May Day 2022: History In Telugu, Significance Of International Labour Day - Sakshi
Sakshi News home page

May Day Special Story: నెత్తుటి జెండాలు ఎగిసిన రోజు..

Published Sun, May 1 2022 1:42 PM | Last Updated on Sun, May 1 2022 2:09 PM

May Day Special Story In Sakshi Funday

షికాగోలోని మేడే స్మారక స్థూపం వద్ద వ్యాసకర్త

19వ శతాబ్దం.. పారిశ్రామిక విప్లవాల కాలం..
రోజుకి 14, 15 గంటల పని. దుర్భరం.. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో రారో తెలియదు.. వందలు, వేల మంది చచ్చి శవాలవుతున్నారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్‌ 7న షికాగో సదస్సు. సంఘటిత వాణిజ్య వ్యాపార సంస్థల కార్మిక సంఘాల సమాఖ్య (ఆ తర్వాత ఇదే అమెరికా కార్మిక సమాఖ్య–ఏఎఫ్‌ఎల్‌) ఇందుకు నడుంకట్టింది. 8 గంటల పని దినమని నినదించింది.

అమెరికా, కెనడా ప్రభుత్వాలకు రెండేళ్ల గడువిచ్చింది. 1886 మే 1 నుంచి అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చింది. లేకుంటే సమ్మేనని హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లోని సోదర కార్మిక సంఘాలకూ ఈ సందేశం పంపింది. అప్పటికే ఆస్ట్రేలియా కార్మికవర్గం 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి నినాదాన్ని అందుకుంది. లండన్, ప్యారిస్‌ వంటి యూరోపియన్‌ నగరాలు 8 గంటల పని దినం కోసం గొంతెత్తాయి. అనుకున్నట్టుగానే 1886 మే 1న ఉదయం 10 గంటలకు షికాగోలో సమ్మే మొదలై అమెరికా అంతటా అమలైంది. 13 వేల సంస్థల మూత..  24 గంటల్లో సమ్మె చేస్తున్న కార్మికుల సంఖ్య 4 లక్షలకు చేరింది.

ఒక్క షికాగాలోనే 40 వేల మంది కార్మికులు.. భార్యాబిడ్డలతో ర్యాలీ.. బ్యానర్లు, ఎర్రజెండాల రెపరెపలు.. మిన్నంటిన నినాదాలు.. హోరెత్తిన ప్రసంగాలు.. వీధులు మార్మోగాయి. మర్నాటికి ఉధృతి మరింత పెరిగింది. సమ్మె మూడో రోజున అంటే మే 3న హే మార్కెట్‌ నుంచి ప్రదర్శన మెక్‌ కార్మిక్‌ రీపర్‌ వర్క్స్‌ వద్దకు చేరింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. వందలాది మంది నెత్తుటి మడుగుల్లో గిలగిల్లాడారు. (అధికారిక లెక్క మాత్రం ఒకరి మృతి..60 మంది క్షతగాత్రులు) ఈ ఘాతుకాన్ని సంఘం నిరసించింది. మర్నాడు ర్యాలీ జరపాలని నిర్ణయించింది.

మే 4.. 1886. సాయంత్రం.. హే మార్కెట్, రాన్‌డాల్ఫ్‌ స్ట్రీట్‌ (175 ఎన్‌. డెస్‌ ప్లెయిన్స్‌ స్ట్రీట్‌) కిక్కిరిసింది.  మీటింగ్‌ మొదలైంది. ఓ వ్యాగన్‌నే వేదిక చేసుకున్న కార్మిక నాయకులు ప్రసంగాలు చేశారు. చివరి వక్త ఆగస్ట్‌ స్పైస్‌ సభను ముగించబోతున్నారు. ఇంతలో ఖాకీలు కయ్యానికి కాలుదువ్వారు. లాఠీలతో కార్మికులను కుళ్లబొడిచారు. తుపాకులతో నెత్తురు కళ్ల జూశారు. సరిగ్గా ఆ సమయంలో జనంపై బాంబు.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు విసిరారో తెలియదు. ఒక సార్జెంట్‌ మృతి.. కార్మికులు, పోలీసుల బాహాబాహీ. యుద్ధ రంగాన్ని మించిన బీభత్సం. ఏడుగురు పోలీసులు, 8 మంది కార్మికులు చచ్చిపోయారు. హే మార్కెట్‌  కార్మికుల రక్తంతో తడిసి ముద్దయింది. షికాగో స్తంభించింది. 15 మంది కార్మికనేతలపై కేసు నమోదైంది. 8 గంటల పనని అరవడమే నేరమైంది. వీళ్లలో 8 మందిపై అరాచక వాదులని ముద్ర వేశారు.

అమ్ముడుపోయిన జ్యూరీ..
1886 ఆగస్టులో విచారణ మొదలైంది. జ్యూరీ డబ్బున్న వాళ్లకు చుట్టమైంది. ఆ 15 మందిలో ఏడుగురికి ఉరిశిక్ష, మిగతా 8 మందికి 15 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష. 1886 చివర్లో నలుగురు నాయకులు.. పార్సన్స్, స్పైస్, ఫిషర్, ఏంజిల్‌ను ఉరితీశారు. ఒక నాయకుడు జైల్లోనే నోట్లో పేలుడు పదార్థం పెట్టుకొని పేల్చేసుకున్నాడు. జ్యూరీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మిగతా ముగ్గురికి క్షమాభిక్ష పెట్టారు. ఆరేళ్ల తర్వాత విడుదల చేశారు. ఈ ఉరితీతలు ప్రపంచాన్ని కుదిపేశాయి.

మే డేను ప్రకటించిన రెండో ఇంటర్నేషనల్‌...
కమ్యూనిస్టులు, సోషలిస్టులు, లేబర్‌ పార్టీలు, ఇతర ప్రగతిశీల శక్తులతో ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఏర్పాటైంది. అది 1876లో రద్దయింది. తిరిగి రెండో ఇంటర్నేషనల్‌ 1889లో మొదలైంది. ఈ సంస్థే మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా, మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. హే మార్కెట్‌ అమరవీరుల త్యాగానికి తర్పణాలు పట్టింది. వారి త్యాగాన్ని కీర్తిస్తూ 1890 మే 1న ర్యాలీలు జరపాలని పిలుపిస్తే ఒక్క లండన్‌లోనే 3 లక్షల మందితో ప్రదర్శన జరిగింది. ఆ తర్వాతే కార్మికవర్గ చరిత్రలో ‘మే డే’ భాగమైంది. 66 దేశాలు అధికారికంగా, మరికొన్ని అనధికారిక సెలవునిస్తున్నాయి. కానీ, ఎక్కడైతే పోరు ప్రారంభమైందో ఆ దేశమైన అమెరికా మాత్రం ఇప్పటికీ మేడేని గుర్తించలేదు. సెప్టెంబర్‌లో వచ్చే తొలి శుక్రవారాన్ని అమెరికా లేబర్‌ డేగా ప్రకటించింది. మే 1ని న్యాయ దినోత్సవంగా ప్రకటించింది.

1923 నుంచీ..
మన దగ్గర 1923 దాకా  మేడే జరగలేదు. 1923 మే 1న హిందూస్థాన్‌ లేబర్‌ కిసాన్‌ పార్టీ నాయకుడు సింగారవేల్‌ నాయకత్వంలో మద్రాస్‌లో తొలిసారి ప్రదర్శన జరిగింది. 

హై మార్కెట్‌ ఇప్పుడెలా ఉందంటే..
2021 మార్చి 9.. మంగళవారం సాయంత్రం 6.40 గంటలు.. షికాగోలోని మేడే స్మారక స్థూపాన్ని చూడాలన్న కోర్కె నెరవేరిన రోజు. డౌన్‌ టౌన్‌లోని 175 ఎన్‌. డెస్‌ ప్లెయిన్స్‌ స్ట్రీట్‌. కార్మికుల రక్తంతో తడిసిన హే మార్కెట్‌ ప్రాంతమదే. ఆ స్థూపాన్ని చూడడంతోనే.. మేడే నేడే పాట చేవుల్లో మార్మోగింది. మైళ్ల పొడవునా ఆంధ్రాలో జరిగిన మేడే ర్యాలీలు మదిలో మెదిలాయి. 

పోరు జరిగిన ప్రాంతంలో స్థూపం ...
నాడు.. కార్మిక నాయకులు వ్యాగన్‌ మీద నుంచి చేసిన ప్రసంగం స్ఫూర్తితోనే మేరీ బ్రొగ్గర్‌ అనే శిల్పి ఈ స్థూపాన్ని తయారు చేశారు.  భావప్రకటనా స్వేచ్ఛ, సభలు జరుపుకునే హక్కు, కార్మికులు సంఘటితమయ్యే స్వేచ్ఛ, 8 గంటల పని దిన పోరు, చట్టం, న్యాయం.. ఇలా మానవ హక్కుల్లోని ప్రతి కోణాన్నీ ఈ స్థూపం ఆవిష్కరిస్తుంది. ఒక వీరుడు నెలకొరుగుతుంటే మరో వీరుడు ఆదుకునేలా, కార్మిక శక్తే పునాదిగా నిర్మించిన వేదికపై ముగ్గురు నాయకులు నినదిస్తున్నట్టుగా ఉంటుందీ  చిత్రం.  హే మార్కెట్‌ అమరవీరుల మాన్యుమెంట్‌.. 1893లో షికాగో శివార్లలోని ఫారెస్ట్‌ పార్క్‌ స్మశానంలో ఏర్పాటయింది. ఇదే తొలి స్థూపం. ‘మీరు ఈవేళ మా గొంతు నులిమారు సరే. కానీ మా మౌనం విస్పోటంలా వినిపించే రోజొకటి వస్తుంది’ అని ఆ స్థూపం శిలాఫలకంపై ఉంటుంది.

కార్మికుల పోరాట శక్తి ఏమైంది?
సోషలిస్టు దేశాల పతనం, ప్రపంచీకరణ, కెరియరిజం నేపథ్యంలో పని గంటల ఊసు ఆరివైపోయింది.  చివరకు కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కుకూ కష్టకాలం వచ్చింది. ఇండియాలో 44 కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రతిఘటించాల్సిన కార్మిక వర్గం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కార్మిక, కర్షక, అణగారిన బడుగు, బలహీన వర్గాలు చేయి చేయి కలిసినడిచేది ఎన్నడో..  ఆ రోజు కోసం ఎదురు చూస్తూ షికాగో అమరవీరులకు జోహార్లు.
- ఏ.అమరయ్య  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement