కాత్యాయని అంటే కరాటే | Telangana Women Ready to Olympics | Sakshi
Sakshi News home page

కాత్యాయని అంటే కరాటే

Published Mon, Feb 12 2018 2:23 PM | Last Updated on Mon, Feb 12 2018 2:23 PM

Telangana Women Ready to Olympics - Sakshi

వెంగళరావునగర్‌: కాత్యాయని..బరిలోకి దిగిందంటే బంగారం పట్టాల్సిందే.. పోటీలు ఎక్కడైనా పతకం మాత్రమే ఆమె చేతుల్లోకే... ఆమె పంచ్‌కు తిరుగులేదు... నిన్న మొన్నటి వరకు కరాటేతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించి ఇపుడు కిక్‌ బాక్సింగ్‌లో ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది. ఆమే కాత్యాయని.. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని ఈస్ట్‌ రహమత్‌నగర్‌బస్తీలో నివసించే తెలంగాణా తేజం ఎస్‌.కాత్యాయని వివిధ పోటీల్లో రాణిస్తూ మన్ననలందుకుంటోంది.  

సాధారణ కుటుంబంలో పుట్టి...
ఈస్ట్‌ రహమత్‌నగర్‌నగర్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన కాత్యాయనికి చిన్నతనం నుంచే కరాటే అంటే ఇష్టం. ఆమె ఐదో తరగతిలో ఉండగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తండ్రి ధర్మారావు మరింత ప్రోత్సహించాడు. 6వ తరగతిలోనే కరాటేలో చేర్పించాడు. ఇటు చదువు అటు కరాటే శిక్షణలో రాణిస్తూ పదో తరగతి పూర్తయ్యేనాటికి కరాటేలో బ్లాక్‌బెల్టు సాధించింది. ఓ వైపు చదువు.. మరోవైపు కరాటేతో సాధన చేస్తోంది. అలా డిగ్రీ పూర్తి చేసింది. ఆమె పట్టుదల చూసిన సుమన్‌ చోటాకాన్‌ ఆర్గనైజర్‌æమాస్టర్‌ బూడిద సైదులు ఆమెను పోటీలకు పంపారు. తొలిసారిగా 2007లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది. అనంతరం తిరుగులేని విజయాలు సాధిస్తూ గోల్డ్‌మెడల్స్‌ సొంతం చేసుకుంది. ఈనెలలో పూణెలో జరిగిన జాతీయస్థాయి కిక్‌ బాక్సింగ్‌లో ఏకకాలంలో మూడు స్వర్ణాలు సాధించింది.   మార్చిలో థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు, అలాగే ఒలింపిక్స్‌ కోసం అహర్నిశలు కృషి చేస్తుంది.

సాధించిన విజయాలు
2006లో సుమన్‌ బుడోఖాన్‌ కరాటే ఆర్గనైజేషన్‌లో చేరి 2007లో నగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వెండి పతకం.

2008లో మిర్యాలగూడలో జరిగిన రాష్ట్రస్థాయిలో పోటీల్లో స్వర్ణ పతకం.  

2009లో నగరంలోని ఫిలింనగర్‌ దర్గా వద్ద జరిగిన జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం.

2010లో చోటాకాన్‌ నేషనల్‌ హిప్‌ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో వెండి పతకం.

2011లో విక్టరీ కరాటే  ఆర్గనైజేషన్‌ సరూర్‌నగర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం.

  2014లో విశాఖపట్నంలో నాయుడు బుడోఖాన్‌ నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్‌.

ఈ ఏడాది 12–14 తేదీల్లో పూణేలో ఐకో కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కిక్‌బాక్సింగ్‌(ఫుట్‌ కాంటాక్ట్, వెపన్‌ ఈవెంట్, కిక్‌లైట్‌) పోటీల్లో మూడు బంగారు పతకాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement