Roohani Maryam: కార్లపై యాసిడ్‌ పోసి బెదిరించేవాళ్లు | Miss Detailer Roohani Maryam She Polishes Cars And Breaks Taboos In Iran | Sakshi
Sakshi News home page

Roohani Maryam: కార్లపై యాసిడ్‌ పోసి బెదిరించేవాళ్లు

Published Thu, May 6 2021 1:02 PM | Last Updated on Thu, May 6 2021 1:02 PM

Miss Detailer Roohani Maryam She Polishes Cars And Breaks Taboos In Iran - Sakshi

ఈశాన్య ఇరాన్‌ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామం అఘ్‌మజర్‌ .. యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, వాళ్లను పెద్దచేయడమే అక్కడి అమ్మాయిల జీవితంలో ముఖ్యమైన అంశం. ఇలాంటి సమాజంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మరియం రుహానీ తండ్రి ప్రోత్సాహంతో సమాజాన్ని కూడా ఎదిరించి తను అనుకున్న రంగంలో దూసుకుపోతూ ‘మిస్‌ డీటెయిలర్‌’గా ఎంతోమంది మన్నలను పొందుతోంది రుహానీది మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండేవి.

దీంతో తండ్రికి సాయం చేసేందుకు బ్యూటీషియన్‌ కోర్సు చేసి హెయిర్‌ డ్రెస్సర్‌గా, మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసేది. తనలోని ఆర్టిస్టును మాత్రం కార్లను కొత్తగా,అందంగా తీర్చిదిద్దాలనే కోరిక ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. దీంతో తన కలను నిజం చేసుకునేందుకు మరియం తాను కష్టపడి పొదుపు చేసి దాచుకున్న డబ్బుతో పాత కార్లు కొని వాటిలోని లోపాలను సరిచేసి, కొత్త వాటిలాగా తీర్చిదిద్ది కొంత లాభానికి విక్రయించడం ప్రారంభించింది.

తండ్రి ప్రోత్సాహంతో..
చుట్టూ ఉన్న సమాజం, బంధువులు వేలెత్తి చూపినప్పటికీ తండ్రి ప్రోత్సహించడంతో.. పెళ్లికి సంబంధించి తమ సమాజపు నియమాలను పక్కన పెట్టి మరీ కార్‌ పాలిషింగ్‌ కోర్సు చదవాలని నిర్ణయించుకుంది మరియం. అయితే ఇరాన్‌ లో ఎక్కడా కార్‌ పాలిషింగ్‌ కోర్సు నేర్పే సంస్థలు లేవు. దీంతో ఆమె టర్కీ వెళ్లి కార్‌ పాలిషింగ్‌ కోర్సు నేర్చుకుని సర్టిఫికెట్‌ సంపాదించింది.

సర్టిఫికెట్‌ చేతికి రాగానే, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో కొద్దిపాటి స్థలాన్ని అద్దెకు తీసుకుని మరియం గ్యారేజిని ప్రారంభించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి కస్టమర్లంతా మరియం గ్యారేజికి క్యూ కట్టేవారు. అమ్మాయి నడిపిస్తోన్న మొదటి గ్యారేజ్, ‘తొలి ఫిమేల్‌ కార్‌ డీటెయిలర్‌’ అంటూ కస్టమర్లు మరియం గ్యారేజ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టేవారు. అలా...అలా ఆమె గ్యారేజ్‌ గురించి ఎంతో మందికి తెలిసింది. ప్రస్తుతం ఇరాన్‌లో మరియంను‘‘మిస్‌ డీటెయిలర్‌’’ అని పిలుస్తున్నారు. అయితే ఈ ఆనందం వెనుక ఎన్నో కష్టనష్టాలు కూడా ఉన్నాయి.

స్త్రీల హక్కులు, అభిప్రాయాలకు అంతగా విలువివ్వని సమాజం అది. అందుకే ప్రారంభంలో వేరే గ్యారేజీల వాళ్లు మరియంను చాలా చులకనగా చూసేవారు. కొన్నిసార్లైతే ఆమె గ్యారేజ్‌కు వచ్చిన కార్లపై యాసిడ్‌ పోసి తనని బెదిరించేవాళ్లు. చేసేదేమీ లేక మరియం గ్యారేజిని మూసేసింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఆటో కంపెనీ ఒకటి మరియంకు ఉద్యోగం ఇస్తాననడంతో అక్కడ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూ తనలాగా ఆసక్తి ఉన్న మరికొంత మంది అమ్మాయిలకు కార్‌ పాలిషింగ్, వాషింగ్‌లలో శిక్షణ నిస్తోంది.

‘‘ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌ దేశం దిగుమతుల్ని ఆపేయడంతో.. కార్ల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఆర్థిక సంక్షోభం, మరోపక్క కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ గ్యారేజీ పెట్టే అవకాశంలేదు. అయినా సరే,‘‘నేను భవిష్యత్‌లో యూరప్‌లో ఒక గ్యారేజిని పెడతాను’’ అని ధీమాగా చెబుతోంది మరియం.
చదవండి: Matrimonial Fraud: జాగ్రత్తగా చేరుకున్నావా డియర్‌! 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement