‘నిదుర పోరా తమ్ముడా’ అని పాడింది లతా మంగేష్కర్. ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ అన్నాడు ఆత్రేయ. ‘నిదర ముదర పోయాక పాడె వొక్కటే వల్లకాడు ఒక్కటే’ అన్నాడు జాలాది. నిజమే. నిద్ర పట్టాక, గాఢంగా నిద్ర కమ్ముకున్నాక మనం ఎక్కడ పడుకున్నామో ఎక్కడ తెలుస్తుంది? అందుకే నిద్ర సుఖమెరగదు అన్నారు పెద్దలు. అదేం ఖర్మోగాని రైలెక్కితే నిద్ర పోవాలనిపిస్తుంది. బెర్తులున్నవారు చక్కా తొమ్మిది దాటగానే దుప్పట్లు పరుచుకుని, కప్పుకుని గుర్రుపెడతారు. మరి జనరల్‌లో ఉన్నవారో?పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుంటుంది. మన రైల్వే వారు జనరల్ కంపార్ట్‌మెంట్‌కు ఇదే సూత్రం అప్లై చేస్తారు. ఎంతమందెక్కినా ఏదో ఒక మూల కూలబడతారని టికెట్లు తెగ ఇస్తారు. ఎక్కాక బాత్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా వీల్లేని తాకిడి.
జనరల్‌లో ఎవరెక్కుతారు? బీదసాదలు. కాయకష్టం చేసి సొంత ఊరికో, ఏదో కొంపలంటుకు పోయే వర్తమానం అందినందుకో అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని ఎక్కుతారు. లేకపోయినా ఎక్కుతారు. నిద్రకు టికెట్‌తో పని లేదు. కిటికీల్లో నుంచి చల్లగాలి తగులుతుంటే, వెళ్లే రైలు ఊయల వలే ఊగుతుంటే ఎలాగైనా చోటు చూసుకుని పడుకో అంటుంది.రెండు బెర్తుల మధ్య కింద పడుకునేవారు ఎప్పుడూ కనపడతారు. లగేజ్ స్టాండ్ ఎక్కి నిద్రపోయేవారు కూడా మన దేశంలో విరివిగా విస్తృతంగా ఉన్నారు. అయితే ఈ కుర్రవాడు మాత్రం అసాధ్యుడు. పైన ఉన్న రెండు బెర్తులకు దుప్పటి కట్టి ఒక బెర్తు సృష్టించాడు. ఆ తర్వాత దానిలోకి జారి ఒళ్లెరగని నిద్రపోయాడు.
హాతిమ్ ఇస్మాయిల్ అనే కేరళ ట్రావెలర్ ఈ వీడియో తీసి పోయిన నెల ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఇప్పటికి 10 లక్షల లైక్స్ వచ్చాయి. అంత మంచి సెటప్ చేసుకుని నిద్రపోతున్నవాణ్ణి చూసి కొందరు కుళ్లుకున్నారు. కొందరు దుప్పటి నాణ్యతను శ్లాఘించారు. మరికొందరు ఇకపైన స్లీపర్ బుక్ చేసుకోకుండా ఇదే ఫార్ములా వాడుతానని అన్నారు. ఆగ్రా రైలు ఇలాగే ఉంటుందని మరొకరు అన్నారు.ఈ మధ్య జనరల్ కంపార్ట్‌మెంట్‌లు పెరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. జనరల్ కంపార్ట్‌మెంట్‌లు ఎందుకు తక్కువ ఉంటాయో రైల్వేవారు ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వాలకు ఓట్లు కావాలి. వారి మాటలకు పగటి కలలు చూసే జనం బోగీల్లో ఇలాంటి నిద్రకే ఉపక్రమించాలి.
(చదవండి: కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం)
Comments
Please login to add a commentAdd a comment