ప్రేమించే జీవితం..: వాయిదా వేసిన కలలు... నిజం చేసుకుంటున్న వేళ.. | Mukta Singh Started Modelling at 58 | Sakshi
Sakshi News home page

ప్రేమించే జీవితం..: వాయిదా వేసిన కలలు... నిజం చేసుకుంటున్న వేళ..

Published Sun, Jul 10 2022 1:15 AM | Last Updated on Sun, Jul 10 2022 1:17 AM

Mukta Singh Started Modelling at 58 - Sakshi

ముక్తాసింగ్‌, మోడల్‌గా ముక్తాసింగ్‌

పురుషులతో పోల్చితే స్త్రీల కలలు ఎప్పుడూ వెనకబాటులోనే ఉంటాయి. కుటుంబ బాధ్యతల కారణంగా తమ కలలను చంపుకునో లేక వాయిదా వేసుకునో రోజులను వెళ్లదీసే మహిళల సంఖ్యే ఎక్కువ. అలాంటి ప్రపంచం నుంచి వచ్చినవారిలో ముక్తాసింగ్‌ ఒకరు. కలలను వాయిదా వేసుకుంటూ, మధ్య మధ్య వాటిని వదలకుండా బతికించుకునే ప్రయత్నం జీవితమంతా చేస్తూనే ఉన్న ముక్తాసింగ్‌ ఒక కళాకారిణి, రచయిత్రి. ఆరుపదుల వయసులో మోడలింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.

‘రిటైర్‌ అయ్యే వయసులో పని చేయడం గర్వంగా ఉంది’ అంటూ తన గురించి చెప్పే ముక్తాసింగ్‌ గురించి తెలుసుకుంటే తమ జీవితంలోనూ ఇవి ప్రేరణ నింపే విషయాలు అనుకోకుండా ఉండరు. గురుగ్రామ్‌లో ఉంటున్న ముక్తా ఈ 60 ఏళ్ల వయసులో  మోడలింగ్‌ చేస్తూ, పెయింటింగ్స్‌ వేస్తూ తన కలలు ఇప్పుడెలా నిజం చేసుకుంటున్నారో గమనిస్తే...

‘మనలో చాలామంది వయసు పెరిగేకొద్దీ హుందాగా కనిపించాలని లేని భారమేదో మోస్తున్నట్టుగా ఉండాలనుకుంటాం. కానీ, ఉత్తమంగా ఉండాలని కోరుకుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తాం. ఫలితంగా జీవన ప్రమాణాలను పెంచుకుంటాం’ అంటారు ముక్తా.

బాధ్యతల బరువు నుంచి..
ఫైటర్‌ పైలట్‌ని వివాహం చేసుకుంది ముక్తాసింగ్‌. అతని కెరియర్, ఆశయాలు, తరచూ బదిలీలు జరగడంతో ఆమె తన కలలను అణిచివేసుకుంది. పిల్లలు పుట్టడం, వారిని చూసుకోవడం, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడంలో ఏళ్లకేళ్లు గడిపేసింది. అన్ని దశల్లోనూ ఊపిరి సలపని బాధ్యతలు. నలుగురిని ఆలోచింపజేసే వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. కానీ, చేయలేకపోయేది.

అయినప్పటికీ ఎంతో కొంత తీరిక చేసుకుని వార్తాపత్రికలకు, మ్యాగజైన్ల కు వ్యాసాలు పంపేది. కానీ, పూర్తి సమయం తన కెరీర్‌కు కేటాయించలేకపోతున్నాను అని మధనపడేది. సంగీతం ఆంటే ఎనలేని ప్రేమ. పెయింటింగ్‌ చేయాలనే ఆలోచనతో సంగీత చిహ్నాలను కాన్వాస్‌పై చిత్రించేది. అప్పుడు చేయలేని పనులు ఈ వయసులో చేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీగాయకుల ముఖచిత్రాలను చిత్రిస్తోంది. ఫ్రీలాన్సర్‌గా వార్తాపత్రిక లకు కథనాలు రాస్తుంది.

ఆలోచింప జేసిన జీవనం
వీటిన్నింటి ద్వారా ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. కానీ, నాడు బాధ్యతల నడుమ సరైన వేదికేదీ దొరకలేదు. దీంతోపాటు తన కలలను కనుల వెనుకే దాచేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించింది. తనలో దాగున్న కళను నలుగురితో పంచుకోవడానికి ఓదార్పుగా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ దొరికింది. ఉన్న కొద్దిసమయంలో చేసే కళను పోస్ట్‌ చేయడం, నలుగురికి పరిచయం చేయాలని తపిస్తోంది. చాలాసార్లు తన తల్లి అనారోగ్యం ఆమెను ఆలోచింపజేసింది. దినచర్యపై శ్రద్ధ పెట్టడం చేసేది. ఫిట్‌నెస్‌ గురించి పట్టించుకునేది. పిల్లలు స్థిరపడ్డారు. అదేపనిగా కురుస్తున్న వాన కాస్త తెరిపి ఇచ్చినట్టు అనిపించింది.

మార్చిన అవకాశం
తెలిసినవారి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఫ్యాషన్‌ డిజైనర్‌ పరిచయం అవడంతో ముక్తాసింగ్‌ జీవిత గమనమే మారిపోయింది. ఆ డిజైనర్‌ ముక్తాని తన డ్రెస్‌లకు మోడలింగ్‌ చేయమని కోరింది. ‘ఈ వయసులో మోడలింగ్‌ ఏంటి?’ అని చాలా మంది నిరుత్సాపూరితమైన మాటలు అన్నప్పటికీ పట్టుదలతో మోడలింగ్‌ అవకాశాన్ని ఎంచుకుంది. ఈ కొత్త ఇన్నింగ్స్‌తో ఆమె కుటుంబం కూడా సంతోషించింది.

ఇదే రంగంలో ఇంకా మంచి అవకాశాలు ఆమెకోసం వస్తున్నాయి. ‘పదవీ విరమణ అంచున ఉన్నప్పుడు పని చేయడం గర్వంగా ఉంది’ అంటారు ముక్తా. వృద్ధాప్యాన్ని చాలా ఆకర్షణీయంగా అవకాశంగా మార్చుకున్న వ్యక్తుల చిత్రాలు కూడా తన సోషల్‌మీడియా పేజీ ద్వారా పోస్ట్‌ చేస్తుంది. వారిలో స్టీవ్‌ టైలర్, అగాథాక్రిస్టి, మహారాణి గాయత్రీదేవి, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌..ల చిత్రాలు ఉన్నాయి.

‘ఎన్ని పనులున్నా ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ పెట్టడం వల్ల నాకు మరో అవకాశం వచ్చింది. పెరిగే వయసును స్వీకరించాలి. అలాగే, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మనదైన శైలిని చూపడమూ నేర్చుకోవాలి. మనమంటే ఏంటో కూడా నలుగురికి తెలియజేయాలి’ అని చెప్పే ముక్తా సింగ్‌ మాటలు రిటైర్మెంట్‌ దశలో ఉన్న అందరిలోనూ తప్పక ఆలోచనను కలిగిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement