తారామ‌తి బారాద‌రిలో కన్నుల పండుగగా నాట్య‌తోర‌ణం! | Natya Thoranam 2023 At Taramati Baradari On Saturday | Sakshi
Sakshi News home page

తారామ‌తి బారాద‌రిలో కన్నుల పండుగగా నాట్య‌తోర‌ణం!

Published Sun, Oct 29 2023 2:32 PM | Last Updated on Sun, Oct 29 2023 2:40 PM

Natya Thoranam 2023 At Taramati Baradari On Saturday - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: ఒక‌వైపు కూచిపూడి.. మ‌రోవైపు భ‌ర‌త‌నాట్యం.. ఇవే కాదు, ఇంకా క‌థ‌క్‌, మోహినియ‌ట్టం, ఒడిస్సిల‌తో పాటు తెలంగాణ‌లోని పురాత‌న నృత్య‌శైలి అయిన పేరిణి నృత్యం.. ఇవ‌న్నీ ఒక్క‌చోటే కొలువుదీరాయి. న‌గ‌రంలోని ప్ర‌ముఖ క‌ళావేదిక అయిన తారామ‌తి బారాద‌రిలో గ‌ల కేలిక ఇండోర్ ఆడిటోరియంలో శ‌నివారం సాయంత్రం అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్టు వారి మూడో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన నాట్య‌తోర‌ణం-2023 క‌ళాప్రియుల మ‌ది దోచుకుంది. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ ఆన్‌లైన్ సందేశం పంపారు.

“అమృత కల్చరల్ ట్రస్టుకు ఆల్ ది బెస్ట్. నా పని నిరంత‌రం మారుతుంటుంది. అందువ‌ల్ల నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేటి సాంస్కృతిక ఉత్సవాన్ని నేను వ్యక్తిగతంగా వచ్చి ఆస్వాదించలేకపోతున్నాను. స్వీయ వ్యక్తీకరణ ఉత్తమ రూపాలలో నృత్యం ఒకటి. భారతీయ శాస్త్రీయ నృత్యాలు మన దేశ గొప్ప సాంస్కృతిక, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. నేటి కాలంలో వీటికి మన ప్రోత్సాహం అవసరం. కళాకారులకు తోడ్పాటునందించి, ప్రామాణిక నృత్య పాఠశాలల నుంచి విస్తృతమైన శాస్త్రీయ నృత్య రూపాలను తెలంగాణకు తీసుకువచ్చిన అమృత కల్చరల్ ట్రస్టును అభినందిస్తున్నాను” అని తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్ట‌ర్ తోట చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, “ఈరోజు అవార్డులు గెలుచుకున్న‌వారితో పాటు నృత్యాలు ప్ర‌ద‌ర్శించిన క‌ళాకారులంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలుపుతూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను చూసిన అత్యుత్తమ జుగల్బందీలలో ఇది ఒకటి. ఇంతకుముందు కూడా అమృత కల్చరల్ ట్రస్టు కార్యక్రమాల్లో పాల్గొని మన సామాజిక నిర్మాణంలో సంప్రదాయాలను పరిరక్షించడానికి వారు చూపుతున్న‌ అంకితభావానికి మంత్రముగ్ధుడిన‌య్యాను.

ఈ వారసత్వాన్ని మిగతా తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని చెప్పారు. నిర్వ‌హ‌ణ క‌మిటీ చీఫ్ రాజేష్ ప‌గ‌డాల మాట్లాడుతూ, “అమృత కల్చరల్ ట్రస్ట్ అనేది లాభాపేక్షలేని సంస్థ, ఇది కళలను పెంపొందించడం, ప్రోత్సహించడంలో ముందుంటుంది. తనను, చుట్టుపక్కల ప్రజలను మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సాధించడానికి, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, పురాణాల మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక నృత్య కళాకారుడికి జీవితకాల అంకితభావం అవసరమన్న‌ది మా బలమైన నమ్మకం. నృత్యాన్ని వృత్తిగా ఎంచుకునే ప్రతిభావంతులైన కళాకారులకు స్కాలర్షిప్లు కూడా అందిస్తాం” అన్నారు.

యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ప‌ర్స‌న్ భార్గ‌వి ప‌గ‌డాల మాట్లాడుతూ, “పాత, కనుమరుగవుతున్న శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను బలోపేతం చేయడం.. సాంకేతికత, సామాజిక మాధ్యమాలను ఉపయోగించి అవగాహనను ప్రోత్సహించడం మా లక్ష్యం. ప్ర‌త్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువ ప్రతిభావంతులను ప్రేరేపిస్తున్నాం. దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని ర‌కాల శాస్త్రీయ నృత్య‌రీతుల‌ను ఒకే వేదికపైకి తీసుకువస్తాము. మా ప్రేక్షకులు, అభిరుచి గల ఔత్సాహికులు ముందుకు రావడానికి, భారతీయ శాస్త్రీయ నృత్యకళలకు దోహదం చేయడానికి చేస్తున్న మా ఈ ప్రయత్నాలు.. కళాకారుల అవగాహనను పెంచుతాయని మేము విశ్వసిస్తున్నాము” అని ఆశాభావం వ్య‌క్తంచేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు... ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి బడుగుల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ నృత్య విభాగాధిపతి డాక్టర్ అనురాధ జొన్నలగడ్డ, హైదరాబాద్ పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్య విభాగాధిపతి కళారత్న డాక్టర్ వనజ ఉదయ్, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి కుమార్తె, అభినయవాణి నృత్యనికేతన్ వ్యవస్థాపకురాలు చావలి బాలా త్రిపురసుందరి, ప్ర‌ముఖ నాట్య‌గురువు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని లాస్యకల్ప ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ వ్యవస్థాపక డైరెక్టర్ డి.ఎస్.వి. శాస్త్రి.

(చదవండి: ఇజ్రాయెల్‌ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్‌ అవుతోందంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement