ఆఫీసుల్లో సాధారణంగా సెలవు కావాలంటే.. పంటి నొప్పి నుంచి ఈ లోకంలో లేనివారి చావు వరకూ చాలా కథలే వినిపిస్తుంటాయి. అయితే తైవాన్ కి చెందిన ఓ బ్యాంక్ క్లర్క్.. కేవలం సెలవు కోసం ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకుని, మూడు సార్లు విడాకులు ఇచ్చాడు. తైవానీస్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి వివాహానికి 8 రోజుల వేతన సెలవులు(పెయిడ్ లీవ్స్) పొందే హక్కు ఉంది. దాని ప్రకారం సదరు హీరో.. గత ఏడాది ఏప్రిల్ 6న పెళ్లి చేసుకుని పెయిడ్ లీవ్స్ పొందాడు. అయితే.. 8వ(చివరి) రోజు తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆ మరునాడే మళ్లీ పెళ్లి అంటూ మరో 8 రోజుల పెయిడ్ లీవ్స్‌కి అప్లై చేసుకున్నాడు. ఇలా 37 రోజుల్లో 4 సార్లు పెళ్లి, 3 సార్లు విడాకులతో 32 రోజులు సెలవులు తీసుకున్నాడు.
ఇతగాడి గారడీలను గుర్తించిన సదరు బ్యాంక్.. ఆ సెలవులకు అనుమతించకపోవడంతో న్యాయం చెయ్యాలంటూ తైపీ సిటీ లేబర్ బ్యూరోని ఆశ్రయించాడు ఆ పెళ్లికొడుకు. దర్యాప్తు ప్రారంభించిన బ్యూరో.. బ్యాంక్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిందని అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో యజమానికి 7వందల డాలర్లు జరిమానా కూడా విధించింది. ‘లేబర్ లీవ్ రూల్స్’ ఆర్టికల్ 2 ప్రకారం ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టంలోని లూప్ హోల్స్ ఉపయోగించుకున్నప్పటికీ.. దాన్ని కారణంగా తీసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే వాదోపవాదాల నడుమ బ్యాంక్‌కి, క్లర్క్‌కి జరిగిన సమరంలో ఈ ఏడాది ఏప్రిల్ 10న బ్యూరో మరో తీర్పునూ వెలువరించింది. బ్యాంక్ క్లర్క్ ప్రవర్తన అనైతికం అయినప్పటికీ.. గతంలో ఇచ్చిన తీర్పును అయిష్టంగానే సమర్థించుకుంటూ ‘అతను చట్టాన్ని ఉల్లంఘించలేదు’అని స్పష్టం చేసింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment