మనం ఇప్పటివరకు ఎన్నోరకాల కార్లను గురించి విన్నాము, అలాగే చూశాము కూడా. కానీ ఈ వింతైన కారు గురించి విన్నారా! చూస్తే అచ్చం కెమెరా మాదిరిగా ఉంటుంది. ఇందులో డ్రైవర్ లేకుండా, నిద్రపోతూ కూడా ప్రయాణం చేయవచ్చట. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా!
ఇది అలాంటిలాంటి కారు కాదు. చక్రాల మీద నడిచే హోటల్ గదిలా ఉంటుందిది. దీనికి డ్రైవర్ కూడా అవసరం లేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించేలాంటి ఈ డ్రైవర్‌లెస్ కాన్సెప్ట్ కారుకు ‘స్విఫ్ట్ పాడ్’ పేరుతో జర్మన్ కంపెనీ ‘జోయియో’కు చెందిన నిపుణులు రూపకల్పన చేశారు.
ఇందులో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. కూర్చోవడం బోరు కొట్టినప్పుడు లేదా నిద్రపోవాలనిపించినప్పుడు ఈ సీట్లను పరిచేసుకుంటే, అవి మంచాల్లా మారిపోతాయి. నిద్రపోతూ కూడా సుదూర ప్రయాణాలు సాగించడానికి వీలుగా ‘జోయియో’ నిపుణులు ఈ కారుకు రూపకల్పన చేయడం విశేషం. ఇందులోని నేవిగేషన్ సిస్టమ్ ద్వారా చేరుకోవలసిన దూరాన్ని, సమయాన్ని సెట్ చేసుకుంటే, అందుకు అనుగుణంగా ఈ కారు తన వేగాన్ని పుంజుకుంటుంది.
కాస్త తీరిక ఉంటే, మార్గమధ్యంలో ఆగాల్సిన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటే, ఈ కారు ఆయా ప్రదేశాల్లో ఆగుతూ, కోరుకున్న రీతిలో ప్రయాణం సాగిస్తుంది. ఈ కారును ఎప్పుడు అందుబాటులోకి తేనున్నదీ ‘జోయియో’ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఇవి చదవండి: కొత్త టెక్నాలజీ పరికరాలతో ఆరోగ్య సమస్యలకు చెక్..
Comments
Please login to add a commentAdd a comment