హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆహారాన్ని తరలిస్తున్న ఒక డ్రోన్ కలకలం సృష్టించింది. సౌత్ సిటీలోని జి బ్లాక్ మీదుగా ఆహారాన్ని తీసుకువెళుతున్న ఆ డ్రోన్ హఠాత్తుగా ఒక ఇంటిపై పడిపోయింది.
ఈ ఘటనలో సుమారు 30 కిలోల బరువున్న ఆహార పదార్థాలు ఆ ఇంటిపై పడటంతో పాటు ఇంటి బాల్కనీ, డిష్ యాంటెన్నా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఇంటి బాల్కనీలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అకస్మాత్తుగా హౌస్ నంబర్ జి-68 పైనుండి పెద్ద శబ్దం వచ్చింది. ఇంటి యజమాని బయటకు వచ్చి చూసేసరికి డ్రోన్ శిథిలాలు, మరికొన్ని వస్తువులు అక్కడ పడి ఉన్నాయి.
ఆహార సరఫరా కోసం డ్రోన్ల ట్రయల్ జరుగుతున్నదని. ఇందుకోసం అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నట్లు ఆ కంపెనీ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందజేస్తామని ఆ కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో ప్రధాని పర్యటన సందర్భంగా డ్రోన్‌లను ఎగురవేయడంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇదే సమయంలో డ్రోన్లను ఎగురవేసేందుకు ఆ కంపెనీకి అనుమతి ఎలా లభించిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
అయితే నిషేధ ఉత్తర్వుల గురించి తెలుసుకున్న డ్రోన్ పైలట్ ఈ భవనంపై అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉదంతంపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం డ్రోన్‌లోని సాంకేతిక లోపం కారణంగా అది కూలిపోయింది. ఈ ఘటనపై సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ పాడైన డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నమన్నారు. అలాగే సదరు కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment