జీవితంలో ఏదో అవ్వాలనుకుని ఇంకేదో అవుతుంటాము. కొన్నిసార్లు మనం ఏది అనుకున్నా డెస్టినేషన్ లో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. అచ్చం ఇలానే నేత్రా కుమనన్ జీవితంలో జరిగింది. నేత్ర మరెవరో కాదు మన దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొనే తొలి మహిళా సెయిలర్. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేత్ర సెయిలర్ అవ్వాలనుకోలేదు. అందరిలాగే స్కూలుకెళ్లి చదువుకుంటోన్న నేత్ర పన్నెండేళ్ల వయసులో మొదట టెన్నిస్ నేర్చుకుందామని బ్యాట్ పట్టుకుంది. కానీ అది కుదరలేదు. తర్వాత సైక్లింగ్ చేద్దామనుకుంది ఇది కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఇలా కాదు భారతీయ సంప్రదాయాలకు తగ్గట్టుగా భరతనాట్యం నేర్చుకుందామనుకుంది. అది కూడా పూర్తి చేయలేదు. అనుకోకుండా వేసవిసెలవుల్లో నేత్ర వాళ్ల అమ్మ ‘‘సమ్మర్ క్యాంప్‌లో భాగంగా సెయిలింగ్ నేర్పుతున్నారు వెళ్లు’’ అని చెప్పడంతో నేత్ర అక్కడికి వెళ్లింది. అప్పుడు తనకు తెలియదు. భవిష్యత్తులో దేశంలోనే తొలి మహిళా సెయిలర్‌ని అవుతానని.
ఇటీవల ఒమన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్ లో నేత్ర టాప్‌లో నిలిచి ఒలింపిక్స్ బెర్త్ కొట్టేసింది. 21 పాయింట్ల తేడాతో భారత్‌కు చెందిన రమ్య, శరవణపై పైచేయి సాధించి క్వాలిఫై అయింది. మరోరేసు మిగిలి ఉండగానే నేత్ర టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సమీప ప్రత్యర్థిపై నేత్ర 21 పాయింట్ల ఆధిక్యంలో ఉండడంతో ఒకరోజు ముందుగానే ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం. ఇప్పటిదాకా తొమ్మిది మంది సెయిలర్‌లు భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొనగా తొలిసారి మహిళా విభాగంలో నేత్ర అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతోన్న నేత్ర రెండుసార్లు జాతీయ ఛాంపియన్ షిప్‌లు గెలుచుకుంది. మరో రెండు సందర్భాల్లో రన్నరప్‌గా నిలిచింది. 2018లో జకార్తాలో జరిగిన ఏíషియన్ గేమ్స్‌లో లేజర్ రేడియల్‌లో ఐదోస్థానం లో నిలిచింది. గతేడాది జనవరిలో జరిగిన హెంపల్ వరల్డ్ కప్ సిరీస్‌లో కాంస్యపతకం గెలుచుకుంది. సెయిలింగ్ వరల్డ్ కప్ మెడల్ గెలుచున్న తొలి భారతీయ మహిళగా నేత్ర చరిత్ర సృష్టించింది. గత కొన్నేళ్లుగా జాతీయ చాంపియన్‌గా నిలుస్తోన్న నేత్ర ఏషియన్ గేమ్స్‌లో కొద్దిలో మిస్ అయినప్పటికీ నిరంతర కృషితో ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు చేరుకుంది.
నేత్ర మాట్లాడుతూ..‘‘నేను చెన్నైలో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఒకసారి సమ్మర్ క్యాంప్‌లో భాగంగా తొలిసారి సెయిలింగ్‌లో పాల్గొన్నాను. ఇతర రకాల క్రీడలతో పోలిస్తే ఇది విభిన్నంగా ఉంటుంది. సెయిలింగ్ చేయడానికి మానసిక ధైర్యం చాలా అవసరం. ఒకసారి చూద్దాం అని వెళ్లిన నేను సెయిలింగ్ బాగా నచ్చడంతో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నాను. గతేడాది లాక్‌డౌన్ సమయంలో స్పెయిన్‌లో చిక్కుకుపోయాను. అప్పుడు రెండుసార్లు ఒలింపియన్‌గా నిలిచిన హంగేరియాకు చెందిన థామస్ ఇస్జ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. రేసింగ్‌లో ఒత్తిడిని ఎలా జయించాలో ఆయన చక్కగా వివరించారు. ఒకటిన్నర ఏడాదిపాటు ఇంటికి దూరంగా ఉండి కఠోర దీక్షతో కష్టపడడంతో ఈరోజు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాను’’అని నేత్ర చెప్పింది. ‘‘ఇవి నా తొలి ఒలింపిక్ గేమ్స్. సాయశక్తులా ప్రయత్నించి ఈ పోటీలో గెలవడానికి ప్రయత్నిస్తాను. తరువాతి ఒలింపిక్స్‌లో కూడా పోటీపడతా’’ అని నేత్ర ధీమా వ్యక్తం చేసింది. ఇక ఆన్‌లైన్ క్లాస్‌లు జరుగుతుండడం వల్ల ఇటు నా బీటెక్ ను అటు సెయిలింగ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను. మా నాన్న గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనవల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న.. నా వెనుక ఉండి ఆయన నన్ను ముందుకు నడిపించారు.’’ అని నేత్ర చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment