దేశంలో పలు గ్రామాల్లో నేటికీ అప్పుడప్పుడూ పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. సమాజంలో పరువును కాపాడుకునే ప్రయత్నంలో కొందరు పెద్దలు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా అటువంటి ఉదంతం హర్యానాలో వెలుగు చూసింది.
ఫరీదాబాద్‌లోని దౌజ్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఇంటిలో 10 నెలల క్రితం ఒక యువతి మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఆ యువతి అస్తిపంజరాన్ని పోలీసులు వెలికి తీసి, స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న బాలిక తండ్రి మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఆ యువతి తల్లిని విచారించగా అసలు విషయం బయటపడింది.
10 నెలల క్రితం తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకునితో వెళ్లిపోయి, తరువాత ఇంటికి వచ్చిందని, అయితే చుట్టుపక్కలవారి మాటలు విని, అవమానంగా భావించి ఉరివేసుకున్నదని తెలిపింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే, పరువుపోతుందని భావించి, తన సోదరుని సాయంతో కుమార్తె మృతదేహాన్ని ఇంటిలోనే పాతిపెట్టామని తల్లి పోలీసులకు వివరించింది.
విషయమంతా తెలియడంతో పోలీసులు పోలీసులు తహసీల్దార్, ఏసీపీ సమక్షంలో మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి తాహిర్ గత పదేళ్లుగా సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. అతని ఎనిమిదిమంది సంతానం తల్లి దగ్గర ఫరీదాబాద్‌లో ఉంటున్నారు. తన కుమార్తె హత్యకు గురై ఉండవచ్చునని తాహిర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment