'నా గదికి వెళ్లగానే పెద్దగా ఏడ్చేశాను' | Myanmar Beauty Queens Impassioned Speech Against Military | Sakshi
Sakshi News home page

గదికి వెళ్లి పెద్దగా ఏడ్చేశాను.. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను

Published Wed, Apr 7 2021 12:00 AM | Last Updated on Wed, Apr 7 2021 10:02 AM

Myanmar Beauty Queens Impassioned Speech Against Military - Sakshi

థాయిలాండ్‌లో మార్చి 27న ‘మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌’ అందాల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో మయన్మార్‌ మోడల్‌ హ్యాన్‌ లే గెలవలేకపోయింది! అయితే ఆమెను ఒక ‘పరమోద్వేగిని’గా లోకం తన హృదయానికి హత్తుకుంది. ఆ అందాల పోటీ వేదికపై హ్యాన్‌ లే.. ‘తక్షణం మీ సహాయం కావాలి’ అంటూ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను కదిలించింది. చెమరించిన కళ్లతో జడ్జిలు, పోటీలో పాల్గొన్న మిగతా అమ్మాయిలు హ్యాన్‌ లే లోని ఆత్మసౌందర్యాన్ని దర్శించారు. మయన్మార్‌లో ఇప్పుడేం జరుగుతోందో తెలిసిందే! ప్రపంచం ఇప్పుడేం చేయాలో హ్యాన్‌ లే తన ప్రసంగంలో తెలియజెప్పింది. మయన్మార్‌లో సైనిక పాలకులు పాల్పడుతున్న అరాచకాలకు అడ్డకట్ట వేయాలని హ్యాన్‌ లే అభ్యర్థించింది.

థాయిలాండ్‌లో 2013లో ప్రారంభమై, గత ఏడేళ్లుగా ‘మిస్‌ గ్రాండ్‌ థాయిలాండ్‌’, ‘మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ థాయిలాండ్‌’ అందాల పోటీలు జరుగుతున్నాయి. మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్‌ను ఈ ఏడాది అమెరికా అందాల రాణి అబెనా అపయా గెలుచుకున్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సమంతా (ఫిలిప్పీన్స్‌) ఫస్ట్‌ రన్నర్‌–అప్‌గా, ఇవానా (గటెమలా) సెకండ్‌ రన్నర్‌–అప్‌గా విజయం సాధించారు. మయన్మార్‌ నుంచి పోటీలో పాల్గొన్న హ్యాన్‌ లే ఈ మూడు స్థానాలలో లేనప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం పొందగలిగింది. ఆ స్థానానికి అందమైన కిరీటం లేకపోవచ్చు. కానీ అందమైన ఆమె మనసే అందాల కిరీటంలా ఆ రోజు వేదికంతటా ధగధగలాడింది. తన జన్మభూమిని కాపాడమంటూ స్టేజ్‌ మీద నుంచి ఆమె చేసిన విజ్ఞప్తి ఆమె భావోద్వేగాలను స్ఫూర్తి శతఘ్నుల్లా మార్చి ప్రపంచాన్ని కదిలించేలా చేసింది. ‘అందాల వేదికపై బంధ విముక్తి ప్రసంగం’ అంటూ.. అంతా ఆమె ప్రయత్నాన్ని నేటికీ కొనియాడుతూనే ఉన్నారు. తన  దేశం, తన ప్రజలు తిరుగుబాటు మిలటరీ పాలకుల కబంధ హస్తాలలో చిక్కుకుపోయి విలవిలాడుతున్న దృశ్యాన్ని ఇరవై రెండేళ్ల హ్యాన్‌ లే అంత హృద్యంగా ఆవిష్కరించింది మరి! 


హ్యాన్‌ లే, స్టేజ్‌పై కంటతడి

ఆ రోజు థాయిలాండ్‌లో ‘మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌’ పోటీలు జరుగుతున్న సమయానికి మయన్మార్‌లో మారణహోమం జరుగుతూ ఉంది. సైనిక పాలకుల చేతుల్లో ఆ ఒక్కరోజే 141 ప్రదర్శనకారులు చనిపోయారు. ఇక్కడ పోటీలో ఉన్న హ్యాన్‌ లే కు ఆ వార్త చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి1న ప్రజా ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలదోసి, మయన్మార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకున్న సైనిక నేతలు అప్పటికే 550 మంది పౌరులను కాల్చి చంపారు. ఆ వార్తల్ని కూడా హ్యాన్‌ లే వింటూ ఉంది. మయన్మార్‌ పౌరులొక్కరే రోడ్ల మీదకు వచ్చి సైనిక నియంతలతో పోరాడుతున్నారు. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఒక్క దేశమూ సహాయానికి రావడం లేదు. హ్యాన్‌ లే తట్టుకోలేకపోయింది. ఆ అంతర్జాతీయ అందాల పోటీ వేదిక మీద నుంచే అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ‘‘ఇక ఆగే సమయం లేదు. వెంటనే సహాయానికి రండి’’ అని దుఃఖంతో పూడుకుపోతున్న స్వరంతో విజ్ఞప్తి చేసింది. 


హ్యాన్‌ లే ప్రసంగం మధ్యలో స్క్రీన్‌పై మయన్మార్‌ హింసాఘటనల దృశ్యాలు 

‘‘ఒకటైతే చెప్పగలను. మయన్మార్‌ పౌరులు ఎప్పటికీ ఆశ వదులుకోరు’’.
‘‘వాళ్లు వీధుల్లోకి వచ్చిన పోరాడుతున్నారు. నేను ఈ వేదికపై నుంచి నా నిరసన గళాన్ని వినిపిస్తున్నాను’’.
‘‘నా భావోద్రేకాలను నియంత్రించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒకటీ రెండు నిముషాల్లోనే యావత్‌ప్రపంచానికీ నేను చెప్పదలచింది చెప్పుకోవాలి.’’
‘‘రావడమే ఇక్కడికి నేను అపరాధ భావనతో వచ్చాను. ఇక్కడి వచ్చాక కూడా ఇక్కడ ఎలా ఉండాలో అలా నేను లేను.  అందాల రాణులు చిరునవ్వుతో ఉండాలి. అందర్నీ నవ్వుతూ పలకరించాలి. అందరితో కలుపుగోలుగా ఉండాలి. నేను అలా ఉండలేకపోయాను.’’

.. హ్యాన్‌ లే ఈ రెండు మాటలు మాట్లాడుతున్నప్పుడు వేదిక మౌనముద్ర దాల్చింది. సహానుభూతిగా ఆమె వైపు చూసింది. ఈ అందాల పోటీల వ్యవస్థాపకులు 47 ఏళ్ల నవత్‌ ఇత్సారాగ్రిసిల్‌ వెంటనే వేదిక పైకి వచ్చారు. ‘‘హ్యాన్‌ లే ను మనం మయన్మార్‌ పంపలేం. నేననుకోవడం.. ఈ ప్రసంగం తర్వాత అక్కడి ‘జుంటా’ పాలకులు ఆమె తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మయన్మార్‌లో దిగగానే ఆమెను అరెస్ట్‌ చేసి జైల్లో పెడతారు. తనను మనం కాపాడుకోవాలి. ఏ దేశమైనా హ్యాన్‌ లేకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రావాలి’’ అని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రపంచానికి రెండు పిలుపులు. ఒకటి: మయన్మార్‌ను కాపాడటం కోసం. రెండు: హ్యాన లే కు ఆశ్రయం ఇవ్వడం కోసం. 

రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను
‘‘నా లోపలిదంతా నేను మాట్లాడేయాలి. నిన్న రాత్రి నేను నా గదికి వెళ్లగానే పెద్దగా ఏడ్చేశాను. అది ఆగని దుఃఖధార. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మయన్మార్‌లో చనిపోతున్నవారంతా మన ఈడు వారు. యువకులు. పెద్దవాళ్లు చేస్తున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న యువతీ యువకులను తూటాలు నేల కూల్చేస్తున్నాయి. ఈ నరమేధాన్ని ఆపేందుకు ప్రపంచం ముందుకు రావాలి’’
– మిస్‌ హ్యాన్‌ లే, మయన్మార్‌ (థాయిలాండ్‌ అందాల పోటీ వేదికపై)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement