లక్ష్మీ సదన్
Nameplate campaign: ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అంటారు. అష్టకష్టాలేమి ఖర్మ... అరవై నాలుగు కష్టాలైనా పడి ఇల్లు కట్టుకుంటారు చాలామంది. అంతకష్టపడి కట్టుకున్న ఇంటికి తమకు ఇష్టమైన దైవానికి అంకితం చేస్తూ ఆ పేరు పెట్టుకుంటారు కొందరు. ప్రకృతికి సంబంధించిన పేర్లతో తమ భావుకత్వాన్ని చాటుకుంటారు ఇంకొందరు. ఒక ఇంటి ఉనికి ఆ పేరులో ప్రతిధ్వనిస్తుంది.
ఇక విషయంలోకి వద్దాం...
హరియాణాలోని హిస్సార్ జిల్లాలోని మయ్యార్ అనే చిన్న గ్రామం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద స్ఫూర్తి ఇస్తోంది. దీనికి కారణం... ప్రతి గ్రామస్థుడు తన ఇంటికి కూమార్తె లేదా కోడలు పేరు పెట్టడం. దీనికి ‘నేమ్‌ప్లేట్ క్యాంపెయిన్’ అని నామకరణం చేశారు. మంచి పని కోసం గ్రామం అంతా ఒక తాటిపై నిలబడింది అంటారు. ఆ తాటిపై నుంచి రకరకాలుగా జారేవారు కూడా ఉంటారు.
చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే..
‘నేమ్‌ప్లేట్ క్యాంపెయిన్’కు ముందు ఇలాంటి సమస్యే ఎదురైంది. ‘ఎవరి పేరో ఎందుకు, నా పేరే పెట్టుకుంటాను. రెక్కలు ముక్కలు చేసుకొని, పైసా పైసా కష్టపడి ఇల్లు కట్టాను’ అంటారు ఒకరు. ‘నాకు ఆడపిల్లలెవరూ లేరు. కోడలు ఇంకా రాలేదు’ అని సాకు వెదుక్కుంటారు మరొకరు. అంతమాత్రాన ఎవరితో ఎవరు పోట్లాడింది లేదు. మంచి మాట కంటే మంచి పరిష్కారం ఏముంటుంది!
‘మనలో మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడానికి నేమ్‌ప్లేట్ క్యాంపెయిన్ ఉపయోగపడుతుంది’ అంటూ ఊరి పెద్దలో ఒకరు ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడు సావధానంగా విన్నవారు తప్ప ‘అలా ఎలా అవుతుంది!’ అని అడ్డుపడ్డవారు లేరు. మంచి మాట కదా!
చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!
‘ఎక్కడి వరకో ఎందుకో... మన ఊరు విషయానికి వద్దాం’ అంటూ ఆ ఊళ్లో తమ కుటుంబం కోసం కష్టపడిన మహిళలు, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డిన మహిళల నిజజీవిత కథల గురించి ప్రస్తావించినప్పుడు... వ్యతిరేకించినవారు లేరు. ఎందుకంటే నలుగురికి ఉపకారం చేసే మంచి మాట కదా!
ఎట్టకేలకు ఊరంతా ఏకమైంది... ‘నేమ్‌ప్లేట్’ ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఆడపడుచు పేరు. ప్రతి ఇల్లు మహిళ పేరుతో గుర్తించబడుతుంది. విశేషమేమిటంటే ఇప్పుడు మయ్యార్ చుట్టుపక్కల గ్రామాలకు స్ఫూర్తి ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment