంచి సహకారం పొందాల్సిన అవసరం, రోజువారి పనికి ప్రత్యామ్నాయాలు ఇవన్నీ తప్పనిసరిగా చర్చించుకొని ప్లాన్ చేసుకోవాలి.
పని యంత్రాలుగా మిగలడానికి స్త్రీ, పురుషులు జన్మించలేదు. ఇరువురికీ మానసిక వికాసం కావాలి. ఆహ్లాదం కావాలి. పిల్లలతో సమయం గడపడం కావాలి. అందరూ కలిసి మనం ఒకరి కోసం ఒకరు అనే భావన తెచ్చుకోవాలి. కుటుంబం కోసం నువ్వు ఇదంతా పడక తప్పదు అని కుటుంబం స్త్రీకి సంకేతాలు ఇచ్చినా, కుటుంబం కోసం నేనిదంతా ఎందుకు పడాలి అనే అసహనం స్త్రీకి కలిగినా సమస్య మానసిక స్థాయి నుంచి భౌతికస్థాయికి చేరుతుంది. కుటుంబ బంధాలకు సవాళ్లు ఎదురవుతాయి.
ఈ కరోనా కాలంలో ఈ అదనపు సమస్యలు ఏ మాత్రం వాంఛనీయం కావు.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment